వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ సంక్షోభం భారత విమానాల రెక్కలు విరిచిందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎయిర్ ఇండియా, విమానయాన రంగం

కోవిడ్ మహమ్మారి కారణంగా భారత విమానయాన రంగం కుంటుపడింది. అరకొర లాభాలతోనే పనిచేస్తున్న సంస్థలు సంక్షోభంలో చిక్కుకుని మరింత కుదేలయ్యాయి.

"నా సొంత ఇల్లు అమ్మేసి ఓ చిన్న ఇంట్లోకి మారాను. ఇంటికోసం తీసుకున్న అప్పుడు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే అమ్మేశాను" అని గతంలో ఎయిర్ ఇండియాలో పైలట్‌గా పనిచేసిన ఒకాయన చెప్పారు.

"అప్పు కట్టడం ఆలస్యం అయినందుకు బ్యాంకు వాళ్లు వేధించడం మొదలుపెట్టారు. ఇంటికి కూడా మనుషులను పంపించారు. చాలా ఇబ్బందికరంగా అనిపించిది. అందుకే ఎంతో బాధతో ఇంటిని అమ్మేశాను" అని ఆయన అన్నారు.

ఒకప్పుడు ఎయిర్ ఇండియా విమాన పైలట్ అంటే మంచి ఉద్యోగం. 2011లో సీనియర్ పైలట్ల సంపాదన ఏడాదికి ఒక కోటి రూపాయల వరకూ ఉండేది. ప్రస్తుత మారకపు రేటు ప్రకారం చూస్తే అది ఇంకా ఎక్కువ.

అలాంటి ఎయిర్ ఇండియా కూడా కొన్నేళ్లుగా సంక్షోభంలో ఉంది. సంస్థను అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సరైన కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కరోనా మహమ్మారి వ్యాపించడంతో అవకాశాలు మరింత దెబ్బతిన్నాయి. సంస్థకున్న 24 వేల కోట్ల రూపాయల రుణాన్ని కూడా తగ్గించి కొనుగోలుదారులను ఆకర్షించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఒక్క ఎయిర్ ఇండియా మాత్రమే కాదు, మొత్తం భారత విమానయాన రంగం కొన్నేళ్లుగా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. విజయవంతమైన జెట్ ఎయిర్ వేస్‌ సంస్థతో సహా ఏడు ఎయిర్‌లైన్స్ సంస్థల పరిస్థితి కూడా క్లిష్టంగా మారింది.

ప్రస్తుతం కోవిడ్ కారణంగా విమానయాన సంస్థలన్నీ చిక్కుల్లోనే ఉన్నాయి. ఏళ్ల తరబడిగా పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక పన్నులు, తక్కువ డిమాండ్, తీవ్రమైన పోటీ... పరిస్థితిని మరింత దిగజార్చాయి.

2019లో సాంకేతిక కారణాలతో బోయింగ్ 737 మాక్స్ విమానాల వినియోగాన్ని ఆపేశారు. ప్రాట్ & విట్నీ ఇంజిన్లతో ఎయిర్‌బస్‌కు సమస్యలు ఉండటం కూడా ప్రతికూలంగా మారింది. వీటికి తోడు కోవిడ్ మహమ్మారి విజృభించడంతో భారత విమానయాన రంగం కుదేలయ్యింది. తగ్గిన విమాన ఇంధన ధరలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, దీర్ఘకాల నష్టాలను పూడ్చడానికి సరిపోవట్లేదు.

విమానయాన రంగం

ప్రస్తుతం భారత్‌లో నడుస్తున్న ఎనిమిది ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో సంస్థ ముందంజలో ఉంది. వీటిల్లో ఎయిర్ దక్కన్ సంస్థ మాత్రమే ఏప్రిల్‌లో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఎయిర్ లైన్స్ సిబ్బందికి వేతన రహిత సెలవులు ప్రకటించింది.

భారత విమాన సంస్థలు ప్రమాదంలో ఉన్నాయని సెంటర్ ఫర్ ఏవియేషన్ సౌత్ ఏసియా (సీఏపీఏ) సీఈఓ కపిల్ కౌల్ తెలిపారు.

ప్రయాణికులు తగ్గిపోవడం ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సమస్య. కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల రెండు నెలలకు పైగా విమాన ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్ తరువాత విమాన ప్రయాణాలకు అనుమతి ఇచ్చినప్పటికీ, దేశీయ ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంది. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇంకా తక్కువగా ఉంది.

రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ గణాంకాల ప్రకారం 2020 మే నుంచీ సెప్టెంబర్ వరకూ ప్రయాణికుల సంఖ్య 1.1 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే వ్యవధిలో ప్రయాణికుల సంఖ్య 7 కోట్లు.

2021లో కూడా ప్రయాణికుల రద్దీ తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని ఐసీఆర్ఏ వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా తెలిపారు.

ఈ పరిస్థితుల్లో అన్ని విమాన సంస్థలూ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ఈ ఏడాది ఎయిర్ ఇండియాలో మాత్రమే 48 మంది పైలట్లు ఉద్యోగాలను కోల్పోయారు. ఇతర సంస్థలు కూడా తమ పైలట్లలో అనేకమందికి వేతన రహిత సెలవులను ప్రకటించాయి. పని చేస్తున్నవారికి వేతనంలో 30 శాతం దాకా కోత పెట్టాయని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కీర్తి తెలిపారు.

విమానయాన రంగం

భారత విమానయాన రంగం, అనుబంధ సంస్థలలో మొత్తం 30 లక్షల ఉద్యోగాలకు గండిపడొచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అంచనా వేసింది.

వ్యయాన్ని తగ్గించుకోవడానికి వేతనాలను తగ్గించడం, సిబ్బందిని తొలగించడం తప్ప మరో మార్గం లేదని కేర్ రేటింగ్స్‌కు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ ఊర్వశి జగదీశ్ అభిప్రాయపడ్డారు.

రాబడి నిలిచిపోవడం, ఇంధనం, నిర్వహణలకు అయ్యే ఖర్చు, పార్కింగ్ ఛార్జీలు విమాన సంస్థల నియంత్రణలో లేకపోవడం ఈ పరిస్థితులకు కారణంగా చెప్పుకోవచ్చు.

ఇండిగో, ఎయిర్ ఏసియా లాంటి బడ్జెట్ విమాన సంస్థలకు కూడా గడ్డుకాలమే నడుస్తోంది. ఈ సంస్థలు టికెట్ ధరలు పెంచకుండా వ్యయాన్ని భరిస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడడానికి ఈ రెండు సంస్థలూ కూడా కోట్లల్లో నిధులను సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఊర్వశి జగదీశ్ తెలిపారు.

"ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం మానసికంగా చాలా ఒత్తిడిని కలగజేస్తుంది. కానీ, పని చేయడం తప్ప మరో మార్గం లేదు. ఒకప్పుడు నేను లక్షల్లో గడించేవాడిని. ఇప్పుడు గంటకు ఆరు వేల రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతున్నాను. నా సేవింగ్స్ కూడా నిండుకుంటున్నాయి" అని పైలట్ అమలేందు పాథక్ తెలిపారు.

పైలట్లకే కాక ఇతర సిబ్బందికి కూడా పరిస్థితి కష్టంగానే ఉంది. ఒక ప్రైవేట్ విమాన సంస్థ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న రితిక శ్రీవాస్తవకు మరొక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కంపెనీ అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం రావడంతో 2020 మార్చిలో తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. అయితే, కోవిడ్ కారణంగా ఆవిడకు వచ్చిన కొత్త ఉద్యోగం నిలిచిపోయింది.

"పరిస్థితులు చక్కబడగానే మళ్లీ పిలుస్తామని చెప్పారు. కానీ అది సాధ్యపడకపోవచ్చు" అని రితిక అన్నారు.

"ఇప్పుడు నాకు ఉన్న ఉద్యోగం పోయింది, కోవిడ్ కారణంగా అనుకున్న కొత్త ఉద్యోగం రాలేదు. గత ఏడు నెలలుగా వేరే ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ, ఎక్కడా దొరకట్లేదు. నా సహచరుడికి కూడా జీతంలో 30 శాతం తగ్గించారు. మా సేవింగ్స్ కూడా తగ్గిపోతుండడంతో దిల్లీలో నివసించడం కష్టమైపోయింది. అందుకే మా సొంతూరు వారణాసికి వెళిపోయాం" అని రితిక తెలిపారు.

విమానయాన రంగం

వైరస్ వ్యాప్తి పెరుగుతుండడం, ఎప్పటికి పరిస్థితులు చక్కబడతాయో తెలియని అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం, భారత ఆర్థిక వ్యవస్థ మందగించడం... ఇవన్నీ భారత విమానయాన రంగంపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో, భారత ప్రభుత్వం నగదు రూపంలో రుణ సహాయం చేస్తే విమానయాన పరిశ్రమ తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయి.

"ఇతర మార్గాల్లో కూడా ప్రభుత్వం సహాయం అందించవచ్చు. ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ఛార్జీలు లేదా నావిగేషన్ ఛార్జీలను మూడు నెలలవరకూ తొలగించడం వలన కూడా కొంత వెసులుబాటు ఉంటుంది" అని ఊర్వశి జగదీశ్ అభిప్రాయపడుతున్నారు.

"డిమాండ్ మెరుగవుతోంది కానీ, అది ఇంకా గణనీయంగా తక్కువ స్థాయిలోనే ఉంది. 2022 చివరి వరకూ సేవలు విస్తరించే అవకాశాలు కూడా లేవు" అని సీఏపీఏకి చెందిన కపిల్ కౌల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The coronavirus crisis has broken the wings of Indian aviation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X