దొంగతనానికి వచ్చి వంట చేసుకొని తిన్న దొంగ.. ఎక్కడంటే ?
కేరళలోని పాలక్కాడ్ సమీపంలో జరిగిన ఓ వింతైన దొంగతనం వెలుగులోకి వచ్చింది. చోరీ చేయడానికి వచ్చిన దొంగ.. వంట వండుకొని.. కడుపు నిండా ఫుల్ గా తిని.. ఆ తర్వాత డబ్బును ఎత్తుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మే 22వ తేదీ రాత్రి పాలక్కాడ్ శివారు ప్రాంతమైన చంద్రానగర్ లోని ఒక స్థానిక హోటల్‌లో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. అ తర్వాత వంట గదిలోకి వెళ్లి గుడ్లు కనపడటంతో స్టవ్ వెలిగించి ఆమ్లెట్ వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఫ్రిజ్‌లో వెతకగా పచ్చి బీఫ్ ప్యాకెట్ దొరికింది. దాంతో వంట చేసుకుని ఫుల్ గా తిన్నాడు.

భోజనం ముగించిన తర్వాత, దొంగ హోటల్‌లోని ఇతర ప్రాంతాలను పరిశీలించాడు. ఆ క్రమంలో హోటల్ యజమాని మర్చిపోయినట్లుగా భావిస్తున్న ఒక పర్సులో ఉన్న రూ. 25,000 నగదును గుర్తించి, అపహరించాడు. అంతేకాకుండా సమీపంలోని గుడికి చెందిన ఒక హుండీని కూడా దొంగిలించి, రాత్రికి రాత్రే అక్కడి నుంచి పరారయ్యాడు.
మరుసటి రోజు హోటల్ సిబ్బంది వచ్చి చూడగా, వంటగది పూర్తిగా చిందరవందరగా ఉండటంతో అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దాంతో జరిగిన బాగోతం బయటపడగా.. హోటల్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా పాలక్కాడ్ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. దాదాపు గంటకు పైగా సమయం హోటల్‌లోనే గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది.
నిందితుడిని తిరువనంతపురం సమీపంలోని కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన మార్తాండంకు చెందిన శివకుమార్ గా గుర్తించారు. శివకుమార్ చిత్రాలను రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లకు పంపి గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. గతంలోనూ ఇదే తరహాలో పలు హోటళ్లలో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.
కాగా ఈరోజు త్రిసూర్‌లో పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని పాలక్కాడ్‌లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇతర దొంగతనాలతో కూడా ఇతనికి సంబంధం ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications