విజయ్ గేమ్ ప్లాన్ ఛేంజ్..అనూహ్య ఎత్తుగడ: ఓ అడుగు ముందే ఉన్న దళపతి
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి.
ఎన్నికల సన్నాహాలు ముమ్మరమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంబంధిత కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ కమిటీ ఎన్నికల పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి సంప్రదింపులు, ప్రచార సమావేశాలు, ఇతర సంస్థాగత కార్యక్రమాలను చేపడుతుంది. నియోజకవర్గాల్లో ప్రచార వ్యూహాలు సజావుగా అమలు అయ్యేలా చూస్తుంది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు విజయ్ బహిరంగ లేఖ రాశారు. ఈ కమిటీకి పూర్తి సహకారం అందించాలని పార్టీ సభ్యులు, ఆఫీస్ ఇన్ ఛార్జీలు, బేరర్లకు విజ్ఞప్తి చేశారు.
మొత్తం 10 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్, ఎన్నికల ప్రచార నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున, ఉన్నతస్థాయి పరిపాలనా కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కేఎన్ సెంగోటయ్యన్, ఏ పార్థిబన్, బీ రాజ్‌కుమార్, కేవీ విజయ్ థాము, ఎస్పీ సెల్వం, కే పిచ్చైరతినం కరికలన్, ఎం సెరవు మొహిదీన్ అలియాస్ నియాస్, జే కేథరిన్ పాండియన్ సభ్యులుగా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications