రాజ్యసభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు- విపక్షాల రచ్చతో వాయిదా-ఇవాళ ఆమోదముద్ర
దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు నిన్న లోక్ సభ ఆమోదం తెలిపింది బిల్లును ప్రవేశపెట్టిన 20 నిమిషాల్లోనే దాన్ని ఆమోదించిన కేంద్రం విపక్షాల నిరసనల్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు. దీనిపై ఇప్పటికే విపక్షాలు మండిపడుతుండగా.. ఇవాళ రాజ్యసభలోనూ అదే తంతు తప్పేలా లేదు.
రాజ్యసభలో ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఎన్నికల చట్టాల సవరణ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. రాజ్యసభలో అధికార పక్ష నేత పీయూష్ గోయల్.. ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే దీనిపై చర్చ జరగకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. నిన్న బీఏసీ సమావేశంలో ఈ బిల్లుపై చర్చ కోసం మూడు గంటలు కేటాయించినట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అయితే విపక్షాలు మాత్రం దీన్ని అంగీకరించలేదు. సస్పెండైన ఎంపీలపై చర్చించాలని పట్టుబట్టాయి. దీంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసి వెళ్లిపోయారు.

నిన్న లోక్ సభలో ఆమోదం పొందిన తరహాలోనే ఇవాళ రాజ్యసభలోనూ ఎన్నికల చట్టాల సవరణ బిల్లు ఆమోదం పొందే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం లోపు విపక్షాలు సహకరించకపోతే మాత్రం కేంద్రం ఈ బిల్లును రాజ్యసభలో మూజు వాణి ఓటుతో ఆమోదించేందుకు సిద్ధమవుతోంది. అయినా విపక్షాలు మాత్రం పట్టు వీడటం లేదు. విపక్షాలు కోరుతున్న విధంగా సస్పెండైన ఎంపీలపై చర్చకు ఛైర్మన్ ఆమోదం తెలపకపోవడంతో ఇవాళ కూడా విపక్షాలు సభా కార్యకలాపాలు ముందుకు సాగనిచ్చే పరిస్ధితులు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు మూజువాణీ ఓటే శరణ్యం కానుంది.
అటు లోక్ సభలోనూ ఇదే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. లఖీంపూర్ ఖేరీ ఘటనకు బాధ్యుడైన కేంద్రమంత్రి అమిత్ మిశ్రా తేనీ బర్తరఫ్ కు పట్టుబడుతూ విపక్షాలు సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నాయి. వాస్తవానికి ఎల్లుండితో పార్లమెంటు సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications