హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత విధేయుడిగా మెలిగిన అసఫ్ జా ముజఫరుల్ ముల్క్ సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో హైదరాబాద్ సంస్థానం సింహాసనాన్ని అధిరోహించారు.

ఆ కాలంలో ఆయన ప్రప్రంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధికెక్కారు.

1937 ఫిబ్రవరి 22న విడుదలైన టైమ్ మ్యాగజీన్ సంచికలో "ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి" అంటూ మీర్ ఉస్మాన్ అలీఖాన్‌పై కవర్ పేజీ కథనాన్ని ప్రచురించారు.

హైదరాబాద్ సంస్థానం వైశాల్యం 80,000 చదరపు కిలోమీటర్లకు పైగా ఉండేది. ఇది ఇంగ్లండ్, స్కాట్లండ్ మొత్తం వైశాల్యం కన్నా ఎక్కువ.

మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంత ధనవంతుడో అంత పిసినారి కూడా.

ఈ నిజాం నవాబుకు అత్యంత సన్నిహుతుడైన వాల్టర్ మాంక్టన్ జీవిత చరిత్ర 'ది లైఫ్ ఆఫ్ విస్కౌంట్ మాంక్టన్ ఆఫ్ బ్రెంచ్‌లీ’లో ఫ్రెడరిక్ బర్కెన్‌హెడ్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ గురించి పలు విషయాలు ప్రస్తావించారు.

"నిజాం నవాబు పొట్టిగా ఉండేవారు. కొంచం వంగి నడిచేవారు. ఆయన భుజాలు కూడా చిన్నవిగా ఉండేవి. వంపు తిరిగిన ఒక చేతికర్రను ఆసరాగా చేసుకుని నడిచేవారు. కొత్తవారిని చురుకుగా చూసేవారు. 35 ఏళ్ల పాత ఫేజ్ టోపీ ధరించేవారు. అందులో చుండ్రు పేరుకుపోయి ఉండేది."

"గోధుమరంగు షేర్వానీ, తెల్లటి పైజామా ధరించేవారు. మెడ దగ్గర గుండీలు పెట్టుకునేవారుకాదు. పసుపు రంగు సాక్సులు ధరించేవారు. అవి చివర్ల వదులుగా ఉండేవి. ఆయన తరచూ పైజామా తీసేస్తూ ఉండేవారు. అప్పుడు కాళ్లు కనిపించేవి.

నిజాం నవాబుకు చెడ్డ వ్యక్తిత్వంతో పాటూ ప్రజలపై ఆధిపత్యం చెలాయించే నైజం కూడా ఉండేది. ఒక్కోసారి కోపంతోనో లేదా ఉత్సాహంతోనో గట్టిగా అరిచేవారు. అప్పుడు ఆయన గొంతు యాభై గజాల దూరం వరకూ వినిపించేది."

1911లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ పట్టాభిషేకం సందర్భంగా తీసిన ఫొటో

చౌకైన సిగరెట్లు తాగే అలవాటు

దివాన్ జర్మనీ దాస్ తన ప్రసిద్ధ పుస్తకం 'మహారాజా'లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ గురించి రాస్తూ.. "ఆయన ఎవరినైనా తన ఆస్థానానికి అతిథిగా ఆహ్వానించినప్పుడు, వారికి మితంగా భోజనం వడ్డించేవారు. చాయ్‌తో పాటూ రెండే రెండు బిస్కట్లు పెట్టేవారు. ఒకటి ఆయనకి, మరొకటి అతిథికి. ఎంతమంది అతిథులంటే అన్ని బిస్కట్లు.. ఒక్కొక్కరికీ ఒక్కొక్క బిస్కట్ మాత్రమే.

ఆయన సన్నిహితులు అమెరికన్లు, బ్రిటిష్ లేదా టర్కీ దేశస్థులు సిగరెట్ ప్యాకెట్ అందిస్తే, వెంటనే నాలుగైదు సిగరెట్లు తీసుకుని తన సిగరెట్ కేసులో పెట్టుకునేవారు. ఆయన మాత్రం చౌకైన చార్మినార్ సిగరెట్లనే కొనుక్కుని కాల్చేవారు. అప్పట్లో పది సిగరెట్ల ప్యాకెట్ 12 పైసలకు దొరికేది" అని వివరించారు.

రజాకార్లతో మాట్లాడుతున్న నిజాం నమ్మిన బంటు ఖాసిం రిజ్వీ (కుడి)

వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా ఉపయోగించేవారు

హైదరాబాద్ నిజాం దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద 282 క్యారెట్ల జాకబ్ డైమండ్‌ ఉండేది. ఆ వజ్రం చిన్న నిమ్మకాయంత పరిమాణంలో ఉండేది. దాన్ని ప్రపంచం దృష్టి నుంచి కాపాడడానికి సబ్బుపెట్టెలో ఉంచేవారు. అప్పుడప్పుడూ పేపర్ వెయిట్‌లాగ వాడేవారు.

డొమినిక్ లాపియర్, లారీ కాలిన్స్ రచించిన 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ పుస్తకంలో ఒక ఆసక్తికరమైన ఉదంతాన్ని వివరించారు.

"హైదరాబాదు సంస్థానంలో ఒక ఆచారం ఉండేది. సంవత్సరంలో ఒకసారి సంస్థానానికి చెందిన రాచరిక వ్యక్తులు నవాబుకు ఒక బంగారు నాణేన్ని బహూకరించేవారు. నవాబు దాన్ని ఒకసారి తాకి, తిరిగి వారికి ఇచ్చేసేవారు.

కానీ, నిజాం చివరి నవాబు వాటిని వెనక్కి ఇవ్వకుండా సింహాసనానికి తగిలించిన ఒక కాగితపు సంచీలో ఉంచేవారు. ఒకసారి ఒక నాణెం కిందపడిపోయింది. నవాబు తన సింహాసనం మీంచి లేచి, కింద కూర్చుని నాణేన్ని వెతికారు. అది దొర్లుకుంటూ వెళితే దాని వెనకే పరిగెత్తారు. అది చేతికి చిక్కేదాక ఆయన శాంతించలేదు."

సర్ వాల్టర్ మాంక్టన్ (కుడి)

నిజాం పడకగది మురికిగా ఉండేది

1946లో నిజాం నవాబు, సర్ వాల్టర్ మాంక్టన్‌కు తన ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చారు.

స్వతంత్రం సాధించాలన్న నిజాం కల ఎప్పటికీ నెరవేరదని మాంక్టన్‌ భావించారు. ఒకటి, వారి సంస్థానం చుట్టూ భూమి మాత్రమే ఉంది. సముద్రాన్ని చేరుకోవడానికి వారికి మార్గం లేదు, రెండు, వారు ముస్లింలు. కానీ, వారి రాజ్యంలో హిందువుల జానాభా అధికం.

నిజాం నవాబు ఆచరణ సాధ్యం కాని జీవితం గడిపారు. ఆయన హైదరాబాదు దాటి ఎప్పుడూ బయటకు రాలేదు. తన మంత్రులు ఎవరినీ కలవలేదు.

ఆయన సంస్థానంలో పెద్ద పెద్ద భవనాలు, గదులు ఉన్నప్పటికీ, మాంక్టన్‌కు ఒక చిన్న మురికి గది ఇచ్చారు. అందులో రెండు పాత కుర్చీలు, బల్లలు ఉండేవి. అక్కడే కూర్చుని పనిచేసుకోవాలని చెప్పారు. ఆ గదిలో ఒక చిన్న అల్మారా కూడా ఉండేది. దానిపైన దుమ్ముపట్టిన పత్రాలు, దస్తావేజులు, పెట్టెలు ఉండేవి. గోడలకు సాలీడులు వేలాడుతూ ఉండేది. గది అంతా బూజు పట్టి ఉండేది.

నిజాం పడకగది కూడా అంతే మురికిగా ఉండేది. ఆ గదిలో సీసాలు, సిగరెట్ ముక్కలు, చెత్తచెదారం పడి ఉండేవి.

''ఆ గదిని ఏడాదికి ఒకసారి నిజాం పుట్టినరోజు నాడు మాత్రమే శుభ్రం చేసేవారు" అని ఫ్రెడరిక్ బర్కెన్‌హెడ్ వివరించారు.

హైదరాబాద్ ప్రధాన మంత్రి మీర్ లయీక్ అలీ

భారతదేశంలో భాగం కాబోమని ప్రకటన

బ్రిటిష్‌వారు భారతదేశాన్ని విడివెళ్ళిన తరువాత నిజాం తన సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవచ్చనే తప్పుడు ఆలోచనను ఆంగ్లేయులు నిజాం నవాబు మెదడులో నాటారు.

అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ మద్దతు కోసం 1942లో బ్రిటిష్ ఎంపీ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను భారతదేశానికి పంపినప్పుడు, వైస్రాయ్ లిన్‌లిత్‌గో ఒత్తిడితో నిజాం నవాబు తన ఆలోచనలను మార్చుకోవలసి వచ్చింది.

భారతదేశంలోని రాజులు, రాజకీయ నాయకులతో సంప్రదించిన తర్వాత మాత్రమే నిజాం స్వాతంత్ర్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలమని క్రిప్స్ స్పష్టం చేశారు. ఈ విషయం నిజాంకు ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే 1914 నుంచీ మధ్యప్రాచ్యంలో ముస్లింలతో జరుగుతున్న యుద్ధంలో బ్రిటన్‌కు నిజాం నవాబు మద్దతు ఇస్తూనే ఉన్నారు.

ఇది ఇలా ఉన్నప్పటికీ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా తన సార్వభౌత్వాన్ని కొనసాగిస్తుందని 1947 జూన్ 3న నిజాం నవాబు ఒక ప్రకటన జారీ చేశారు.

అంతేకాకుండా, జూన్ 12న వైస్రాయ్‌కు ఒక టెలిగ్రామ్‌ను పంపుతూ హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర భారతదేశంలో భాగం కాబోదని స్పష్టం చేశారు. జూలై 11న దిల్లీకి ఒక ప్రతినిధి బృందాన్ని పంపారు.

ఈ బృందంలో నిజాం ప్రధాన మంత్రి మీర్ లయిక్ అలీ, ఛతారీ నవాబు మొహమ్మద్ అహ్మద్ సయీద్ ఖాన్, హోం మంత్రి అలీ యావర్ జంగ్, సర్ వాల్టర్ మాంక్టన్, హైదరాబాద్ హిందూ, ముస్లిం సంఘాల నుంచి ఒక్కొక్క ప్రతినిధి ఉన్నారు.

దీవాన్ జమ్రనీ దాస్ రచించిన మహారాజా పుస్తకం

నిజాం సన్నిహితుల ఆగ్రహం

"వారంతా నిజాం తరుపున భారతదేశంతో ఒక ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించారు. వారి ప్రతిపాదన ప్రకారం, విదేశీ సంబంధాలు, రక్షణ, కమ్యూనికేషన్ అంశాల్లో భారత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ ప్రతినిధి బృందం లార్డ్ మౌంట్ బాటన్, సర్ కొన్రాడ్ కార్ఫీల్డ్, వీపీ మీనన్‌లను కలిసింది. వీరంతా నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలనే షరతు పెట్టారు. అక్కడితో చర్చలు నిలిచిపోయాయి" అని జాన్ జుబ్ర్‌జికీ తన పుస్తకం 'ది లాస్ట్ నవాబ్ 'లో రాశారు.

ఇది జరిగిన రెండు నెలల తరువాత, నిజాం నవాబు భారతదేశం పెట్టిన షరతులకు మౌఖికంగా అంగీకరించారు. మరుసటిరోజు పత్రాలపై సంతకం చేస్తానని సూచించారు.

అయితే, నిజాంకు అత్యంత సన్నిహితుడైన ఖాసిం రజ్వీకి ఇది నచ్చలేదు. ఆయన మద్దతుదారులు మాంక్టన్, నవాబ్ ఛతారీ, సర్ సుల్తాన్ అహ్మద్ ఇళ్లను ముట్టడించారు. భారతదేశంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయకపోతే వారి ఇళ్లను తగలబెడతామని బెదిరించారు.

"దాంతో తన అజమాయిషీ, నిర్ణయాలు చెల్లవని నిజాం నవాబుకు అర్థమైంది. తనతో పాటూ ముఖ్యమైన నాయకులను కూడా ఒప్పించాల్సి ఉంటుందని బోధపడింది" అంటూ నిజాం ప్రధాని మీర్ లయిక్ అలీ తన పుస్తకం 'ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్'లో రాశారు.

అయితే, నిజాంకు ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే వారి వద్ద ఆయుధాలు లేవు.

"ఈ చర్చలు జరుగుతున్న చివరి దశలో నిజాం నవాబు, వాల్టర్ మాంక్టన్ హైదరాబాద్ సైనిక కమాండర్ ఎల్. ఎద్రూస్‌తో సమావేశమయ్యారు. ఒకవేళ భారతదేశం నిజాంపై దండెత్తితే, ఎన్ని రోజులు తమ సైన్యం పోరాడగలదని మాంక్టన్.. ఎద్రూస్‌ను అడిగారు. నాలుగు రోజులకు మించి ఎదురునిలవలేమని ఎద్రూస్ చెప్పారు. నిజాం మధ్యలో కల్పించుకుని నాలుగు కాదు రెండు రోజులు మాత్రమే పోరాడగలమని అన్నారు" అంటూ వసంత్ కుమార్ బావా రాసిన 'ది లాస్ట్ నిజాం’ పుస్తకంలో వివరించారు.

హైదరాబాద్ రాజ్యంలోకి యుద్ధ ట్యాంకులతో ప్రవేశించిన భారతీయ సైన్యం

పాకిస్తాన్ నుంచి గోవా ద్వారా ఆయుధాల దిగుమతి

నిజాం నవాబు 1948లో సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియన్ పైలట్‌ను నియమించుకున్నారు. మెషిన్ గన్స్, గ్రెనేడ్‌లు, మోర్టార్‌లు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లను హైదరాబాద్‌కు సప్లయి చేయగలనని కాటన్.. నిజాంకు హామీ ఇచ్చారు.

అంతే కాకుండా, కాటన్ అయిదు పాత లాంకాస్టర్ విమానాలను కొనుగోలు చేసి, ఒక్కొక్కదానిపై 5,000 పౌండ్లు ఖర్చు చేసి వాటిని యుద్ధవిమానులుగా తయారుచేశారు.

1947లో పోర్చుగీస్ నుంచి గోవాను కొనుగోలు చేయాలని నిజాం నవాబు యోచన చేశారు. దాంతో, హైదరాబాదుకు సముద్రం, ఓడరేవు వస్తుందని ఆశపడ్డారు.

"కాటన్ కరాచీ నుంచి రాత్రిపూట ఈ విమానాలలో బయలుదేరి గోవా మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించి, బీదర్, వరంగల్ లేదా అదిలాబాద్‌లో వీటిని నిలిపేవారు. విమానం శబ్దం రాగానే ఈ ప్రాంతాలలో రన్‌వేల దగ్గర కిరోసిన్ లాంతర్లు వెలిగించేవారు. వాటి సహాయంతో రాత్రిపూట విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేవి. భారతదేశానికి ఈ సంగతి తెలుసు. కాకపోతే, అప్పటికి లాంకాస్టర్ విమానాలను నిలువరించగల విమానాలు భారతదేశం వద్ద లేవు" అని జాన్ జుబ్ర్‌జికీ వివరించారు.

లార్డ్ మౌంట్ బాటన్

నిజాంను కలిసేందుకు మౌంట్ బాటన్ తన ప్రతినిధిని పంపించారు

"1948 మార్చిలో భారతదేశం, నిజాంపై దండెత్తబోతోందనే విషయం మౌంట్ బాటన్‌కు తెలిసింది. దానికి "ఆపరేషన్ పోలో" అని పేరు పెట్టారు. ఈ సంగతి తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం, నిజాంల మధ్య సయోధ్య కుదర్చడానికి మౌంట్ బాటన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కానీ, సమస్య పరిష్కారం కాకపోవడంతో నిజాం నవాబును చర్చల కోసం దిల్లీకి ఆహ్వానించారు. దానికి నిజాం అంగీకరించలేదు సరికదా మౌంట్ బాటన్‌నే హైదరాబాదుకు రమ్మన్నారు.

మౌంట్ బాటన్ తన తరుపున ఎలన్ క్యాంప్‌బెల్ జాన్సన్‌ను పంపారు.

"నిజాం మాట్లాడే పద్ధతి చర్చలకు అనువుగా కనిపించలేదు. ఆయన, మొండిపట్టు, సంకుచిత మనస్తత్వం కలిగిన పాతకాలపు రాజు" అని జాన్సన్ తన నివేదికలో తెలిపారు.

హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

తరువాత జాన్సన్, రజకార్ల నాయకుడు ఖాసిం రజ్వీని కలుసుకున్నారు. రజ్వీ తీవ్ర భావాలుగల వ్యక్తి అని తెలుసుకున్నారు.

"రజ్వీ తరచూ తన ప్రసంగాలలో భారతదేశాన్ని తీవ్రంగా దూషించేవారు. కాగితంపై కలం కన్నా చేతిలో కత్తి పట్టుకుని చనిపోవడమే మేలని చెబుతుండేవారు. మీరు మాతో ఉంటే బంగాళాఖాతం తరంగాలు నిజాం పాదాలను ముద్దాడతాయి. మేం మొహమ్మద్ గజినీ వారసులం. ఒకసారి నిర్ణయించుకున్నామంటే వెనుదిరిగేది లేదు. ఎర్రకోటపై మా జెండా ఎగురవేస్తాం అని రజ్వీ చెప్పేవారు" అంటూ కె. ఎం. మున్షి తన పుస్తకం 'ది ఎండ్ ఆఫ్ ఎరా'లో రాశారు.

తన మద్దతును, బలాన్ని పెంచుకోవడానికి నిజాం నవాబు మే ప్రారంభంలో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేశారు.

ఈ నిర్ణయం భారత ప్రభుత్వ వర్గాలలో కొంత ఆందోళన కలిగించింది. మౌంట్‌బాటన్ భారతదేశం నుంచి బయలుదేరడానికి ఒక వారం ముందు, భారత ప్రభుత్వం నిజాంకు ఒక తుది ప్రతిపాదన పంపింది. హైదరాబాద్ విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించింది. అయితే, నిజాం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

జాన్ జుబ్ర్‌జికీ రాసిన ద లాస్ట్ నిజాం పుస్తకం

పాకిస్తాన్, భారతదేశంపై దాడి చేయనుందని పుకార్లు

"ఇంతలో హైదరాబాదులో రజాకార్లు హిందువులను హింసించడం మొదలుపెట్టారు. విభజన తరువాత శరణార్థులుగా మారిన ముస్లింలకు ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరిచేందుకు ప్రయత్నించారు. తద్వారా అక్కడ ముస్లిం జనాభా పెరుగుతుందని ఆశించారు. నిజాంకు మద్దతుగా లక్షలాది ముస్లింలు నిలబడతారని, హైదరాబాద్‌పై భారత్ దాడి చేస్తే, పాకిస్తాన్ యుద్ధం ప్రకటిస్తుందనే పుకార్లు వ్యాప్తి చెందాయి" అని వీపీ మీనన్ తన పుస్తకం 'ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్'లో రాశారు.

ఆ తరువాత, పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆగస్టు చివరినాటికి భారత సైన్యం హైదరాబాద్‌ మొత్తాన్ని దాదాపుగా చుట్టుముట్టింది. నగరంలోకి ప్రవేశించడానికి ఆదేశాల కోసం వేచి చూస్తూ ఉంది.

ఈ విషయంలో భద్రతా మండలి మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ హైదరాబాద్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి జహీర్ అహ్మద్ ఆగస్టు 21న ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి సెప్టెంబర్ 16వ తేదీని ఎంపిక చేశారు. కానీ, అప్పటికే ఆలస్యమైంది. అంతలోపు చాలా విషయాలు జరిగిపోయాయి.

హోం మంత్రి సర్దార్ పటేల్‌ ఎదుట లొంగిపోయిన హైదరాబాద్ నిజాం

నిజాం సైన్యం, భారత సైనికులతో పోటీ పడలేకపోయింది

లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింగ్ నాయకత్వంలో భారత సైన్యం దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

కానీ 25,000 మంది సైనికులతో హైదరాబాద్ సైన్యం ఈ దాడికి సిద్ధం కాలేకపోయింది. వారి మ్యాపులు పాతబడిపోయాయి. కాటన్ తీసుకొచ్చిన ఆయుధాలను సైనికుల వరకూ చేర్చలేకపోయాయి.

"వేలాది మంది రజాకార్లు భారతీయ ట్యాంకులపై రాళ్లు, ఈటెలతో దాడి చేశారు. కరాచీలో నిరసనకారులు, భారతదేశంపై దాడి చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. అయితే, అంతకు రెండురోజుల ముందే జిన్నా కన్ను మూశారు. అందువల్ల, భారతదేశంపై పాకిస్తాన్ దాడి చేసే అవకాశాలు దాదాపు లేనట్టే" అంటూ జాన్ జుబ్ర్‌జికీ వివరించారు.

భారతదేశం పొరుగు రాజ్యంపై తన బలం ప్రయోగించడాన్ని విమర్శిస్తూ లండన్‌లోని టైమ్ వార్తాపత్రికలో సంపాదకీయం ప్రచురించారు.

1948 సెప్టెంబర్ 17న నిజాం ప్రధాన మంత్రి మీర్ లయిక్ అలీ ఒక రేడియో సందేశంలో ఇలా ప్రకటించారు..

"తమ సైన్యం కన్నా ఎన్నో రెట్లు బలమైన సైన్యంతో పోరాడి రక్తం చిందించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని ఇవాళ ఉదయం మంత్రిమండలి గ్రహించింది. హైదరాబాద్‌లో ఉన్న కోటి అరవై లక్షల జనాభా తమ జీవితాల్లో వస్తున్న మార్పును సాదరంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను."

'మెమోయిర్స్ ఆఫ్ సిడ్నీ కాటన్' పేరుతో సిడ్నీ కాటన్ జీవిత చరిత్ర రాసిన ఒమర్ ఖలీది తన పుస్తకంలో అప్పటి సంగతులను వివరించారు.

"ఆ సమయంలో నిజాం నవాబు ఈజిప్ట్‌ పారిపోవాలని అనుకున్నారు. అక్కడ చక్రవర్తి ఫరూఖ్ రాజభవనంలో ఆయనకు బస ఏర్పాటు చేశారు. అందుకు ప్రతిఫలంగా నిజాం నవాబు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన 10 కోట్ల పౌండ్లలో 25 శాతాన్ని ముట్టజెప్పాల్సి వచ్చింది. నిజాం తన చివరి ప్రార్థన ముగించేటప్పటికి, భారత సైన్యం నవాబు కోటను స్వాధీనం చేసుకుంది. దాంతో, ఆయన విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు. అక్కడ కాటన్ ఏర్పాటు చేసిన విమానం వంద రూపాయల నోట్ల కట్టలు నిండిన పెట్టెలతో ఎగరడానికి సిద్ధంగా ఉంది."

ప్రధాన మంత్రి నెహ్రూ, రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌లతో హైదరాబాద్ నిజాం

భారతదేశంలో విలీనానికి నిజాం ఆమోదం

హైదరాబాద్ సైన్యం లొంగిపోయిన తరువాత, నిజాం మద్దతుదారులు రజ్వీ, లయిక్ అహ్మద్‌లను భారత ప్రభుత్వం నిర్బంధించింది.

అయితే, లయిక్ అహ్మద్ బురఖా సహాయంతో నిర్బంధం నుంచి తప్పించుకుని, బొంబాయి విమానాశ్రయం నుంచి కరాచీకి వెళ్లే విమానం ఎక్కేశారు.

నిజాం నవాబును, ఆయన పరివారాన్ని భారత ప్రభుత్వం తాకలేదు. మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తన రాజభవనంలోనే ఉండేందుకు అనుమతి లభించింది.

"ఇప్పటి నుంచి భారత రాజ్యాంగమే హైదరాబాద్ రాజ్యాంగం అవుతుంది" అని నవాబు ఒక ఫర్మానా జారీ చేశారు.

ఈ విధంగా హైదరాబాద్, భారతదేశంలో 562వ సంస్థానంగా విలీనమైంది.

నిజాం నవాబుకు భారత ప్రభుత్వం సంవత్సరానికి 42 లక్షల 85 వేల 714 రూపాయల రాజభరణం ఇచ్చే విధంగా 1950 జనవరి 25న ఒక ఒప్పందం కుదిరింది.

1956 నవంబర్ 1 వరకు నిజాం నవాబు హైదరాబాద్ రాజప్రముఖులుగా వ్యవహరించారు.

ఆ తరువాత, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు కింద నిజాం సంస్థానం.. మహారాష్ట్ర, కర్ణాటక, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మూడు భాగాలుగా విభజించబడింది.

1967 ఫిబ్రవరి 24న నిజాం నవాబు తుది శ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The Nizam of Hyderabad is the richest man as well as the most miser in the world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X