గాంధీని చంపినవాళ్లే.. నా హత్యకు యత్నించారు: అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణలు
న్యూఢిల్లీ: తన వాహనంపై జరిగిన కాల్పుల ఘటనపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి స్పందించారు. తన వాహనంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భాగ్‌పత్ జిల్లా ఛప్రౌలిలో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
అప్పట్లో మహాత్మా గాంధీని చంపినవారే ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడికి సంబంధిత ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారికి బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
తనపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు కానీ, తనను అల్లా కాపాడాడని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరఠ్ జిల్లా కితౌర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి వెళ్తుండగా.. ఛాజర్సీ టోల్ ప్లాజా వద్ద అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిగాయి. ఆ తర్వాత షూటర్లు ఆయుధాలను అక్కడే వదిలేసి పరారయ్యారని చెప్పారు. తామంతా సురక్షితంగా బయటపడ్డామని ఘటన అనంతరం ఒవైసీ తెలిపారు.

కాగా, ఈ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఒవైసీకి జడ్ కేటగిరీ భద్రతను కల్పించగా.. దాన్ని ఆయన తిరస్కరించారు. తనకు జడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదని, అందరిలాగే తాను ఏ కేటగిరీ పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేశారు. అంతేగాక, తన కారుపై కాల్పుల ఘటనను లోక్‌సభలో ఆయన ప్రస్తావించారు.
తాను చావుకు భయపడబోనని అన్నారు. తనకు జడ్ కేటగిరీ భద్రత అవసరం లేదనీ, దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వారి చూసి తాను ఏమాత్రం భయపడనన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్ ద్వారా సమాధానం చెబుతారన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తనపై కాల్పులు జరిపిన వారిపై యూఏపీఏ చట్టం ఎందుకు ప్రయోగించరని ప్రశ్నించారు అసదుద్దీన్ ఒవైసీ. తనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించి.. తనకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం అంశంపైనా తాను బలంగా ప్రశ్నించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications