రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మూడో షాక్- వరుసగా మూడో సీఎం.. !
జాతీయ స్ధాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా మారేందుకు ప్రయత్నిస్తున్న ఇండియా కూటమిలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ కూటమిని లీడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రెండు రోజుల్లో వరుసగా మూడో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో జరుగుతున్న సీట్ల చర్చలు కొలిక్కిరాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న మిత్రపక్షాలు.. ఒంటరి పోటీకి సిద్ధమని నిన్న వరుస ప్రకటనలు చేశాయి.
పశ్చిమబెంగాల్, పంజాబ్ లో కాంగ్రెస్ తో సీట్ల చర్చలు కొలిక్కిరాకపోవడంతో సీఎంలు మమతా బెనర్జీ, భగవంత్ మాన్.. ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు నిన్న ప్రకటించాయి. దీంతో కాంగ్రెస్ కు డబుల్ స్ట్రోక్ తగిలినట్లయింది. గతంలో పోటీ చేసి గెలిచిన సీట్ల కంటే ఎక్కువగా సీట్లు కేటాయించాలని మిత్రపక్షాలను కాంగ్రెస్ కోరుతుండటమే ఇందుకు కారణం. దీంతో నిన్న రెండు షాక్ లు తగిలిన కాంగ్రెస్ కు ఇవాళ మరో మిత్రపక్షం జేడీయూ కూడా షాకిచ్చింది.

బీహార్ లో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడానికి కాంగ్రెస్ వైఖరే కారణమని అసంతృప్తిగా ఉన్న సీఎం నితీశ్ కుమార్ .. త్వరలో రాష్ట్రంలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాహుల్ యాత్రకు రావాలని సీఎల్పీ నేతతో ఆహ్వానం పంపగా.. దీనిపై నితీష్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో రాహుల్ యాత్రకు నితీష్ హాజరు అనుమానంగా మారింది. ఇలా వరుసగా మూడో సీఎం కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా తమ సొంత నిర్ణయాలు తీసుకుంటుండటంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే ఇండియా కూటమి పరిస్ధితి దారుణంగా మారింది.












Click it and Unblock the Notifications