తలాఖ్‌పై ముగిసిన వాదనలు: తీర్పును రిజర్వులో పెట్టిన సుప్రీం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ కేసుపై ఆరు రోజులపాటు విస్తృతంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఈ కేసులో వాదనలు గురువారంతో ముగిశాయి. ఈ విషయంపై నిపుణుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత క్షుణ్ణంగా చర్చించి జులై నెలలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

అంతకుముందు షయారా బానో తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అమిత్ ఛద్దా తన వాదనలను కోర్టుకు వినిపించారు. ట్రిపుల్ తలాఖ్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఒక పాపంగా ఆమోదించాలని ఆయన అన్నారు. కాగా, ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాత్రం.. ట్రిపుల్ తలాఖ్ అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని చెప్పారు.

అయితే, ఈ వాదనను షయరా బానో న్యాయవాది ఛద్దా తిప్పికొట్టారు. అసలు ట్రిపుల్ తలాఖ్ అనే పదం గానీ, ఆచారం గానీ పవిత్ర ఖూరాన్‌లో ఎక్కడా లేదని, అది ఆమోదయోగ్యం కాని విషయమని స్వయంగా పర్సనల్ లా బోర్డే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది పితృస్వామ్య వ్యవస్థకు నిదర్శనమని, పాపమని కూడా చాలా వరకు ఇస్లాం స్కూళ్లలో చెబుతున్నారని తెలిపారు. అయినా దాని విషయంలో కోర్టు జోక్యం చేసుకోకూడదని చెప్పడం సరికాదని అమిత్ ఛద్దా అన్నారు.

Triple talaq: SC reserves verdict as Muslim board assures advisory to all qazis

ఈ విషయంలో రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఏకైక మార్గమని ఆయన తన వాదనను వినిపించారు. మతం ఏ చెబుతుందో ఆర్టికల్ 25కూడా అదే చెబుతోందని, ఈ అలవాటు ఇస్లాం ప్రకారం సరైంది కాదని, అందువల్ల ఇందులో మతాచారాలను ఉల్లంఘించినట్లు ఏమీ లేదని అమిత్ ఛద్దా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జస్టిస్ నారిమన్ జోక్యం చేసుకుని.. 'మీరు వాదించేదాన్ని బట్టి అసలు ట్రిపుల్ తలాఖ్ అనే అలవాటు మతంలో భాగమే కాదు కదా?' అని ప్రశ్నించారు. దీనికి అవునని ఛద్దా సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఈ కేసులో వాదనలు మొత్తం ముగిసినట్లు రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. ప్రస్తుతానికి రిజర్వులో ఉంచిన తీర్పును త్వరలోనే సుప్రీం వెలువరించే అవకాశం ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Thursday reserved its order on a plea that challenged the constitutional validity of triple talaq. The Bench heard the matter on a day to day basis. Today on the concluding day of the hearing, the court granted each of the parties to make submissions for 20 minutes each.
Please Wait while comments are loading...