పార్లమెంట్ సమావేశాల తేదీలొచ్చేశాయ్ - గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌తో లింక్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు వెలువడ్డాయి. దీనికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో లింక్ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒక్కరోజు ముందే పార్లమెంట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలు, బిల్లులు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయి. వ్యక్తిగత డేటా భద్రత, విద్యుత్ బిల్లులను ఈ శీతకాల సమావేశాల్లోనే అధికార పార్టీ సభలో ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

డిసెంబర్ 7 నుంచి..
డిసెంబర్ 7వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరంభం కానున్నాయి. 29వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇది అధికారిక షెడ్యూల్ కాదు గానీ.. పార్లమెంట్ వ్యవహారాలను చూసే ఇద్దరు ఉన్నతాధికారులు దీన్ని నిర్ధారించారు. డిసెంబర్ 7వ తేదీన పార్లమెంట్ సమావేశమౌతుందని, 29వ తేదీ వరకు ఈ భేటీ కొనసాగుతుందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ తేదీల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

గుజరాత్ ఎన్నికల వేడి..
ప్రస్తుతం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న అన్ని పార్టీలు కూడా తమ ప్రచార జోరును పెంచుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రచార ఉధృతిని కొనసాగిస్తోన్నాయి.

8న కౌంటింగ్..
గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు వెలువడతాయి.

ఒక్కరోజు ముందే..
ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందు పార్లమెంట్ సమావేశం కాబోతోండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్ రెండు లేదా మూడోవారంలో ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడది కుదరట్లేదు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటమే దీనికి కారణం. వ్యక్తిగత డేటా భద్రతపై ప్రస్తుత చట్టం స్థానంలో ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకుని రావాలని భావిస్తోంది.

బిల్లులు ఇవే..
అదే సమయంలో విద్యుత్ సవరణ బిల్లు, కాంపిటీషన్ సవరణ బిల్లు, న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సవరణ బిల్లు, వన్యప్రాణుల సంరక్షణ సవరణ బిల్లు వంటివి ఈ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటితోపాటు 30కి పైగా బిల్లులు సభామోదం పొందే వీలు ఉంది.












Click it and Unblock the Notifications