షాకింగ్: భారత్‌లో కరోనా ట్రిపుల్ మ్యుటేషన్లు -అందువల్లే భారీగా కేసులు -చిన్న పిల్లలపైనా ఎఫెక్ట్
ప్రపంచ దేశాలకు భిన్నంగా భారత్ లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదరకంగా ఉండటానికి, రోజువారి కొత్త కేసులు 3లక్షలకుపైగా, మరణాలు రెండు వేలకు దగ్గరగా నమోదు కావడానికి కొత్త రకం ట్రిపుల్ మ్యూటేషన్లే కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ తన రూపాన్ని(వేరియంట్స్) మార్చుకునే కరోనా వైరస్.. కొద్ది కాలం కిందటే డబుల్ మ్యూటేషన్లుగా ఏర్పడి తీవ్ర ప్రభావం చూపేదిగా మారింది. ఇప్పుడది ఇంకా బలపడుతూ త్రిపుల్ మ్యూటేషన్ వేరియంట్ గానూ రూపాంతరం చెందిందని సైంటిస్టులు చెబుతున్నారు.
దేశంలో ట్రిపుల్ మ్యూటేషన్ల కారణంగానే కొత్త కేసులు, మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మనం కొవిడ్ పై మరింత లోతుగా అధ్యయనం చేస్తూ, వ్యాక్సిన్లను ఇంకాస్త అభివృద్ధి చేయాలని, కొత్తగా పుట్టుకొచ్చిన ట్రిపుల్ మ్యూటేషన్ వేరియంట్లు భారత్ పాలిట సవాలుగా మారాయని మెక్ గిల్ యూనివర్సిటీ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మధుకర్ అన్నారు.

మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో నమోదైన కొత్త కేసుల్లో ట్రిపుల్ మ్యూటేంట్ కనిపించిందని, ఈ ట్రిపుల్ మ్యూటేంట్‌తో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ, వెంటనే అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోందని ప్రొఫెసర్ మధుకర్ తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో (జీనోమ్ సీక్వెన్స్) జన్యు శ్రేణిలను కేవలం ఒక శాతం కంటే తక్కువగా స్టడీ చేస్తున్నామని ఆయన వివరించారు. కాగా,
దేశంలో కరోనా మొదటి వేవ్‌లో పది మందిల్లో ఒకరు లేదా ఇద్దరికి వైరస్ వ్యాప్తి చెందగా, ప్రస్తుత డబుల్ మ్యూటేషన్‌తో వైరస్ వ్యాప్తి ఎనిమిదికి చేరింది. డబుల్ మ్యూటేషన్‌తో చివరికి చిన్న పిల్లలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ట్రిపుల్ మ్యూటేషన్ అంతకుమించి వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ మ్యూటేషన్స్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి వైరస్ జెనోమ్ను స్టడీ చేయడానికి 10 ల్యాబ్ లు మాత్రమే ఉన్నాయి.












Click it and Unblock the Notifications