మతిస్థిమితం లేని వ్యక్తులే అలా మాట్లాడతారు: రాహుల్ వ్యాఖ్యలపై మోడీ తీవ్ర స్పందన
వారణాసి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్నవారిని చూశానంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. వారణాసిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
'మతిస్థిమితం కోల్పోయిన వారు వారణాసిలోని మన పిల్లల్ని తాగుబోతులు అంటారు. అసలు అదేం భాష..? మోడీని దుర్బాషలాడుతూ రెండు దశాబ్దాలు గడిపారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యువతపై తమ చిరాకును వెళ్లగక్కుతున్నారు. యూపీ యువత లక్ష్యంగా 'ఇండియా కూటమి' చేసిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోం. కాంగ్రెస్ ఒక కుటుంబం ఎదుగుదల కోసమే పాటుపడుతుంది. అలాగే ఓటు బ్యాంకును దాటి ఆలోచించిచదు అంటూ మోడీ తీవ్రంగా స్పందించారు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతుందని ఆ (కాంగ్రెస్)పార్టీ అసలు ఊహించలేదు. కాశీ, అయోధ్యలో వస్తోన్న మార్పు 'ఇండియా కూటమి' అంశాంతికి కారణం అంటూ మోడీ విమర్శలు గుప్పించారు. ఇక ఇండియా కూటమి జిత్తులు వారణాసిలో పనిచేయవని ధ్వజమెత్తారు. కాగా, రాహుల్ పేరు ప్రస్తావించకుండానే మోడీ ఈ విమర్శలు గుప్పించడం గమనార్హం.
ప్రతిసారి ఎన్నికల సమయంలో విపక్ష నేతలు కలిసివస్తారని ఇండియా కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ. దాని వల్ల ఫలితం శూన్యమైతే.. వారు ఒకరినొకరు నిందించుకుంటారని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేస్తుందని.. అన్ని సీట్లు ఎన్డీయేకే దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి తమ ప్రభుత్వం దేశాన్ని మరింత గొప్పస్థాయికి తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు ప్రధాని మోడీ. వచ్చే ఐదేళ్లలో భారత్ అభివృద్ధికి నమూనాగా మారుతుందని.. ఇదే మోడీ గ్యారంటీ అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications