NEET: ఎన్టీఏపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు..
నీట్-యూజీ 2024(NEET)లో పేపర్ లీకేజీలు, అవకతవకలకు సంబంధించి వచ్చిన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తీరు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంపై కూడా అసహనం వ్యక్తం చేసింది. నీట్ పరీక్ష కోసం చాలా మంది విద్యార్థులు ఎంతగానో శ్రమిస్తారని.. ఈ విషయంలో చిన్న నిర్లక్ష్యమైనా సరి చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
"0.001% తప్పిదం ఉన్నా.. దానిని పూర్తిగా పరిష్కరించాలి" అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. పరీక్షలకు సిద్ధమైన చిన్నారుల కృషిని మనం మరచిపోలేమని అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసింది. నీట్-యూజీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లను వ్యతిరేక వ్యాజ్యంగా పరిగణించవద్దని కేంద్రం, ఎన్‌టీఏకు సూచించింది. పరీక్ష నిర్వహణలో తప్పులుంటే అంగీకరించి సరిదిద్దుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

"పరీక్షను నిర్వహించే ఏజెన్సీగా, మీరు న్యాయంగా వ్యవహరించాలి. తప్పు జరిగితే.. అవును.. తప్పు జరిగిందని చెప్పండి. సరైన చర్య తీసుకుంటాం. ఇది మీ పనితీరుపై విశ్వాసాన్ని కలిగిస్తుంది" అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పేపర్ లీక్‌లు, గ్రేస్ మార్కులు ఇవ్వడం, అత్యధిక స్కోర్‌ల సంఖ్య గణనీయంగా పెరగడం వంటి ఆరోపణలకు సంబంధించి సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
జూన్ 14న, ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థనపై కేంద్రానికి, NTAకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది NEET-UG 2024 అభ్యర్థుల స్కోర్‌కార్డులను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసిన తర్వాత ఈ నోటీసు వచ్చింది. బాధిత విద్యార్థులకు గతంలో ఇచ్చిన గ్రేస్ మార్కులను మినహాయించే వారి సవరించిన స్కోర్‌లను త్వరలో తెలియజేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై తదుపరి విచారణ జూలై 8న జరగనుంది.












Click it and Unblock the Notifications