బ్రిటన్ దెబ్బకు దెబ్బ కొట్టిన భారత్ - ఢిల్లీలో యూకే హైకమిషన్ బయట బ్యారికేడ్ల తొలగింపు..
బ్రిటన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం బయట ఖలిస్తాన్ నిరసనలను లైట్ తీసుకున్న ఆ దేశానికి భారత్ గట్టి షాక్ ఇచ్చింది.
ఢిల్లీ : గతవారం బ్రిటన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం దగ్గర ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. హైకమిషన్ కార్యాలయంపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించారు. దీంతో మరో భారీ పతాకాన్ని అప్పటికప్పుడు తెచ్చి కమిషన్ కార్యాలయంపై ప్రదర్శించారు. అక్కడితో ఆగకుండా భారత్ బ్రిటన్ కు ఇవాళ మరో షాకిచ్చింది.
ఢిల్లీలోని యూకే హైకమిషన్ కార్యాలయం బయట బ్యారికేడ్లను పోలీసులు తొలగించారు. ఇన్నాళ్లూ యూకే హైకమిషన్ కార్యాలయానికి భద్రతగా ఉంచిన ఈ బ్యారికేడ్లను సడన్ గా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. యూకే హైకమిషన్ కార్యాలయం దగ్గర తగినంత భద్రత ఉందని తెలిపారు. బ్రిటిష్ హైకమిషన్ బయట భద్రతా ఏర్పాట్లు చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. అయితే సందర్శకులు రాకుండా అడ్డంకిగా ఉన్న బారికేడ్లు మాత్రం తొలగించమని వెల్లడించారు.

మరోవైపు బ్రిటన్ లో భారత హైకమిషన్ కార్యాలయం వద్ద చోటు చేసుకున్న ఘటనలపై కేంద్రం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత హైకమిషన్ వద్ద తగిన భద్రత కల్పించాలని బ్రిటిష్ అధికారులను కోరింది. ఆదివారం రాత్రి లండన్‌లోని భారత మిషన్‌లో పూర్తి భద్రత లేకపోవడంపై వివరణ కోరుతూ భారతదేశం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించింది. అనంతరం ఢిల్లీలో యూకే కమిషన్ కార్యలయం బ్యారికేడ్లు తొలగించింది. దీనిపై బ్రిటన్ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications