CJI NV Ramana: మళ్లీ లాక్‌డౌన్: తేల్చేయనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంటోంది. ఊపిరి తీసుకోనివ్వని పరిస్థితులను కల్పించింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి మొత్తం విషపూరితమైంది. కాలుష్యం తీవ్రత మరింత అధికమైంది. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యం పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని నివారించడానికి లాక్‌డౌన్‌ను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం రెండురోజుల కిందటే ప్రభుత్వానికి సూచించారు. దీనిపై సమగ్ర నివేదికను అందజేయాలంటూ ఆదేశించారు.

లాక్‌డౌన్ ప్రతిపాదనలు రెడీ..
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీన్ని ఇవ్వాళ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కొన్ని ఆంక్షలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తెల్లవారు జాము నుంచి అవి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో పాఠశాలలు ఏవీ తెరచుకోలేదు. విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆన్‌లైన్, వర్చువల్ విధానంలో తరగతులకు హాజరవుతున్నారు. వారం రోజుల పాటు పాఠశాలలను మూసివేత కొనసాగుతుంది. పాఠశాల విద్యార్థులు వాయు కాలుష్యం బారిన పడకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం

ఎల్లుండి వరకూ నిషేధం..
వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా నిర్మాణ పనులను కూడా ఢిల్లీ ప్రభుత్వం నిలిపివేసింది. ఆదివారమే ఇది అమల్లోకి వచ్చింది. బుధవారం వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. ఎలాంటి నిర్మాణ పనులకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. భవనాలతో పాటు అన్ని రకాల నిర్మాణ పనులనూ నిషేధం కిందికి తీసుకొచ్చింది. గడువు ముగిసిన తరువాత పరిస్థితులను బట్టి దీని కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటుంది. కాలుష్యం తగ్గకపోతే.. ఈ వారాంతం వరకు పొడిగించే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..
ప్రభుత్వ ఉద్యోగులకు కేజ్రీవాల్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులెవరూ రోడ్డెక్కట్లేదు. ఇళ్ల నుంచే తమ విధులకు హాజరు కానున్నారు. ప్రైవేటు కార్యాలయాలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించినప్పటికీ.. పెద్దగా స్పందన రాలేదనే తెలుస్తోంది. ప్రైవేటు సంస్థలేవీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసలుబాటును కల్పించడానికి ముందుకు రాలేదని చెబుతున్నారు.

సుప్రీంకోర్టు నిర్ణయం మీదే..
పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధించడంపై ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ఇవ్వాళ సుప్రీంకోర్టుకు అందజేయనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో జస్టిిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. వాటిపై ప్రభుత్వం నుంచి అభిప్రాయాలను స్వీకరించిన తరువాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది.
Recommended Video

కనీసం రెండురోజుల పాటు
వాయు కాలుష్యాన్ని నివారించడానికి రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించాలని, దీనికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను అందజేయాలని చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం దీనిపై యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన తక్షణమే దీనిపై కసరత్తు మొదలు పెట్టింది. రెండురోజుల వ్యవధిలో ఈ ప్రతిపాదనలు, మార్గదర్శకాలను రూపొందించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ ప్రతిపాదనలను సుప్రీంకోర్టుకు సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications