బాబోయ్..తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల్లో ఎంత పెద్ద కొండచిలువో
పాండిచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తోన్నతమిళిసై సౌందరరాజన్.. ఆదివారం స్థానిక అర్బన్ ఫారెస్ట్‌ను సందర్శించారు. ఆమె సలహాదారులు, ఉన్నతాధికారులు పలువురు ఈ సందర్భంగా ఆమె వెంట ఉన్నారు. ఈ నెల 6వ తేదీన చేపట్టాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఒకవంక పర్యవేక్షిస్తూనే ఆటవిడుపుగా అర్బన్ ఫారెస్ట్‌ను సందర్శించారు. మొక్కలను నాటారు.
ఈ ఉదయం ఆమె తన సలహాదారులు, ఉన్నతాధికారులతో కలిసి ముళ్లైయగమ్ అర్బన్ ఫారెస్ట్ క్యాంపస్‌ను సందర్శించారు. మొక్కలను నాటారు. అక్కడి ఉద్యోగులు, సిబ్బందిని పలకరించారు. వారు చేసిన సేవలకు గుర్తుగా శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కాలి నడకన అర్బన్ ఫారెస్ట్‌లో కలియ తిరిగారు. ఎన్‌క్లోజర్‌లో ఉంచిన వన్యప్రాణులను తిలకించారు. ఈ సందర్భంగా ఓ భారీ కొండచిలువను తన చేతుల్లోకి తీసుకున్నారామె. ఎండ తీవ్రత రోజురోజుకూ అధికమౌతోన్నందున వన్యప్రాణులకు కల్పిస్తోన్న సంరక్షణ చర్యల గురించి తమిళిసై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. ముళ్లైయగమ్ అర్బన్ ఫారెస్ట్‌ను సందర్శించే వారి సంఖ్య భారీగా తగ్గిందని అధికారులు లెప్టినెంట్ గవర్నర్‌కు వివరించారు. ఈ మధ్యకాలంలో పర్యాటకల సంఖ్య కొద్దిగా మెరుగుపడిందని తెలిపారు. రోజువారీ పర్యాటకుల సంఖ్య వివరాలను ఈ సందర్భంగా అధికారులు ఆమెకు అందజేశారు. పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతానికి పర్యాటకం ద్వారానే అధికాదాయం లభిస్తుందని, ఆ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలని తమిళిసై ఆదేశించారు.

బీచ్ టూరిజం, అర్బన్ ఫారెస్ట్ టూరిజంతో పాటు ఫ్రెంచ్ శైలిలో నిర్మించిన చారిత్రాత్మక కట్టడాలను తిలకించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుదుచ్చేరికి వచ్చిన ప్రతి ఒక్క పర్యాటకుడు ఏ ఒక్క ప్రాంతాన్ని మాత్రమే సందర్శించిన వెనక్కి వెళ్లిపోకుండా ఉండేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పారు. ప్రతి పర్యాటక కేంద్రాన్నీ సందర్శించేలా సన్నాహాలు చేయాలని అన్నారు. విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించడం ద్వారా అధికాదాయాన్ని పొందవచ్చని చెప్పారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తోన్న విషయం తెలిసిందే.