Edible Oil: సామాన్యులకు షాకిచ్చిన కేంద్రం.. వంట నూనె ధరలు భారీగా పెంపు..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ దిగుమతిదారుగా ఉన్న భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ముడి మరియు శుద్ధి చేసిన తినదగిన నూనెలపై ప్రాథమిక దిగుమతి పన్నును 20 శాతం పెంచిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దీంతో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబరు 14 నుంచి క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 20% ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని విధించినట్లు నోటిఫికేషన్ విడుదల చేశారు.
రిఫైన్డ్ పామాయిల్, రిఫైన్డ్ సోయాయిల్ మరియు రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకం నుంచి 35.75% దిగుమతి సుంకం ఉంటుంది. దీంతో లీటరు వంట నూనె ధర రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగింది. లీటరుకు రూ.115గా ఉన్న పొద్దు తిరుగుడు నూనె ప్రస్తుతం రూ.130కి చేరింది. పామాయిల్ ధర కూడా భారీగా పెరిగింది. పూజకు ఉపయోగించే నూనె ధర కూడా లీటరుకు రూ.15కు పైగా పెరిగినట్లు తెలుస్తోంది. వంట నూనె ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పుడే కొనుగోలు చేయాలని చూస్తున్నారు.

హోల్ సెల్ లో పొద్దుతిరుగుడు నూనె లీటరకు రూ.107 నుంచి రూ.115 ఉండేది.. ఇప్పుడు రూ. 122 నుంచి రూ.130కి చేరింది. రిటైల్ మార్కెట్లో రూ.140 వరకు చేరింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పుడు వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడంతో నూనె ధరలు దిగివచ్చాయి. తాజాగా ముడి నూనెల దిగుమతి సుంకం పెంచడంతో వంట నూనె ధరలు పెరిగాయి.
భారత్ నూనె డిమాండ్‌లో 70% కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా వస్తుంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికే ఉల్లి ధర భారీగా పెరిగింది. తాజాగా కేంద్ర నిర్ణయంతో వంట నూనెల ధరలు పెరగడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు.












Click it and Unblock the Notifications