రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా, దేశ్‌ముఖ్ రికార్డు గెలుపు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా శాసన సభల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడుతున్నాయి. లోకసభ ఎన్నికల అనంతరం ప్రజాదరణ ఏ రీతిలో ఉందో తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి ఇదో అవకాశం ఉంటుంది. రెండు రాష్ట్రాల్లోను బీజేపీదే హవా కొనసాగుతుందని... మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని, మేజిక్ ఫిగర్‌కు కొంత తక్కువ సీట్లు వస్తాయని, శివసేన రెండో స్థానంలో ఉంటుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెప్పాయి. అలాగే, హర్యానాలా బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని సర్వేలో తేలింది.

మహారాష్ట్రలో బీజేపీ 109 స్థానాలను, శివసన 57, ఎన్సీపీ 40, కాంగ్రెస్ 43 స్తానాల్లో గెలుపొందింది. మజ్లిస్ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ ఇంకా 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
హర్యానాలో బీజేపీ 47, ఐఎన్ఎల్డీ 19, కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలుపొందింది.
మహారాష్ట్రలో సీనియర్ నేత గణపత్ రావ్ దేశ్‌ముఖ్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ నేత 88 ఏళ్ల గణపత్ 11వసారి గెలుపొందారు. షోలాపూర్ జిల్లా సంగోలా నుండి ఆయన ఎన్నికయ్యారు. 1972, 1995 మినహా.. 1962 నుండి ఆయన గెలుపొందుతున్నారు.
బీజేపీకి షరతులు లేకుండా బయటి నుండి మద్దతిచ్చేందుకు ఎన్సీపీ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశ్యమని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు.
బీజేపీకి మద్దతిచ్చేందుకు శివసేన ముందుకు వచ్చింది. అయితే, చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని షరతు విధించింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి అధికారం దక్కాలంటే మరో ఇరవైకి పైగా స్థానాలు అవసరం కానున్నాయి.
అసెంబ్లీలో పూర్తి ఆధిక్యం సాధించిన బీజేపీకి హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడా అభినందనలు తెలిపారు. ప్రజల నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నామని, బీజేపీ సాధించిన ఫలితాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. కొత్త ప్రభుత్వం అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నానని చెప్పారు.
ఐఎన్ఎల్డీ చీఫ్ దుష్యంత్ చౌతాలా మనవడు, పార్టీ యువనేత దుష్యంత్ చౌతాలా హర్యానాలోని ఉచన్ కలన్ నియోజకవర్గం నుండి ఓడిపోయారు. ఆయన బీజేపీ అభ్యర్థి ప్రేమలత చేతిలో పరాజయం పాలయ్యారు.
మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు... మహారాష్ట్రలో బీజేపీ 66, శివసేన 29, కాంగ్రెస్ 25, ఎన్సీపీ 21, ఎమ్మెన్నెస్ 1 స్థానంలో, హర్యానాలో బీజేపీ 46, ఐఎన్ఎల్డీ 20, కాంగ్రెస్ 15 స్థానాలలో గెలుపొందింది.
కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు ప్రజలు చరమగీతం పలుకుతున్నారన్న విషయం మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో నిరూపితమైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల అంతులేని అవినీతి, కుంభకోణాలే ఆ పార్టీ కొంపముంచాయన్నారు. మోడీ నాయకత్వంపై ప్రజలకు అంచంచలమైన విశ్వాసం ఉందని ఎన్నికల ద్వారా తెలిసిందన్నారు. మోడీ నేతృత్వంలోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. మహారాష్ట్రలో శివసేనతో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు ఫలిస్తే పూర్తి మెజారిటీ సాధించినట్టవుతుందన్నారు. హర్యానాలో 4 స్థానాల నుంచి అధికారం చేపట్టేంత వరకు ఎదిగామన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే ఢిల్లీలో సైతం సొంతంగా అధికారాన్ని చేజిక్కించుకుంటామన్నారు.
హర్యానాలోని సోనేపట్ జిల్లాలో రాయ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జై తీర్థ్ దహియా తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్డీ అభ్యర్థి ఇందర్ జిత్ దహియా పైన కేవలం మూడు ఓట్ల తేడాతో గెలుపొందారు. జై తీర్థ్‌కు 36,703 ఓట్లు, ఇందర్ జిత్‌కు 36,700 ఓట్లు వచ్చాయి.
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మాణిక్ రావ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం కళ తప్పింది.
మహారాష్ట్రలో బీజేపీ 46, శివసేన 26, కాంగ్రెస్ 20, ఎన్సీపీ 20 ఎమ్మెన్నెస్ 1 స్థానంలో గెలుపొందాయి. హర్యానాలో బీజేపీ 42, ఐఎన్ఎల్డీ 17, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుపొందాయి.
మహారాష్ట్ర ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థి సీఎం అవుతారన్నారు. సీఎం అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందన్నారు.
తాను చేపట్టిన అభివృద్ధి తనను గెలిపించిందని ఛగన్ భుజలాల్ అన్నారు.
ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఛగన్ భుజలాల్ యవ్లా నియోజకవర్గం నుండి గెలుపొందారు.
మహారాష్ట్రలో బీడ్ లోకసభకు జరిగిన ఉప ఎన్నికల్లో దివంగత గోపినాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే ఘన విజయం సాధించారు. ఆమె 1.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అజిత్ పవార్ బారామతి నియోజకవర్గం నుండి 70వేలు పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.
మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ గెలుపొందారు. ఇతను కరాస్ సౌత్ నుండి విజయం సాధించారు.
హర్యానా హిస్సార్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ ఓటమి పాలయ్యారు. ఆమె తన సొంత నియోజకవర్గమైన హిస్సార్‌లో 74 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా గెలుపొందారు.
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో.. ఎన్సీపీ బీజేపీకి మద్దతివ్వవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై బీజేపీ స్పందించింది. తాను ఎన్సీపీ మద్దతును తీసుకనేది లేదని తేల్చి చెప్పింది.
మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఘన విజయం సాధించారు.
మహారాష్ట్రలో ఖాతా తెరిచే దిశలో మజ్లిస్ సాగుతోంది. ఆ పార్టీ నాలుగు చోట్ల ముందంజలో ఉంది.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశమున్న నేపథ్యంలో శివసేన, బీజేపీ మంతనాలు సాగిస్తున్నాయి.
మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు.
హర్యానాలో ఐఎన్ఎల్డీ యువనేత దుష్యంత్ ముందంజలో ఉన్నారు.
హర్యానాలో బీజేపీ 10, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందాయి.
మహారాష్ట్రలో బీజేపీ 5 స్థానాల్లో గెలుపొంది, 111 స్థానాల్లో ముందంజలో ఉంది. శివసేన 3 స్థానాల్లో, కాంగ్రెస్ 2, ఎన్సీపీ 3, ఎమ్మెన్నెస్ ఒక స్థానాల్లో గెలుపొందాయి.
మహారాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ఓటమి చవి చూశారు.
పదకొండు గంటల వరకు మహారాష్ట్రలో బీజేపీ 3 స్థానాలు గెలుచుకొని, 107 స్థానాల్లో ముందంజలో ఉంది. శివసేన 55 స్థానాల్లో ముందంజలో ఉంది. 1 స్థానాన్ని గెలుపొందింది. కాంగ్రెస్ 46 స్థానాల్లో ముందంజలో ఉంది. రెండింటిని గెలుచుకుంది. ఎన్సీపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఎమ్మెన్నెస్ ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది.
హర్యానాలో బీజేపీ 3 స్థానాల్లో గెలుపొంది, 43 స్థానాల్లో ముందంజలో ఉంది. ఐఎన్ఎల్డీ 23, కాంగ్రెస్ 13 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది. హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో బీజేపీ సాగుతోంది.
హర్యానాలో ఐఎన్ఎల్డీ చీఫ్ అశోక్ అరోరా వెనుకంజలో ఉన్నారు.
మహారాష్ట్రలో ఇప్పటి వరకు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. రెండో స్థానంలో శివసేన, మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మజ్లిస్ 3 స్థానాల్లో, ఎమ్మెన్నెస్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
హర్యానాలో బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 1 స్థానంలో గెలిచింది. ఐఎన్ఎల్డీ 21 స్థానాల్లో, కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఉదయం పదిన్నర గంటల వరకు.. మహారాష్ట్రలో బీజేపీ 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రెండు స్థానాల్లో గెలిచింది. శివసేన 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఒక స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 1 స్థానంలో గెలిచింది. ఎన్సీపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎమ్మెన్నెస్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
హర్యానాలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ వైపు దూసుకెళుతోంది. మొత్తం 90 స్థానాలకు గాను 85 స్థానాల ఫలితాలు వెల్లడవుతుండగా అందులో బీజేపీ దాదాపు 47 స్థానాల వరకు నిలిచింది. కాంగ్రెస్, ఎన్ఆర్ఎల్డీ పార్టీలు చెరో వరుసగా 14, 15 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. ఓ పార్టీ అధికారంలోకి రావలంటే 46 స్థానాలు రావాలి.
పర్లిలో దివంకత బీజేపీ నేత గోపినాథ్ ముండే కూతురు పంకజా ముండే ముందంజలో ఉన్నారు.
గత ఎన్నికల్లో 13 స్థానాలు గెలుచుకున్న రాజ్ థాకరే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్.. ఈసారి ప్రభావం చూపలేకపోయింది.
నిషాధ్‌లో శివసేన అభ్యర్థి అనిల్ కదమ్ గెలుపొందారు.
మహారాష్ట్రలో తొలి ఫలితం వచ్చింది... పుణేలోని పార్వతి నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధురి సతీష్ మిశాల్ విజయం సాధించారు.
సాయంత్రం ఆరు గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో శాసన సభా పక్ష నేతలను ఎన్నుకునే విషయమై చర్చించనుంది.
మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండే వెనుకంజలో ఉన్నారు.
హర్యానా నుండి పోటీ చేస్తున్న కేంద్రమంత్రు సుష్మా స్వరాజ్ సోదరి వందన శర్మ దూసుకు పోతున్నారు.
మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రజలు కాంగ్రెస్ పాలన నుండి విముక్తి పొందనున్నారని బీజేపీ అధికార ప్రతినిధి బిజయ్ మిశ్రా అన్నారు. నేటితో రెండు రాష్ట్రాల్లో కుటుంబ పాలన అంతమవుతుందని, బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందన్నారు.
హర్యానాలో క్లియర్ మెజార్టీ దిశగా, మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశలో బీజేపీ దీసుకెళ్తుండటంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది.
పది గంటల వరకు మహారాష్ట్రలో.. బీజేపీ 120, శివసేన 56, కాంగ్రెస్ 43, ఎన్సీపీ 38, ఎమ్మెన్నెస్ 3 స్థానాల్లో, హర్యానాలో.. బీజేపీ 49, కాంగ్రెస్ 14, ఐఎన్ఎల్డీ 15 స్థానాల్లో ముందంజలో ఉంది.
ఉదయం వెనుకబడిన ఫడ్నవిస్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పంకజ్ ముండే దూసుకు పోతున్నారు.
బీజేపీ గెలుపుకు సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ తీరే కారణమని ఎన్సీపీ దుయ్యబట్టింది.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్ వెనుకబడ్డారు. సీనియర్ నేత రావు సాహెబ్ కూడా వెనుకబడ్డారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సోదరి వందన శర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మహారాష్ట్ర హర్యానాల్లో బీజేపీ దూసుకు పోతోంది. కాంగ్రెస్, ఎన్సీపీలు చతికిలపడ్డాయి. రాజ్ థాకరే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ ప్రభావం చూపలేకపోతోంది.
ఉదయం తొమ్మిది గంటల వరకు మహారాష్ట్రలో.. బీజేపీ 117, శివసేన 53, కాంగ్రెస్ 31, ఎన్సీపీ, 34 స్థానాల్లో ముందంజలో ఉంది. హర్యానాలో.. బీజేపీ 30, ఎఎన్ఎల్డీ 12, కాంగ్రెస్ 13 మూడు స్థానాల్లో ఉన్నారు.
మహా ముఖ్యమంత్రి రేసులో ఫడ్నవిస్ ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలో.. బీజేపీ 88 స్థానాల్లో, శివసేన 44, కాంగ్రెస్ 30, ఎన్సీపీ 25 స్థానాల్లో, హర్యానాలో.. బీజేపీ 25, ఐఎన్ఎల్డీ 10, కాంగ్రెస్ 10, హెచ్‌జేసీ 1 స్థానంలో ముందంజలో ఉంది.
మహారాష్ట్రలో బీజేపీ 280, శివసేన 282, కాంగ్రెస్ 287, ఎన్సీపీ 278, ఎమ్మెన్నెస్ 219 స్థానాల్లో పోటీ చేశాయి.
హర్యానాలో బీజేపీ నాలుగు, స్థానిక ఐఎన్ఎల్డీ మూడు స్థానాల్లో ముందంజలో ఉంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రారంభంలోనే తన సత్తా చాటింది. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమై అర్ధగంట గడవకముందే బీజేపీ 22 స్థానాల్లో ముందంజలో ఉండగా, శివసేన 8 స్థానాల్లో, కాంగ్రెస్ 5, ఎన్సీపీ మూడు స్థానాల్లో ముందంజలో ఉంది.












Click it and Unblock the Notifications