Maharastra Polls: మహా ఎన్నికలకు ఉద్ధవ్ సేన మ్యానిఫెస్టో-ధారావి ప్రాజెక్టు రద్దుకు హామీ..!
ఈ నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని విపక్ష శివసేన యూబీటీ ఇవాళ మ్యానిఫెస్టో విడుదల చేసింది. మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉన్న శివసేన యూబీటీ వర్గం ఇవాళ ప్రకటించిన మ్యానిఫెస్టోలో పలు కీలక హామీలు ఉన్నాయి. ఇందులో ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో నిర్మిస్తున్న ప్రాజెక్టు రద్దును కూడా ప్రకటించింది. దీంతో పాటు మహిళలకు నెలకు 3 వేలు ఇచ్చే పథకం, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వంటి హామీలు కూడా ఉన్నాయి.
ముంబైలోని ఎంఎంఆర్డీఏ గ్రౌండ్స్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు పాల్గొన్న 'సంవిధాన్ సభ' ర్యాలీలో మహావికాస్ అఘాడీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో రాష్ట్రంలోని మహిళా విద్యార్థులు ప్రభుత్వ విధానంలో ఉచిత విద్యను పొందుతున్న విధంగా, తమ కూటమి అధికారంలోకి వస్తే మగ విద్యార్థులకు కూడా అమలు చేస్తామని థాకరే హామీ ఇచ్చారు.అంతేకాకుండా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్ర పోలీసు బలగాల్లో 18,000 మంది మహిళలను నియమిస్తామని మరో హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో నిత్యావసర వస్తువుల ధరలను స్ధిరీకరిస్తామని కూడా మరో హామీ ఇచ్చారు. అలాగే తమకు అధికారమిస్తే ముంబైపై ప్రభావం చూపే ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేస్తామని ప్రకటించారు. వేగవంతమైన పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, ముంబైలలో కూడా హౌసింగ్ పాలసీ ఉంటుందన్నారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో 'మట్టి పుత్రుల' కోసం అందుబాటు ధరలో ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications