బైక్ కొంటే రెండు హెల్మెట్లు-ఇక కొత్త రూల్ ..!
దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు హెల్మెట్ వాడకం నిబంధనను తప్పనిసరి చేస్తున్నాయి. ఏపీ వంటి రాష్ట్రాల్లో హైకోర్టు ఆదేశాలతో హెల్మెట్ల వాడకాన్ని పోలీసులు తప్పనిసరి చేశారు. అయితే బైక్ నడిపే వారితో పాటు వారి వెనుక కూర్చొనే వారికి కూడా హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ పోలీసులు పలు రాష్ట్రాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం బైక్ కొనే సమయంలోనే దాని తయారీ కంపెనీలు వినియోగదారులకు హెల్మెట్ ను అందజేస్తున్నాయి. దీన్ని కొన్ని కంపెనీలు ఫ్రీగానూ, మరికొన్ని ఛార్జీలు వసూలు చేసి మరీ ఇస్తున్నాయి. అయితే కేంద్రం ఇప్పుడు బైక్ అమ్మే సమయంలోనే వినియోగదారులకు రెండు హెల్మెట్లను తప్పనిసరిగా ఇచ్చే నిబంధనను అమలు చేయబోతోంది. తద్వారా బైక్ కొనే వారికి అదే సమయంలో రెండు హెల్మెట్లు తప్పనిసరిగా కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నిబంధనను తాజాగా మోటర్ చట్టం నిబంధనల్లో పొందు పర్చేందుకు వీలుగా ముసాయిదా పత్రాన్ని కేంద్రం సిద్ధం చేసింది. దీనిపై ప్రజల అభిప్రాయాలు కోరుతోంది. వీటి ఆధారంగా ఈ నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజుల్లో హెల్మెట్ లేకుండా టూవీలర్లు నడిపే పరిస్ధితి లేకపోవడంతో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం పట్టుదలగా ఉంది. అయితే ఇలా రెండు హెల్మెట్లను కంపెనీలు ఉచితంగా ఇవ్వాలా లేక ఛార్జీలు వసూలు చేసి అమ్మాలా అన్నది కేంద్రం స్పష్టం చేయలేదు. కానీ ఈ నిబంధన అమలైతే మాత్రం బైక్ తయారీ కంపెనీలు సహజంగానే వినియోగదారులపైనే ఆ భారం వేయడం ఖాయం..












Click it and Unblock the Notifications