రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు, సీసీటీవీ కెమెరాల్లో అడ్డంగా చిక్కారు, హోం మంత్రి క్లారిటీ !
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని కందలహళ్లిలోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు కేసులో నిందితుడి ఆచూకి గురించి కొన్ని సాక్షాలు చిక్కాయని, త్వరలో ప్రధాన నిందితుడిని పట్టుకుంటామని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు కారణంగా బెంగళూరు నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బెంగళూరు చాలా సేఫ్ సిటీ అని హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు.
బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆదివారం హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అధ్యక్షతన పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. పోలీసు అధికారులతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్ ఇప్పటి వరకు జరిగిన కేసు దర్యాప్తు, తదుపరి చేపట్టాల్సిన దర్యాప్తు అంశాలపై పోలీసు అధికారులతో చర్చించామని అన్నారు. నిందితుడి ముఖం సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమై ఉందని, ఆ కోణంలో విచారణ చేపట్టామని హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు.

ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ అధికారులు కూడా తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారని, ఒకరికొకరు సహకరించుకుంటూ కేసు దర్యాప్తు చేస్తామని, బెంగళూరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నగర ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు. బెంగళూరు నగరాన్ని సేఫ్ సిటీగా మార్చేందుకు మొదటి నుంచి తాము ప్రయత్నిస్తున్నామని, అందులో ఎలాంటి అనుమానం వద్దు అని హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్ అన్నారు.

బెంగళూరు పోలీసులు ప్రతి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించాలని, సున్నితమైన కదలికలపై పర్యవేక్షణతో పాటు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని నేను అన్ని డివిజన్ల డీసీపీలను ఆదేశించానని హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు. కేసు విచారణకు ఆటంకం కలిగించే సాంకేతిక సమాచారం వెల్లడించలేమని, కేసు దర్యాప్తు పూర్తి అయిన తరువాత తామే పూర్తి సమాచారం ఇస్తామని, అంత వరకు మీడియా కూడా ఓపిక పట్టాలని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ. నరమేశ్వర్ తెలిపారు.












Click it and Unblock the Notifications