రేపటిలోగా తేల్చకుంటే: గవర్నర్‌కు సుబ్రహ్మణ్య స్వామి 'కోర్టు' వార్నింగ్!
శశికళకు ముఖ్యమంత్రి అయ్యేందుకు సరిపోయే ఎమ్మెల్యేల బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమెను ఆహ్వానించకుంటే చట్టపరంగా ఇబ్బందులు ఉంటాయని సుబ్రహ్మణ్య స్వామి ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు హెచ్చర
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ముఖ్యమంత్రి అయ్యేందుకు సరిపోయే ఎమ్మెల్యేల బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమెను ఆహ్వానించకుంటే చట్టపరంగా ఇబ్బందులు ఉంటాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు హెచ్చరిక చేశారు.
శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గవర్నర్ విద్యాసాగర రావును రాజ్ భవన్‌లో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో శశికళకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు.

అనంతరం ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ అకౌంట్ ద్వారా షాకింగ్ కామెంట్లు చేశారు. రేపటిలోగా గవర్నర్ ముఖ్యమంత్రి అంశంపై తేల్చేయాలని లేదంటే లీగల్‌గా ఇబ్బందులు పడతారని స్వామి చెప్పారు. అవసరమైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేస్తున్నట్లు, ప్రేరేపిస్తున్నట్లు కోర్టుకు లాగుతానని కూడా హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం సీటు కోసం పన్నీరు సెల్వం, శశికళ నటరాజన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ సి విద్యాసాగర్ రావు జాప్యం చేస్తున్నారంటూ ఇప్పటికే శశికళ రాసిన లేఖ కలకలం రేపుతోంది.
The TN Guv must decide CM issue by tomorrow otherwise a WP under Art 32 of the Constitution can be filed charging abetment of horse trading
— Subramanian Swamy (@Swamy39) 12 February 2017
నిర్ణయం త్వరగా తీసుకోకపోతే ఏం చేయాలో తమకు తెలుసని, నిరసనకు దిగుతామని శశికళ ఆ లేఖలో హెచ్చరించారు. రాజకీయ వర్గాల నుంచి కూడా గవర్నర్ పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. శశికళను సీఎం కాకుండా గవర్నర్ అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శలొస్తున్నాయి.
పైగా కోర్టు తీర్పు ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు తెలియడంతో గవర్నర్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు వచ్చేంత వరకూ వేచి చూడాలని శశికళకు చెప్పిన గవర్నర్ ఇక లాభం లేదని భావిస్తున్నారు.
శశికళతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే న్యాయపరంగా తలెత్తే సమస్యలపై ఆయన మాజీ అటార్నీ జనరల్ సొరాబ్జీతో ఇవాల్టి భేటీలో మాట్లాడారు. ఆయన సలహాలు, అభిప్రాయాలు విన్న తర్వాత ఈ రాజకీయ సంక్షోభానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే యోచనకు గవర్నర్ వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో బలాబలాలు నిరూపించుకోవాలని ఇరు వర్గాలకు ఆయన సాయంత్రం లోపు సంకేతాలు పంపనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications