పంజాబ్ ఓటర్లు ఎటు వైపు - రాజకీయ ఉత్కంఠ :117 స్థానాలకు నేడే పోలింగ్..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ తరువాత ఆ స్థాయిలో ఆసక్తి కలిగిస్తున్న రాష్ట్రం పంజాబ్. ఇక్కడ ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో ప్రచారం మొదలు..ఎన్నికల హామీలు గుప్పించాయి. పంజాబ్ లోని మొత్తం 117 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1,304 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వారిలో 93 మంది మహిళలు పోటీలో నిలిచారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. పంజాబ్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ఉన్నా శిరోమణి అకాలీదళ్ సహా భాజపా కూటమి కూడా సై అంటున్నాయి.
Recommended Video

అయిదు పార్టీల్లో ఆదరణ ఎవరికి
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలకు పంజాబ్ కేంద్రంగా నిలిచింది. ఈ అంశం కలిసి వస్తుందని కాంగ్రెస్, ఆప్ రెండూ ధీమాగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ను అంతర్గత కలహాలు కలవరపెడుతున్నాయి. శిరోమణి అకాలీదళ్, బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నాయి. భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ సంయుక్త్ పార్టీలు ఉమ్మడిగా బరిలో ఉన్నాయి. చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చమ్‌కౌర్ సాహిబ్, భదౌర్ స్థానం నుంచి.. పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్.. ధురి నియోజకవర్గ బరిలో నిలిచారు.

కాంగ్రెస్ కు లిట్మస్ పరీక్ష
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్ తూర్పు స్థానం నుంచి పోటీలో ఉన్నారు. మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత అమరీందర్ సింగ్ తమ కుటుంబానికి గట్టి పట్టున్న పటియాలా అర్బన్ బరిలో నిలిచారు. అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ బాదల్.. జలాలాబాద్, ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్.. లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
2017 ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందగా, ఆప్ 20 సీట్లకు, అకాలీ-బీజేపీ కూటమి 18 సీట్లకే పరిమితమయ్యాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న అకాలీదళ్-బీజేపీ కూటమిని 3వ స్థానానికి నెట్టి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ , శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) పార్టీలు బీజేపీ నేతృత్వంలోని కూటమిలో ఉన్నాయి.

ఆప్ టార్గెట్ గా పార్టీల ప్రచారం
బీజేపీ 72 సీట్లలో పోటీ చేస్తుండగా, పీఎల్సీ 30 చోట్ల, అకాలీ చీలిక పార్టీ 15 చోట్ల పోటీ చేస్తున్నాయి. కాగా, అకాలీదళ్ 97 సీట్లలో, బీఎస్పీ 20 సీట్లలో పోటీ చేస్తున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలూ హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించాయి. కూటములుగా జట్టు కట్టి ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న పంజాబ్ ఎన్నికల్లో ఓటరు ఎవరి వైపు నిలుస్తారనే రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు వచ్చే నెల 10వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే, నేటి పోలింగ్ లో ఓటరు నాడి పట్టుకొనేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications