పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్: తిరుపతి వైసీపీ ఎంపీ ప్రమాణం అప్పుడే..
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశం కానుంది. వచ్చేనెల 13వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తంగా 19 రోజుల పాటు పార్లమెంట్ సమావేశమౌతుంది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ గెజిట్ విడుదల చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన పార్లమెంట్ ఆవరణను సందర్శించారు. వర్షాకాల సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ సమావేశాలను నిర్వహిస్తామని స్పీకర్ తెలిపారు. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభం కాబోతోండటంతో దేశ రాజకీయాలు వాడివేడిగా మారడం ఖాయంగా కనినిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన తరువాత తొలిసారిగా పార్లమెంట్ సమావేశం కానుంది. కొత్తగా లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఈ సమావేశాలకు ముందే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనధికార వేటు విషయం మరోసారి తెరమీదికి వచ్చే అవకాశం ఉంది. ఆయనపై అనర్హత వేయాలంటూ వైసీపీ నేతలు ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాను కలిసి విజ్ఞప్తి చేశారు. దీన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తామంటూ స్పీకర్ స్పష్టం చేసిన నేపథ్యంలో వైసీపీ సభ్యుల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. రఘురామ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపించడమంటూ జరిగితే తాము సభను స్తంభింపజేస్తామంటూ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి హెచ్చరించారు.
దీనితో పార్లమెంట్‌లో వైఎస్సార్సీపీ సభ్యుల వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. దీనితోపాటు పలు అంశాలు చర్చకు రానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని వైసీపీ సభ్యులు సభలో లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం నిధుల బకాయిలు, మూడు రాజధానులు, ప్రత్యేక హోదా వంటి రాష్ట్రానికి చెందిన కీలక విషయాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications