ఉచిత పథకాల హామీపై సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ అభిప్రాయం ఇదే..!!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవ్వాళ.. పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐగా చివరి రోజు తన విధులను ప్రారంభించారు. చివరి రోజు చేపట్టిన విచారణలు, ఆయన సారథ్యాన్ని వహిస్తోన్న బెంచ్ సమక్షానికి వచ్చిన పిటీషన్లపై వాదనలను సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. దేశ ప్రజలందరూ దీన్ని లైవ్ స్ట్రీమంగ్‌లో చూడొచ్చు. ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్వీ రమణ సమక్షానికి వచ్చిన తొలి పిటీషన్- ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. కస్టమ్స్ యాక్ట్‌లో బ్యాంక్రప్ట్సీ కోడ్‌ను ఎన్వీ రమణ బెంచ్ సమర్థించింది. ఒక్కసారి న్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా కింద మారటోరియం విధించిన తరువాత కస్టమ్స్ అధికారులకు ఆటోమేటిక్‌గా పరిమితులు వర్తిస్తాయని పేర్కొంది. బకాయిలను వసూలు చేయడానికి అవసరమైన రికవరీలను కస్టమ్స్ అధికారులు చేయలేరని స్పష్టం చేసింది.

ఉచిత పథకాల హామీల నియంత్రణను సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ రెండో పిటీషన్‌గా స్వీకరించింది. బెంచ్ అభిప్రాయాన్ని ఆయన చదవి వినిపించారు. రెండు సెట్ల పిటీషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల హామీల పట్ల పిటీషన్ వ్యక్తం చేసిన ఆందోళన పరిగణించదగ్గదని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతో ముడిపెట్టిన ఇలాంటి హామీలు ఆర్థిక భారాన్ని మిగిల్చుతాయని పిటీషన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇచ్చే వాదనలను కూడా వినాల్సి ఉందని ఎన్వీ రమణ చెప్పారు. ఎలక్టోరల్ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారు. నిజమైన అధికారం ఓటర్ల వద్దే ఉందని, పార్టీలు, అభ్యర్థులను నిర్ణయించేది ఓటర్లేనని చెప్పారు. దీన్ని ముగ్గురు సభ్యుల గల మరో ధర్మాసనానికి రెఫర్ చేస్తోన్నట్లు సీజేఐ ఎన్వీ రమణ అన్నారు.
ఓటర్లను ప్రభావితం చేసే ఉచిత పథకాల హామీలపై పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఇదివరకే అభిప్రాయపడ్డారు. నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అధికార- ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉచిత హామీలనేవి తీవ్రమైన ఆర్థిక అంశాలకు సంబంధించినదిగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications