వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 ఏళ్ల వయసులోనే సన్యాసినిగా మారిన వజ్రాల వ్యాపారి కూతురు...ఈ నిర్ణయంపై ఎవరేమన్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
8 ఏళ్ల వయసులో సన్యాసినిగా మారిన దేవాన్షి

దేవాన్షి సంఘ్వీ.. ఎనిమిదేళ్ల ఈ పాప లక్షలాది కోట్ల వజ్రాల వ్యాపారాన్ని తన చేతుల మీదుగా నిర్వహించేలా పెరగాల్సి ఉంది.

కానీ, ఈ సంపన్న భారతీయ వజ్రాల వ్యాపారి కూతురు ప్రస్తుతం విలాసవంతమైన జీవితాన్ని, సుఖ సంపదలను వదులుకుని సన్యాసినిగా మారిపోయారు.

తెల్లటి చీర, కాలికి చెప్పులు కూడా లేకుండా, ఇంటింటికీ వెళ్తూ సన్యాసి జీవితాన్ని పుచ్చుకున్నారు.

ధనేశ్, అమి సంఘ్వీలకు జన్మించిన ఇద్దరి కూతుర్లలో దేవాన్షి పెద్ద కూతురు. ఈమె గత వారమే సన్యాసినిగా దీక్ష పుచ్చుకున్నారు.

ప్రపంచంలో అత్యంత పురాతన మతాలలో ఒకటి జైనం. భారత్‌లో ఈ మతం 2,500 ఏళ్ల క్రితం నాటిది. జైన మతాన్ని అనుసరిస్తున్న 45 లక్షల మందిలో సంఘ్వీలు కూడా ఉన్నారు.

భౌతిక ప్రపంచాన్ని త్యజించే జైనుల సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతున్నట్లు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే, దేవాన్షి లాంటి చిన్న పిల్లలు ఇలా సన్యాసినిగా మారే కేసులు అసాధారణమని అన్నారు.

వేలాది మంది జైన సాధువుల సమక్షంలో గుజరాత్‌లోని సూరత్ నగరంలో జరిగిన వేడుకలో దేవాన్షి ఈ దీక్షను చేపట్టారు.

తన తల్లిదండ్రులతో కలిసి నగరంలోని సూరత్ నగరంలోని వేసు ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేడుకకు దేవాన్షి వచ్చారు. ఆ సమయంలో ఆమె తలపై వజ్రాలతో రూపొందిన కిరీటాన్ని కూడా ధరించారు.

ఈ వేడుక పూర్తయిన తర్వాత, ఇతర సన్యాసినిలతో పాటు తను కూడా తెల్లటి చీర ధరించి, గుండు చేయించుకుని తన తలను ఆ చీర కొంగుతో కప్పేసుకున్నారు.

తను చేతిలో చీపురు కట్ట కూడా పట్టుకున్నట్లు ఫొటోగ్రాఫ్‌లలో కనిపిస్తుంది. తాము ప్రయాణించే దారిలో ఏమైనా పురుగులు, కీటకాలు అనుకోకుండా ఎదురువస్తే వాటికి ఎలాంటి హానీ జరగకుండా ఉండేలా ఈ చీపురు కట్టను వాడుతుంటారు జైనులు.

దేవాన్షి సన్యాసినిగా మారిన దగ్గర్నుంచి జైన సాధువులు, ఇతర సన్యాసులు నివసించే ఉపాశ్రయలోనే నివసిస్తున్నారు.

''ఆమె ఇక ఇంట్లో నివసించదు. తల్లిదండ్రులు కూడా ఆమె తల్లిదండ్రులు కారు. ఆమె ఇక సాధ్వి(సన్యాసిని)’’ అని స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుడు, సంఘ్వీ కుటుంబానికి స్నేహితుడు అయిన కీర్తి షా అన్నారు. కీర్తి షా కూడా సూరత్‌లో ప్రముఖ వజ్రాల వ్యాపారి

''జైన సాధువుల జీవితం చాలా నిరాడంబరంగా సాగుతుంది. ఆమె ఎక్కడికెళ్లాలన్నా నడిచే వెళ్తుంది. ఎలాంటి రవాణా సాధనాన్ని ఉపయోగించుకోదు. నేలపై తెల్లటి వస్త్రంపైనే దేవాన్షి నిద్రపోతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఆహారాన్ని ముట్టుకోదు’’ అని అన్నారు.

8 ఏళ్ల వయసులో సన్యాసినిగా మారిన దేవాన్షి

చిన్న వయసులోనే సన్యాసినిలుగా మారేందుకు అంగీకరించే ఒకే ఒక్క జైన వర్గం సంఘ్వీలు. మిగిలిన మూడు వర్గాల వారు పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాతనే సన్యాసినిగా మారేందుకు ఒప్పుకుంటారు.

దేవాన్షి తల్లిదండ్రులకు దేవుడంటే అపారమైన భక్తి ఉంది. దేవాన్షి చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక జీవితంపై ఎక్కువగా ప్రీతి చూపించేదని సంఘ్వీ కుటుంబ స్నేహితుల్లో ఒకరు మీడియాకు తెలిపారు.

దేవాన్షి అసలు టీవీని, మూవీలను చూడదని, మాల్స్‌కి, రెస్టారెంట్లకి వెళ్లదని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

చిన్నప్పటి నుంచే దేవాన్షి రోజులో మూడుసార్లు దేవునికి ప్రార్థన చేసేదని, రెండేళ్ల వయసు నుంచే ఉపవాసాలు చేయడం ప్రారంభించిందని ఈ వార్తాకథనం తెలిపింది.

సన్యాసినిగా మారుతూ, అన్ని సుఖ సంపదలను త్యజించే ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందు, సంఘ్వీ కుటుంబం సూరత్‌లో అతిపెద్ద వేడుకను నిర్వహించింది.

ఆ వేడుకలో భాగంగా గుర్రాలు, ఒంటెలు, ఎండ్ల బండ్లు, డ్రమ్మర్లతో సందడి చేస్తూ పందిరిని మోసుకుంటూ అబ్బాయిలు వీధుల్లో తిరిగారు. నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

దేవాన్షి, వారి కుటుంబం ఏనుగుపై ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. వారు ప్రయాణిస్తున్న మార్గంలో ప్రజలు గులాబి రేకులతో స్వాగతం పలికారు.

సంఘ్వీలు ఎక్కువగా వ్యాపారాలు నిర్వహించే ప్రాంతాలైన ముంబై, బెల్జియంలోని ఆంట్వెర్ప్‌ నగరంలో కూడా ఈ వేడుకలను నిర్వహించారు.

దేవాన్షి సన్యాసినిగా మారే ఈ విధానానికి జైన్ కమ్యూనిటీ నుంచి పూర్తి మద్దతు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా మాత్రం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తన జీవితంలో ముఖ్యమైన విషయాలను ఎంచుకునే వయసు వచ్చేంత వరకు ఆ కుటుంబం ఆగలేకపోయిందా? అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

8 ఏళ్ల వయసులో సన్యాసినిగా మారిన దేవాన్షి

దేవాన్షి దీక్ష వేడుకకు ఆహ్వానం అందుకున్న షా, పిల్లలు ఇలా మారే విధానం నచ్చక ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. ఏ మతం కూడా పిల్లలు సన్యాసినిగా మారేందుకు అనుమతించదని ఆయన ఉద్ఘాటించారు. ఇది తనకు చాలా అసౌకర్యంగా ఉన్నట్టు తెలిపారు.

'తను చిన్నపిల్ల, వీటన్నింటి గురించి తనేం అర్థం చేసుకోగలదు?’ అంటూ షా ప్రశ్నించారు. 16 ఏళ్లు వచ్చేంత వరకు పిల్లలు కాలేజీలో వారేం చదవాలనుకుంటున్నారో కూడా నిర్ణయించుకోలేరని అన్నారు.

తన పూర్తి జీవితంపై ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని వారెలా తీసుకోగలుగుతారని ప్రశ్నించారు.

ఈ పాప భౌతిక ప్రపంచాన్ని త్యజించడాన్ని దేవతగా భావించి కమ్యూనిటీ వేడుకగా నిర్వహిస్తుంది. ఇది ఆ పాపకు అతిపెద్ద పార్టీలాగా అనిపిస్తుందని ముంబైలోని పిల్లల సంరక్షణ నిపుణురాలు ప్రొఫెసర్ నీలిమా మెహతా అన్నారు.

కానీ, సన్యాసినిగా మారిన జైనుల జీవితం చాలా కష్టతరంగా ఉంటుందన్నారు. ఈ పాపకు ఎదురయ్యే కష్టాలు, సౌకర్యాల లేమి ఊహించని రీతిలో ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత చిన్న వయసులోనే కుటుంబ సంరక్షణ నుంచి పాపని వేరు చేయడంపై ఇతర కమ్యూనిటీ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు ఆ కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. సంఘ్వీలు పిల్లల హక్కులకు భంగం కలిగిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, భౌతిక ప్రపంచం నుంచి పిల్లల్ని వేరు చేసే ఈ విధానానికి స్వస్తి చెప్పేలా చర్యలు తీసుకోవాలని షా కోరారు.

దేవాన్షి వ్యవహారంలో ప్రభుత్వం ఏదైనా చేయగలదా అని అడిగేందుకు తాను జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ చీఫ్ ప్రియాంక్ కనుంగో కార్యాలయాన్ని ఆశ్రయించినట్టు షా చెప్పారు. కానీ, ఇది అంత తేలిగ్గా జరిగేలా కనిపించడం లేదన్నారు.

ఇది చాలా సున్నితమైన విషయం కావడంతో దీనిపై కామెంట్ చేయడానికి తాను నిరాకరిస్తున్నట్టు కనుంగో కార్యాలయం తెలిపింది.

8 ఏళ్ల వయసులో సన్యాసినిగా మారిన దేవాన్షి

దేవాన్షి హక్కులను ఉల్లంఘించారని బాలల హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

పిల్లల సమ్మతి చట్టంలో సమ్మతికి వీలు లేకపోవడంతో పాప స్వతహాగా కోరుకునే జీవితం నుంచి తప్పించి తనని సాధువుగా మార్చేశారని ప్రొఫెసర్ మెహతా అన్నారు.

చట్టపరంగా 18 ఏళ్లు వయసు వచ్చాకనే పిల్లలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు పిల్లల తరఫున పెద్దలు(తల్లిదండ్రులు) నిర్ణయం తీసుకోవచ్చు.

ఒకవేళ వారు తీసుకునే నిర్ణయం పిల్లల విద్యను, మానసిక జీవితాన్ని ప్రభావం చేస్తుందని భావిస్తే, అది పిల్లల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది.

ఆధ్యాత్మిక ప్రపంచంలో చట్టపరమైన సిద్ధాంతాలు వర్తించవని ముంబై యూనివర్సిటీలో జైన్ సిద్ధాంతాలను బోధించే డాక్టర్ బిపిన్ దోషి అన్నారు.

''ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు పిల్లలు అంత మెచ్యూర్ కాదని కొందరు అంటుంటారు. కానీ, చిన్న వయసులోనే పెద్దల కంటే ఎక్కువగా ఆలోచించే, సాధించే ఉన్నతమైన మేధో సామర్థ్యాలు పిల్లలకు ఉంటాయి. అదేవిధంగా కొందరు పిల్లలు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు. ఒకవేళ వారు సాధువులుగా మారితే తప్పేముంది?’’ అని బిపిన్ దోషి ప్రశ్నించారు.

అంతేకాక, దేవాన్షి ఏ విధంగానూ ఇబ్బందులకు గురి కావడం లేదన్నారు.

8 ఏళ్ల వయసులో సన్యాసినిగా మారిన దేవాన్షి

"సుఖ సంపదలను, సంతోషాలను, వినోదాలను ఆమె కోల్పోవచ్చు. కానీ, అవి అందరికీ అవసరమా? ప్రేమ, విద్యను దేవాన్షి కోల్పోతుందనే దానికి నేను అంగీకరించను. ఆమె గురువు నుంచి ప్రేమను పొందుతుంది. నిజాయితీని, ఎలాంటి ఆకర్ణణలకు లోనుకాని జీవితాన్ని ఆమె నేర్చుకుంటుంది. అది మంచిది కాదా?’’ అని దోషి అన్నారు.

ఒకవేళ మున్ముందు దేవాన్షి మనసు మారితే, తాను తీసుకున్న నిర్ణయంపై ఆలోచించుకోవచ్చన్నారు.

తన గురువు ప్రలోభాల కింద తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు దేవాన్షి భావిస్తే, భౌతిక ప్రపంచంలోకి ఏ సమయంలోనైనా తిరిగి రావొచ్చన్నారు.

అప్పుడు తాను పెద్దగా అయి నిర్ణయం తీసుకునేంత వరకు ఎందుకు ఆగలేదని ప్రొఫెసర్ మెహతా అన్నారు.

''పిల్లల మనసులు చాలా తేలిగ్గా మారుతూ ఉంటాయి. కొన్నేళ్ల తర్వాత ఆమె కోరుకున్న జీవితం ఇది కాదని దేవాన్షి భావించవచ్చు’’ అని మెహతా అన్నారు.

చాలా మంది అమ్మాయిల మనసులు వయసు పెరిగే కొద్ది మారిపోతూ ఉంటాయని పలు కేసులను ఉటంకిస్తూ ఈ విషయాన్ని చెప్పారు.

కొన్నేళ్ల క్రితం ఒక యువ జైన్ సన్యాసిని తన కేంద్రం నుంచి పారిపోయిన కేసును తాను డీల్ చేసినట్టు తెలిపారు. అక్కడ ఆమె చాలా వేదనకు గురైనట్టు చెప్పారు.

2009లో మరో అమ్మాయి కూడా సన్యాసినిగా మారిన తర్వాత పారిపోయి వచ్చి తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుందన్నారు.

వీటిపై అంతకుముందు కోర్టులో ఎన్నో పిటిషన్లు దాఖలై ఉన్నాయి. కానీ, ఏ సామాజిక సంస్కరణ అయినా సవాలుతో కూడుకున్నదై ఉంటుందని, ఎందుకంటే దానిలో ఎన్నో సున్నితమైన విషయాలు ఇమిడి ఉంటాయని ప్రొఫెసర్ మెహతా చెప్పారు.

’’ఇది కేవలం జైనులకు సంబంధించినదే కాదు. హిందూ అమ్మాయిలు దేవుళ్లను పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత దేవదాసిగా మారిపోతారు. 1947లో ఈ విధానాన్ని చట్టవిరుద్దమైనప్పటికీ ఇలా జరుగుతూనే ఉంది. చిన్న వయసులోనే అబ్బాయిలు కూడా ఆధ్యాత్మిక కేంద్రాలలో చేరుతున్నారు. బుద్దిజంలోని పిల్లలు సాధువులుగా మఠాల్లో నివసిస్తున్నారు’’ అని అన్నారు.

అన్ని మతాల్లో పిల్లలు ఇలా బాధపడుతున్నారని చెప్పారు. కుటుంబాలు, సమాజం మేల్కోవాలని, పిల్లలు మీ సొత్తు కాదని తెలుసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The daughter of a diamond merchant who became a nun at the age of 8...who said what her decision?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X