• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతి: మ్యాన్‌హోల్స్‌ మింగేస్తున్న ప్రాణాలు - మురుగు కాలువల్లోకి ఇంకా మనుషులే దిగాలా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఇటీవల తిరుపతిలో మ్యాన్‌హోల్‌లో పడి ముగ్గురు చనిపోయారు. అందులో ఇద్దరు మున్సిపల్ కార్మికులు కాగా మరొకరు వారిని కాపాడడానికి వెళ్లిన వ్యక్తి. భద్రత ప్రమాణాలు పాటించక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు బీబీసీ పరిశీలనలో తేలింది.

తిరుపతి లాంటి ఘటనలు గతంలో హైదరాబాద్, విశాఖపట్నం సహా ఇతర నగరాల్లోనూ జరిగాయి.

మ్యాన్‌హోల్‌ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఈ రోజుల్లో కూడా మ్యాన్‌హోల్‌లో మనుషులు దిగి శుభ్రం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి?

ఇలా చేయడం చట్టబద్ధమేనా? లాంటి ప్రశ్నలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తెరపైకి వస్తుంటాయి.

ప్రాణాలను పణంగా పెడుతున్నాం: కార్మికులు

తాము నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయాల్సి వస్తోందని తిరుపతికి చెందిన మున్సిపల్ కార్మికుడు మునిచంద్ర బీబీసీతో చెప్పారు.

''పని ఒత్తిడి భరించలేకపోతున్నాం. ప్రభుత్వం ఇస్తున్న జీతం ఏమాత్రం సరిపోవడం లేదు. మేస్త్రీల వల్ల ఇబ్బందిగా ఉంది. మ్యాన్‌హోల్ ఓపెన్ చేయగానే దిగమంటారు. వర్కర్లు లేరు, బండ్లు లేవు. ఉన్నవి సక్రమంగా పనిచేయవు.. వాటిని తోసుకుపోవాలి. ప్రతి విషయంలోనూ ఒత్తిడి ఉంది. మాకు కనీసం 300మందినైనా ఇస్తేనే పనిచేయగలం. పైపు లైన్లు పాడైపోయాయి.. వాటిని మార్చాలి. ముగ్గురు చనిపోయారు. రేపు మేమూ చనిపోయే పరిస్థితి ఉంది. భద్రతా పరికరాలు ఇవ్వరు. శాంపిల్స్, ఫోటోస్ తీసుకుంటారు. స్వచ్ఛ సర్వేక్షన్, స్వచ్ఛమిత్ర లాంటివేమీ లేదు’’అని మునిచంద్ర చెప్పారు.

ఆ రోజు ఏం జరిగింది?

అధికారుల లెక్కల ప్రకారం తిరుపతిలో 1994లో టీటీడీ ఆర్థిక సహకారంతో 175 కిలోమీటర్ల అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభమయ్యాయి.

అన్ని కాలువలూ కలిపి లెక్కేస్తే తిరుపతిలో ప్రస్తుతం 600 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ ఉంది.

జూన్ 14న మధ్యాహ్నం మ్యాన్‌హోల్ బ్లాక్ అయిందని సమాచారం రావడంతో రాడింగ్ మిషన్ డ్రైవర్ ఆర్ముగంతో కలిసి వెళ్లిన మున్సిపల్ కార్మికుడు మహేశ్ దానిని శుభ్రం చేయడానికి ప్రయత్నించారు.

మొదట మహేశ్ మ్యాన్‌హోల్‌లోకి దిగి ఊపిరాడక అరవడంతో ఆయన్ను కాపాడాలని ఆర్ముగం లోపలికి దిగారు. ఆయన కూడా ప్రమాదంలో పడడంతో ఆ దారిలో వెళ్తున్న లచ్చన్న వీరిని కాపాడేందుకు దిగి మురుగు నీటిలో మునిగిపోయారు.

ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పుడు వచ్చిన రక్షణ సిబ్బంది ముగ్గురినీ బయటకు తీశారు. ఆర్ముగం అక్కడికక్కడే చనిపోగా, మహేశ్, లచ్చన్నలను ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మహేశ్, జూన్ 15 మధ్యాహ్నం లచ్చన్న చనిపోయారు.

ఆర్ముగానికి పెళ్లై 10 నెలలే అయింది. ఆయన భార్య మౌనిక 5 నెలల గర్భవతి. ఆర్ముగం మరణంతో ఆమె సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.

''నా భర్త మూడేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. ఆయన నన్ను బాగా చూసుకునేవాడు. తను చనిపోవడంతో ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు” అని మౌనిక అన్నారు.

తిరుపతి ఘటనలో చనిపోయిన మరో కార్మికుడు మహేశ్ తల్లి వరలక్ష్మి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

''ఇలాంటి కడుపుకోత ఏ తల్లికీ రాకూడదు. ఏ భార్యాబిడ్డలు ఇలాంటి బాధలు పడకూడదు. రెండు నెలలకు ముందు కాలువలో పడి చెయ్యి విరిగిపోతే ఆస్పత్రుల చుట్టూ తిరిగి బాగు చేసుకున్నాం. ఆ పని చేయలేనమ్మా, వేరేది చూసుకుంటానని నాతో అన్నాడు. నా బిడ్డ జబ్బువచ్చి చనిపోలేదు. మురికి కాలువలో పడి ఊపిరాడక చనిపోయాడు. ప్రభుత్వం సక్రమంగా ఉంటే ఇలా జరిగేదా’’ అని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

మ్యాన్‌హోల్

కమిషనర్ ఏమన్నారు?

అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఫిర్యాదు వచ్చిన వెంటనే కార్మికులు నేరుగా వెళ్లారని తిరుపతి మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలి జూన్ 16న మీడియా సమావేశంలో చెప్పారు. ఆ పనిని మెషీన్ల సాయంతో చేయాలని, కానీ జాగ్రత్తలు తీసుకోకుండా లోపలికి దిగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె వివరించారు.

మ్యాన్‌హోల్స్ శుభ్రం చేసే కార్మికులకు తగినన్ని భద్రతా పరికరాలు ఇవ్వడం లేదనే కార్మికుల ఆరోపణలను కమిషనర్ తోసిపుచ్చారు.

చట్టం ఏం చెబుతోంది?

కార్మికులు మ్యాన్‌హోల్‌లో దిగి శుభ్రం చేయడాన్ని చట్టం అంగీకరించదని, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే దిగాల్సి ఉంటుందని సఫాయి కర్మచారి ఆందోళన్ జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ బీబీసీతో చెప్పారు.

ఈ కార్మికుల కోసం 23 రకాల సేఫ్టీ ఉపకరణాలు ఉన్నాయని, అవసరమైనప్పుడు వాటిని వేసుకుని మాత్రమే దిగాలని ఆయన తెలిపారు.

దేశవ్యాప్తంగా మ్యాన్‌హోల్స్‌లో పడి చనిపోయే కార్మికుల సంఖ్యను తగ్గించి చూపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుందని, ఆ శ్రద్ధ ఆధునిక యంత్రాల కొనుగోలుపై పెట్టడం లేదని విల్సన్ విమర్శించారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మనుషులు దిగకుండా క్లీన్ చేయడానికి సీవర్ క్రాక్ మిషన్లు ప్రపంచమంతా వాడుతున్నారని, అమెరికా లాంటి దేశాలలో మ్యాన్‌హోల్‌లోకి దిగరని, కానీ ఈ యంత్రాలను భారత్‌లో ఎక్కడా వాడడం లేదని ఆయన చెప్పారు.

ఆధునిక యంత్రాలు వాడకుండా మనుషులతో పనిచేయించడం వల్ల, తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మ్యాన్‌హోల్‌లో కార్మికులను దింపి శుభ్రం చేయించాల్సి వస్తే అనుభవం ఉన్న వ్యక్తులతో, తగిన జాగ్రత్తలు పాటిస్తూ చేయించాల్సి ఉంటుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు బీబీసీతో చెప్పారు.

“మ్యాన్‌హోల్స్‌లో నీళ్లు కొట్టి అదంతా డైల్యూట్ అయిన తరువాత మిథిన్ ఆయిల్ అనే ఇంధనాన్ని పెట్టి ఆ విష వాయువులను బయటకు పంపించాలి. నిచ్చెన వేసి దిగేటువంటి వ్యక్తి నడుముకి తాడు కట్టి పంపించాలి. లోపల ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ సప్లైతో వెళ్లాలి. లోపల డైరెక్టుగా కలబెట్టినప్పుడు ఒక్కసారిగా గ్యాస్ రిలీజ్ అవుతుంది. మ్యాన్యువల్‌గా కాకుండా మెషీన్‌తో పని చేయాలి. లోపలేమన్నా ప్రమాదం జరిగితే వెంటనే తాడు ద్వారా ఆ వ్యక్తిని బయటకు లాగాలి” అని ఆయన వివరించారు. తిరుపతిలో ఈ జాగ్రత్తలు పాటించలేదు’’అని ఆయన అన్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

మ్యాన్‌హోల్ లోపల మెటీరియల్స్ కుళ్లిపోయి ఉంటాయని, విష వాయువులు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లోపలకు వెళ్లడం ముప్పుతో కూడుకొన్నదని హెచ్చరిస్తున్నారు.

''మ్యాన్‌హోల్ ఓపెన్ చేసి కొంత సేపటి తరువాత దిగాలి. లోపల ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. అందుకే మెషీన్లను ఎక్కువగా ఉపయోగించాలి’’అని రుయా హాస్పిటల్ ప్రొఫెసర్, పల్మనాలజీ విభాగం అధిపతి సుబ్బారావు చెప్పారు.

మ్యాన్‌హోల్ ఘటనపై తిరుపతి ప్రజలు, బాధిత కుటుంబాలకు తాను క్షమాపణలు చెబుతున్నానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పరిపాలనా లోపాలను గుర్తించి, బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

తిరుపతి ఘటనకు సంబంధించి కార్పొరేషన్ ఏఈతోపాటు మరో సీనియర్ అధికారిని సస్పెండ్ చేశారు. ఇంజినీరింగ్ విభాగాధిపతికి కూడా సంజాయిషీ నోటీసులు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tirupati: Survivors devouring manholes - Should humans still enter sewers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X