విభజన గాయాలు ఇంకా: స్వయం సమృద్ధి దిశగా సుదీర్ఘ ప్రయాణం: మోడీ
న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జాతీయ పతకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం ప్రాణత్యాగాలను అర్పించిన అమర వీరులను ఆయన స్మరించారు. విభజన గాయాలు ఇప్పటికీ మానట్లేదని పేర్కొన్నారు. విభజన గాయాలను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీని విభజన గాయాల దినంగా జరుపుకోనున్నట్లు తెలిపారు. దేశం స్వయం సమృద్ధిని సాధించడానికి ముందడుగు వేసిందని, లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందని అన్నారు.

యువతకు స్ఫూర్తి
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని చేపట్టామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. స్వయం సమృద్ధిని సాధించే దిశగా, సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించడానికి ఇది ఆరంభమని అన్నారు. దేశ పౌరునిగా తమ బాధ్యతలను గుర్తు చేసేలా, వాటిని నిర్వర్తించేలా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి పోరాడుతోన్న ఫ్రంట్‌లైన్ వర్కర్లను ప్రధాని ప్రశంసించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతి అథ్లెట్‌నూ ఆయన అభినందించారు. అథ్లెట్లు క్రీడల పట్ల యువతలో స్ఫూర్తినింపారని కొనియాడారు.

సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్
సబ్ కా సాథ్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్..సబ్ కా ప్రయాస్.. ఇదే నినాదంతో భారత్ ముందుకెళ్తుందని ప్రధాని మోడీ అన్నారు. సుదీర్ఘమైన లక్ష్యాన్ని అందుకునే ప్రయాణంలో ఈ నాలుగు అభివృద్ధి మంత్రాలుగా జపించాల్సి ఉంటుందని చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం పూర్వజన్మ సుకృతమని మోడీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సరికొత్త నిర్ణయాలను తీసుకోవాల్సి ఉందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఏడేళ్ల కిందట విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మోడీ గుర్తు చేశారు. ఇంటింటికీ వాటిని చేరవేస్తోన్నామని చెప్పారు.

పేదల అభ్యున్నతి..సమాన అభివృద్ధి లక్ష్యం
ఉజ్వల్ మొదలుకుని ఆయుష్మాన్ భారత్ పథకం వరకు ప్రతి పథకాన్ని దేశంలో నలుమూలలా నివసిస్తోన్న పేదలను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తోన్నామని చెప్పారు. గ్రామాల్లో నివసిస్తోన్న ప్రతి పేద వాడికి ఇంటికీ సంక్షేమ పథకాలను అందజేసే కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందేలా.. సమానాభివృద్ధి సాధించడానికి బాటలు వేశామని చెప్పారు.

సమ్మిళిత అభివృద్ధితోనే
దేశాభివృద్ధి అనేది ఏ ఒక్క వర్గానికో పరిమితమైనది కాదని ప్రధాని మోడీ అన్నారు. ప్రతి ఒక్కరు సమానాభివృద్ధిని సాధించినప్పుడే దేశం పురోగమిస్తుందనేది తన విశ్వాసమని చెప్పారు. అందుకే సమ్మిళత అభివృద్దిని కొనసాగిస్తోన్నామని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలు, బడుగు బలహీనులతో చేతులు కలిపి వారిని సమున్నత స్థితికి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయన్ రీజియన్, జమ్మూ కాశ్మీర్, లఢక్, కోస్తా తీరం, ఏజెన్సీ ప్రాంతాలు.. దేశాభివృద్ధికి ప్రధాన మూలాలుగా, పునాదులుగా మారేలా సమ్మిళిత అభివృద్ధి సాధిస్తామని మోడీ అన్నారు.

అభివృద్ధి వైపు గ్రామాలు పరుగులు
గ్రామాలు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోన్న అపురూప దృశ్యాలను తాము చూస్తోన్నామని ప్రధాని అన్నారు. రోడ్లు, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పిస్తోన్నామని చెప్పారు. ఆప్టికల్ ఫైబర్ సౌకర్యాన్ని ప్రతి గ్రామానికీ తీసుకెళ్తోన్నామని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ను వినియోగించుకుని.. గ్రామాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు కావడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ ఎంటర్‌ప్రెన్యువర్ గ్రామాల నుంచి ఆవిర్భవిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications