MH Elections: లెక్క తేలింది - ఆట మొదలైంది..!!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. రెండు ప్రధాన కూటమిల మధ్య పోటీ హోరా హోరీగా మారింది. సుదీర్ఘ మంతనాల తరువాత రెండు కూటములు తమ భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చాయి. మిత్రపక్షాల కోసం కాంగ్రెస్ తమ సీట్ల ను తగ్గించుకుంది. బీజేపీ మాత్రం తగ్గేదే లేదంటూ సీట్ల పైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు పార్టీలు అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. ఇక అసలైన సమరం ఇప్పుడు మరాఠా గడ్డపై మొదలైంది.
సీట్ల ఖరారు
మహారాష్ట్రలో కూటముల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్, శివసేన , ఎన్‌సీపీ-ఎస్‌పీ మధ్య ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశం పైన నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. మూడు పార్టీల ఒప్పందం మేరకు కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 115 సీట్లలోనూ, ఉద్ధవ్ శివసేన 90 నుంచి 95 స్థానాల్లోనూ, శరద్‌పవార్ ఎన్‌సీపీ 75 నుంచి 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్ధుల ప్రకటన.. ప్రచారం గురించి కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు.

సర్దుబాటు పూర్తి
ప్రత్యర్థి కూటమిలో ప్రధాన పార్టీగా బీజేపీ దాదాపు 150-155 సీట్లలో పోటీకి సిద్దం అవుతోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 78-80 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 52-54 సీట్లు దక్కనున్నాయి. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఇదే స్థాయిలో సీట్ల పంపకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఇప్పటికే 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఫారమ్‌ల పంపిణీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే ) వర్గం 45 సీట్లను ఖరారు చేసింది. 38 మంది అభ్యర్ధులను ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ప్రకటించింది.
సమరానికి సిద్దం
కాగా, అజిత్ పవార్.. తన కుటుంబానికి కంచుకోట అయిన బారామతి స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీ వెల్లడించింది. గత రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని మహాయుతి కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించిన జోరు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఎంవీఏ భావిస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలు ఉండగా.. కూటమి 31 స్థానాలు గెలుచుకుంది. దీపావళి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యనేతల రాకతో ఎన్నికల సమరం నువ్వా నేనా అనే స్థాయిలో కొనసాగనుంది.












Click it and Unblock the Notifications