ఆటో నుండి దూకేసిన మహిళా టెక్కి, అరెస్టు
బెంగళూరు: ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళా టెక్కిని దోచుకుని దాడి చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన బెంగళూరులో జరిగింది. అయితే ఆమె ప్రాణాలకు తెగించి రోడ్డు మీద దూకేసి పోలీసులు, స్థానికుల సహాయంతో నిందితులను అరెస్టు చేయించింది.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరు నగరంలోని బన్నేరుఘట్ట రోడ్డులోని ఐబీఎం కంపెనీలో నేహా అగర్వాల్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి బయలుదేరింది.
బన్నేరుఘట్ట రోడ్డులోనే ఆటో ఎక్కి బీటీఎం లేఔట్ దగ్గరకు బయలుదేరింది. మార్గం మధ్యలో జయదేవ ఆసుపత్రి అండర్ పాస్ దగ్గర ఆమె కుర్చున్న సీటు వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వచ్చింది. అదే సమయంలో ఒక కత్తి ఆమె శరీరానికి తాకింది.

ఆటో అండర్ పాస్ లో ఉండటంతో చీకటి, అదే విధంగా భారీ వర్షం పడటంతో నేహా అగర్వాల్ హడలిపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆటో మెల్లిగా ముందుకు వెళుతున్నది. అయితే నేహా అగర్వాల్ ఒక్క సారిగా ఆటో లో నుండి రోడ్డు మీదకు దూకేసింది. వెనుక వస్తున్న కారు ఆమెను ఢీకొట్టింది.
అయితే కారు నిదానంగా వస్తుండంతో ఆమెకు చిన్నచిన్న గాయాలైనాయి. వెంటనే అక్కడ ఉన్న వారు, ట్రాఫిక్ పోలీసు ఏమి జరిగిందని వెళ్లారు. నేహా పోలీసులకు ఆటో చూపించింది. పోలీసులు వెళ్లి చూడగా ఆటో సీటు వెనుక ఒక యువకుడు చేతిలో కత్తి పెట్టుకుని కూర్చుని ఉన్న విషయం వెలుగు చూసింది.
వెంటనే పోలీసులు యువకుడితో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ సహాయంతో ఒంటరిగా ప్రయాణించే మహిళల మీద దాడి చేసి లూటీ చెయ్యడానికి ప్రయత్నించారని వెలుగు చూసింది. ఈ విషయం మొత్తం నేహా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. నేహా తనను రక్షించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. రాత్రి ఒంటరిగా ఆటోలో ప్రయాణించే మహిళలు జాగ్రతగా ఉండాలని పోలీసులు మనవి చేశారు.












Click it and Unblock the Notifications