బీడీ ఆకుల సేకరణకు వెళ్ళిన మహిళలపై పులి దాడి.. నలుగురు మృతి
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీడీ ఆకులు (తెండు ఆకులు) సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన నలుగురు మహిళలపై పులి దాడి చేసి అక్కడికక్కడే చంపేసింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం గంజేవాహి గ్రామం సమీప అటవీ ప్రాంతంలో జరిగింది. అటవీశాఖ అధికారుల సమాచారం ప్రకారం, గ్రామస్తులైన ఈ మహిళలు ఉదయం 8 గంటల ప్రాంతంలో బీడీ ఆకులు ఏరుకోవడానికి అడవికి వెళ్లారు.
బీడీ ఆకులు ఏరుకునే వారిపై పులి దాడి , నలుగురు మృతి
ఆకులు ఏరుకుంటున్న సమయంలో ఒక పులి హఠాత్తుగా వారిపై దాడి చేసింది. దీంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా మహిళలు భయపడి కేకలు వేస్తూ పరుగెత్తి తప్పించుకున్నారు.మృతుల వివరాలు చూస్తే కవుదుబాయి దాదాజీ మొహర్లే, అనుబాయి దాదాజీ మొహర్లే, సునీతా కౌశిక్ మొహర్లే, సంగీతా సంతోష్ మృతి చెందారు. వీరంతా గంజేవాహి గ్రామానికి చెందినవారు.

ఒకే పులి దాడి చేసిందా? దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ ప్రాంతంలో బీడీ ఆకుల సేకరణ గ్రామీణులకు ప్రధాన ఆదాయ వనరు. కానీ అడవుల్లోకి వెళ్లడం ఇక్కడ స్థానికులకు ప్రమాదకరంగా మారుతోంది. సమాచారం అందగానే అటవీశాఖ సిబ్బంది స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పంచనామా నిర్వహించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఒకే పులి దాడి చేసిందా లేదా ఒకటికి మించి పులులు ఉన్నాయా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
గ్రామీణులలో భయం
ఈ ఘటనతో గంజేవాహి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అడవికి వెళ్లాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు. పులిని పట్టుకోవాలని, అడవుల్లో సురక్షిత చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంచరిస్తున్న పులలను పట్టుకోవాలని సమీప గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

పెట్రోలింగ్ పెంచిన అధికారులు
చంద్రపూర్ జిల్లా పులుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇటీవల కాలంలో గ్రామీణులు ఆదాయం కోసం అడవులపై ఆధారపడటం, పులుల సంఖ్య పెరగడం వల్ల ఇలాంటి సంఘటనలు ఎక్కువవుతున్నాయి.అటవీశాఖ అధికారులు ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచారు. గ్రామస్తులు అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సహాయం అందించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications