కోల్ కతాలో ఇద్దరు తీవ్రవాదులు అరెస్టు
కోల్ కతా: కోల్ కతా లో ఇద్దరు ఉగ్రవాదులను కోల్ కతా ఎన్ఐఎఎస్టీఎఫ్ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు జమాత్ ఉల్ ముజాహుద్దీన్ బంగ్లాదేశ్ (జేఎమ్ బీ) తీవ్రవాద సంస్థ సభ్యులని కోల్ కతా పోలీసు అధికారులు తెలిపారు. హబీబుల్ హాక్వె, ఇన్మౌల్ ముల్హా అనే ఇద్దరిని అరెస్టు చేశామని బుధవారం పోలీసు అధికారులు తెలిపారు.
వీరిద్దరికి బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని అధికారుల విచారణలో వెలుగు చూసిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్ టీఎఫ్) జాయింట్ ఆపరేషన్ చేపట్టి మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
వీరిద్దరు కోల్ కతాలోని మెటిబ్రజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు. కచ్చితమైన వివరాలు సేకరించి దాడి చేసి తీవ్రవాదులను అరెస్టు చేశారు. 2014లో జరిగిన బురద్వాన్ బాంబు పేలుడు కేసులో వీరిద్దరికి సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి.

ఈ కేసులో వీరి పాత్ర ఎంత వరకు ఉంది అని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. అదే విధంగా కోల్ కతాలో బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థను బలపరచడానికి పలువురు సభ్యులను చేర్చుకుంటున్నారని తమ వద్ద సమాచారం ఉందని కోల్ కతా పోలీసు అధికారి యూసెఫ్ గెజి తెలిపారు.
వీరిద్దరి అరెస్టుతో కోల్ కతా తో పాటు దేశంలో తల దాచుకున్న జమత్ ఉల్ ముజాహుద్దిన్ బంగ్లాదేశ్ తీవ్రవాద సభ్యులను గుర్తించడానికి అవకాశం ఉందని యూసెఫ్ గెజి అన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లో చోరబడి ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications