"సీన్ మారుతోంది "- బీఆర్ఎస్, బీజేడీ యూటర్న్ పై యోగేంద్ర యాదవ్..! కేటీఆర్ ట్వీట్ తో..!
ఎస్ఐఆర్ అక్రమాలు, కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల ఆరోపణల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. వీటి ప్రభావం అనివార్యంగా ఇప్పటివరకూ జాతీయ స్ధాయిలో ఉన్న రెండు ప్రధాన కూటములైన ఎన్డీయే, ఇండియా కూటమిలో చేరకుండా ఊగిసలాడుతున్న పలు పార్టీలపై పడుతోంది. ఇదే క్రమంలో ఈ రెండు కూటముల్లో లేని పార్టీలు సైతం విపక్ష ఇండియా కూటమి నిరసనల్లో, విమర్శల్లో భాగమవుతున్నాయి.
దీనిపై ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ (Yogendra Yadav) స్పందించారు. పరిస్థితి మారుతోందంటూ ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. రాజ్యాంగం కంటే ఏదీ గొప్పది కాదని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఆయన స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ (ఇండియా కూటమిలో భాగం కాదు) కూడా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ సమీక్షను డిమాండ్ చేస్తోందని యోగేంద్ర గుర్తుచేశారు. అలాగే ఇంతకుముందు నవీన్ పట్నాయక్ యొక్క బీజేడీ ఈ విషయంపై ప్రతిపక్షాల మార్చ్‌లో చేరిందని కూడా వెల్లడించారు. గణతంత్ర పరిరక్షణ కోసం ఏర్పడిన ఈ కొత్త జాతీయ కూటమికి స్వాగతం అంటూ యోగేంద్ర యాదవ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

The tide is turning. Now BRS (not part of INDIA bloc) also demands resignation of Gyanesh Kumar and review of SIR. Earlier Naveen Pattnaik’s BJD had joined opposition march on this issue.Welcome to this new national coalition for the defence of the republic.
— Yogendra Yadav (@_YogendraYadav) October 9, 2026
గతంలో అధికారంలో ఉన్నప్పుడు తమ మిత్రపక్షం కాకపోయినా కేంద్రంలో ఎన్డీయే కూటమికి బీఆర్ఎస్, బీజేడీ, వైఎస్సార్సీపీ వంటి పార్టీలు పలు సందర్భాల్లో మద్దతిచ్చాయి. కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం, అలాగే తమ రాష్ట్రాలకు నిధులు తెచ్చుకోవడమే అజెండాగా ఈ నిర్ణయాలు తీసుకునేవి. కానీ ఇప్పుడు కేంద్రంలో అదే ఎన్డీయే అధికారంలో ఉన్నా.. జంతర్ మంతర్ నిరసనల తర్వాత జాతీయ స్ధాయిలో మారిపోయిన పరిణామాలు ఆయా పార్టీల్ని కుదురుగా ఉండనీయడం లేదు. అలాగే బీజేపీని నమ్ముకున్నా గత ఎన్నికల్లో బీజేడీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ ఓటమి పాలయ్యాయి. ఈ పరిణామాలు వారిని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. దీంతో అనివార్యంగా విపక్ష కూటమి నిరసనల్లో పాల్గొనడం, వారి డిమాండ్లు నెత్తికెత్తుకోవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.














Click it and Unblock the Notifications
