వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపుర: ఈ రాష్ట్రంలో మత ఘర్షణల వెనుక అసలు నిజాలేంటి - బీబీసీ పరిశోధన

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆగి ఆగి కిటికీ లోంచి తొంగి చూసిన ఒక పెద్ద వయసు టీచర్ తర్వాత మమ్మల్ని తేరిపార చూశారు. తర్వాత "అంతా బాగానే ఉందా సార్. ఏం సమస్య లేదు కదా" అని అడిగారు.

మదరసా పక్కనే ఒక మసీదు ఉంది. అది ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. మూడు అడుగుల ఎత్తున్న దాని కిటికీల ఫ్రేములు విరిగి పోయి ఉన్నాయి.

సీలింగుకు వేలాడుతున్న ఫ్యాన్ల రెక్కలు కిందికి వంగిపోయున్నాయి. రాళ్లతో కొట్టడంతో మసీదులోని దాదాపు అర డజను షాండ్లియర్లు పగిలిపోయాయి.

సరిగ్గా మసీదు వెనక ఒక ముస్లిం కుటుంబం ఇల్లుంది. దానికి ఎదురుగా ఒక హిందూ కుటుబం నివసిస్తోంది.

అక్కడ కవరేజీకి వెళ్లిన బీబీసీ టీమ్ వెనుకే ఒక త్రిపుర పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌ రావడంతో, అది చూసిన ఆ రెండు ఇళ్లలో ఎవరూ తలుపులు కూడా తీయలేదు.

ఇది త్రిపుర రాష్ట్రంలోని ధర్మనగర్ జిల్లా చాన్‌తిలా ప్రాంతం. రాష్ట్రంలో మొదటిసారి జరిగిన మత ఘర్షణలకు ఇటీవల ఇది సాక్ష్యంగా నిలిచింది.

ఏమైంది, ఎందుకు జరిగాయి

2021 అక్టోబర్‌లో దుర్గాష్టమి రోజున భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో హిందువులకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి.

మొదట చిట్టగాంగ్ జిల్లాలోని కమిలా నగరంలో ఇవి ప్రారంభమయ్యాయి. దీంతో భారత్‌ను హెచ్చరించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, తమ దేశంలోని మైనారిటీ హిందువులకు భరోసా ఇచ్చింది.

"భారత్ మా కోసం చాలా చేసింది. మేం దానికి రుణపడి ఉన్నాం. మా దేశంపై ప్రభావం పడకుండా, ఇక్కడి హిందూ వర్గాలు నష్టపోకుండా, అక్కడ కూడా ఎలాంటి ఘటనలూ జరగకుండా చూసుకోవాలి" అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు.

మసీదు

కానీ మూడు వైపులా బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఉన్న త్రిపుర రాష్ట్రంలో ఆ హింస ప్రభావం వెంటనే కనిపించింది.

అది జరిగిన దాదాపు 10 రోజుల్లో గోమతి జిల్లాలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక మసీదుకు నిప్పు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సిపాహీజాలా జిల్లాలో మసీదులపై దాడులకు చేసిన ప్రయత్నం విఫలమైనట్లు వార్తలు వ్యాపించాయి.

ఈలోపు రాష్ట్రంలోని అతిపెద్ద ముస్లిం సంఘం జమాత్-ఎ-ఉలేమా(హింద్) రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ను కలిసింది. రాష్ట్రంలో హిందూ, ముస్లిం సమాజాల మధ్య ఉన్న శాంతికి ముప్పు పొంచి ఉందని చెప్పింది. ప్రభుత్వం నుంచి వారికి భరోసా కూడా లభించింది.

పానీ సాగర్ హింస

బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబాలపై జరిగిన హింసకు వ్యతిరేకంగా అక్టోబర్ 26న 'ప్రతివాద్ ర్యాలీ' పేరుతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించినప్పుడు ఒక ఘటన జరిగింది.

దాదాపు పది వేల మంది పాల్గొన్న ఈ ర్యాలీలో విశ్వహిందూ పరిషత్‌తోపాటూ కొన్ని హిందూ సంస్థలు, స్థానిక గ్రూపులు కూడా ఉన్నాయి.

మొదట ర్యాలీ శాంతియుతంగానే సాగిందని, ఆ తర్వాత అది హింసాత్మకంగా మారిందని ఈ ప్రాంతంలో మైనారిటీ ముస్లింలు చెబుతున్నారు.

ఈ ర్యాలీ నిర్వాహకుల్లో బిజిత్ రాయ్ కూడా ఒకరు. ఆయన పానీసాగర్ విశ్వహిందూ పరిషత్ యూనిట్ అధ్యక్షుడుగా ఉన్నారు.

ర్యాలీ నిర్వహించిన బిజయ్ రాయ్

"మేం శాంతియుతంగా ర్యాలీ చేయాలని ప్లాన్ చేశాం. ఇక్కడ నుంచి చామ్‌తిలా వరకూ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. మేం వెళ్తుండగా హఠాత్తుగా ఏదో కలకలం వినిపించింది. దాంతో అక్కడ రాళ్లు రువ్వారేమో అనుకుని మేం ఆ వైపు పరిగెత్తాం. అది వినగానే జనం కాస్త అదుపు తప్పారు. సమీపంలో ఒక మసీదు ఉంది. మేం ఎలాగోలా ఆ మసీదును కాపాడగలిగాం" అని ఆయన బీబీసీకి చెప్పారు.

బంగ్లాదేశ్‌లో జరిగిన హింసకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్నప్పుడు, భారత ముస్లింలను లక్ష్యం ఎందుకు అయ్యారు అనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు.

"భారత ముస్లింలకు ఎవరూ వ్యతిరేకం కాదు. వారు మన దేశ పౌరులు. మనకు ఎన్ని హక్కులున్నాయో, అవి వాళ్లకూ ఉన్నాయి" అన్నారు.

అయితే, చామ్‌తిలాలో తాము కాపాడినట్లు ఆయన చెప్పిన మసీదులో ఆ రోజు జరిగిన విధ్వంసం ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు రేకుల షెడ్డులో నడుస్తున్న మరో మసీదుపై కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

త్రిపురలో ముస్లింలు మైనారిటీలు. ఇక్కడ హిందూ జనాభా 83 శాతం ఉంది. వీరిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు కూడా ఉన్నారు.

త్రిపురలో ముస్లింలపై జరుగుతున్న దాడులను అందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల స్పందనగానే భావిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఏదైనా జరిగితే ఆ ప్రభావం మళ్లీ త్రిపురలో కనిపిస్తుందేమోనని భయపడుతున్నారు.

రోవా హింస

చామ్‌తిలా మసీదుకు 1.5 కిలోమీటర్ల దూరంలో రోవా టౌన్ ఉంది. అక్కడ నిరసనకారులు ఐదు దుకాణాలకు కూడా నిప్పు పెట్టారు.అయితే, ప్రతివాద్ ర్యాలీ సమయంలో అక్కడ రెండు షాపులకే నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు చెప్పారు.

కానీ, బీబీసీ ఆ సమయంలో అక్కడ అయిదు దుకాణాలకు నష్టం జరిగినట్లు ధ్రువీకరించుకుంది.

ఆమిర్ హుస్సేన్, మొహమ్మద్ అలీ, తాలుక్‌దార్, సనోహర్ అలీ, నిజాముద్దీన్, అమీరుద్దీన్‌ల షాపులు పూర్తిగా, పాక్షికంగా తగలబడ్డాయి.

"మా కళ్ల ముందే మొదట షాపు ధ్వంసం చేసి దోచుకున్నారు. తర్వాత నిప్పు పెట్టారు. మేం ఇక్కడ మసీదు ముందే నిలబడి ఉన్నాం. షాపు దగ్గరకు వెళ్లేవాళ్లమే. కానీ, పోలీసులు ఆగండి.. వెళ్లకండి అని అడ్డుకున్నారు" అని అమీరుద్దీన్ చెప్పారు.

అమీరుద్దీన్ షాపు మంటల్లో బూడిదైంది. లోపల కాలిపోయిన ఫ్రిజ్ కూడా ఉంది.

అమీరుద్దీన్

సనోహర్ అలీ కూడా రోవాలోనే ఉంటారు. హింస జరిగినపుడు మేం దగ్గరలోనే ఉన్న మరో మసీదు వెనక నిలబడి ఉన్నాం అని ఆయన చెప్పారు.

"ఆ సమయంలో గుంపు మసీదు దగ్గరకు వెళ్లలేకపోవడంతో, కోపంగా మా షాపులపైకి వచ్చింది. వారు మొదట ఒక షాపుకి నిప్పు పెట్టారు. అవి తర్వాత పక్క షాపులకు అంటుకున్నాయి. చెప్పులు, బ్యాగ్స్, గొడుకులు అన్నీ పూర్తిగాకాలిపోయాయి" అన్నారు.

ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం జిల్లా అధికారులు ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ఏడెనిమిది మంది పోలీసులను ముందే మోహరించారు. కానీ ఆ చర్యలు గుంపును అడ్డుకోడానికి సరిపోలేదు.

రోవాలో కాలిపోయిన ఒక షాపు

కదమ్‌తలాలో ఏం జరిగింది

పానీసాగర్‌లో చామ్‌తిలా మసీదు, మైనారిటీల షాపుల దహనం సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయని ధర్మనగర్ జిల్లాలో ఉన్న వారు చెప్పారు. దీంతో రోవా పక్కనే ఉన్న కదమ్‌తలాలో ముస్లిం సమాజాల వారంతా దీనికి నిరసనగా పోగయ్యారు.

అదే రాత్రి 10 గంటల సమయంలో కదమ్‌తలా దగ్గర చుడాయిబాడీ పట్టణంలో కూడా జనం గుమిగూడారు. కొందరు హిందువుల ఇళ్లపై రాళ్లు రువ్వారు.

వీటిలో సునాలీ సాహా ఇల్లు కూడా ఒకటి. ఈ దాడుల్లో ఇంట్లో ఉన్న కారు అద్దాలు పగిలిపోయాయి.

తల్లితో సుహాలీ సాహా

"నేను చదువుకుంటున్నా, హఠాత్తుగా కొంతమంది వచ్చి దాడి చేశారు. ఎంత గొడవ జరిగిందంటే.. మేం బయటకు రాలేకపోయాం. మమ్మీ తలుపులు మూసేశారు. పది నిమిషాల తర్వాత అంతా సద్దుమణిగింది. కానీ, మేం బయట అడుగు పెట్టలేకపోయాం. ఎందుకంటే అదంతా గాజు ముక్కలు ఉన్నాయి. చాలా భయమేసింది. ఎందుకంటే ఇలా జరగడం నేను మొదటిసారి చూశాను. ఆ భయం ఇప్పటికీ ఉంది" అన్నారు సునాలీ.

కదమ్‌తలా ఎమ్మెల్యే, సీపీఎం నేత ఇస్లాముద్దీన్ దీనిపై బీబీసీకి సమాధానం ఇచ్చారు.

"పానీసాగర్‌లో ఆ ఘటనల తర్వాత ఇక్కడ ఉన్న ముస్లింలు ఆగ్రహించారు. అది నిజమే. కానీ, ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా మేం వీలైనంత వరకూ ఆపడానికి ప్రయత్నించాం" అని చెప్పారు.

మొదట్లో పోలీసులు, అధికారులు యాక్టివ్‌గా లేరు. పానీసాగర్ హింస తర్వాతే అందరూ యాక్టివ్ అయ్యారు.

కదమ్‌తలా ఎమ్మెల్యే ఇస్లాముద్దీన్

పానీసాగర్ ర్యాలీ తర్వాత కదమ్‌తలా, ఉనాకోటీ జిల్లాలోని కైలాష్ షహర్‌, ధర్మనగర్, యువరాజ్‌నగర్‌లో ముస్లింల నుంచి నిరసనలు మొదలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు, అధికారులు యాక్టివ్ అయ్యారు.

త్రిపురలోని మూడు జిల్లాల్లో మత ఘర్షణలతో ఉద్రిక్తతలు నెలకొనడం వెనుక అధికారుల పాత్రలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

దాదాపు ప్రతి దగ్గరా ఈ ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం ఆలస్యం అయ్యింది. నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం జరిగింది.

కానీ, త్రిపుర(ఉత్తర) ఎస్పీ భానుపదా చక్రవర్తి మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

"ధర్మనగర్ ర్యాలీలో పది వేల మంది పాల్గొన్నారు అనేది నిజమే. కానీ, మసీదు తగలబెట్టారా లేదా అనేది దర్యాప్తుకు సంబంధించిన విషయం. ఆ కేసు కోర్టులో ఉంది. ఇక పోలీసులు చర్యలు తీసుకునే విషయానికి వస్తే మేం ఎలాంటి తేడా చూడకుండా అనుమానం ఉన్న అందరినీ అరెస్ట్ చేశాం" అన్నారు.

మసీదులో విరిగిపోయిన ఫ్యాన్లు

ఉద్రిక్తతలు ముందెప్పుడూ లేవు

బంగ్లాదేశ్‌తో త్రిపుర 856 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. కానీ, బంగ్లాదేశ్‌లో మెజారిటీ ముస్లింల ద్వారా గతంలో ఎప్పుడు హింస జరిగినా, ఇక్కడ కొన్ని నిరసన ప్రదర్శనలు తప్ప పెద్దగా ప్రభావం కనిపించలేదు.

1980లో త్రిపురలో బెంగాలీలు, గిరిజనుల మధ్య హింస జరిగింది. అందులో హిందూ, ముస్లింలు ఇద్దరూ ఉన్నారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించింది. రాష్ట్రంలో 25 ఏళ్ల లెఫ్ట్ అధికారానికి తెర పడింది.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ మతసామరస్యం బలహీన పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బీబీసీ దీనిపై త్రిపుర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ధర్మనగర్ ఎమ్మెల్యే బిశ్వబంధు సేన్‌తో మాట్లాడింది.

త్రిపుర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ బిశ్వబంధు సేన్

రాష్ట్రంలో ముస్లిం సమాజాలు భయంలో జీవిస్తున్నాయా? అని ఆయనను అడిగి తెలుసుకోవాలని భావించింది.

"లేదు, అలా అసలు లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఎలాంటి నష్టం జరగదని ముస్లింలలో ధీమా వచ్చింది. మోదీకి, బీజేపీకి, బిప్లబ్ దేబ్‌కు వ్యతిరేకంగా ఉన్నావారి వల్లే రాష్ట్రంలో మతపరమైన విభజన మొదలైంది" అని ఆయన చెప్పారు.

పానీసాగర్ హింస జరిగిన రెండు వారాల తర్వాత, రెచ్చగొట్టే కంటెంట్ పోస్ట్ చేశారనే ఆరోపణలతో త్రిపుర ప్రభుత్వం ఇద్దరు మహిళా జర్నలిస్టులను అదుపులోకి తీసుకుంది.

కానీ, మతపరమైన హింసను రిపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్లిన ఈ ఇద్దరు జర్నలిస్టులను బెయిలు మీద విడుదల చేయాలని తర్వాత రెండ్రోజులకే త్రిపురలోని ఒక కోర్ట్ ఆదేశించింది.

"జర్నలిజం ఎప్పటి నుంచి నేరంగా మారింది?" అని సీనియర్ బీజేపీ నేత బిశ్వంబంధు సేన్‌ను బీబీసీ అడిగింది.

"జర్నలిస్టులు తమ డ్యూటీ చేస్తున్నారు. ఫొటోలు, సాక్ష్యాలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఆరోపణలూ లేకుండానే వారిని అదుపులోకి తీసుకోవడం ఏంటి. ఇదే ప్రజాస్వామ్యమా" అని ప్రశ్నించింది.

బిశ్వబంధు ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు.

"డెమాక్రసీ ఫుల్ ఫెయిర్‌నెస్‌ను జర్నలిస్టులు తీసుకుంటున్నారు, రాజకీయ పార్టీలు కాదు. చాలా మంది ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యమా? కొన్ని పత్రికలు, కొందరు రచయితలు, ఎప్పుడూ ఏదో ఒకటి వ్యాపించేలా చేస్తూ ఉంటారు" అన్నారు.

కానీ, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి ఆయన వాదనలకు పూర్తి భిన్నంగా ఉంది.

వాస్తవం ఏంటంటే, ఈ ఘటనలు త్రిపురలో ఉన్న వారి మనసును బాధపెట్టాయి. హింసను దగ్గర నుంచి చూసినవారికి, స్వతంత్ర భారత చరిత్రలో త్రిపురలో ఎప్పుడూ మతఘర్షణలు జరగలేదని గర్వంగా చెప్పుకున్న వారికి కూడా అదే అనిపించింది.

ఇక్కడ జరిగిన ఘటనలపై మీరు చింతిస్తున్నారా అని బీబీసీ విశ్వహిందూ పరిషత్ పానీసాగర్ యూనిట్ అధ్యక్షుడు బిజిత్ రాయ్‌ను ప్రశ్నించింది.

కాసేపు మౌనంగా ఉన్న ఆయన "ఇది చాలా విచారకరం, మరో వందేళ్లపాటు ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేలా మేం చూసుకుంటాం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tripura: What is the real truth behind the religious clashes in this state - BBC research
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X