మహారాష్ట్ర నాకు ఇలా చేస్తుందనుకోలేదు-ఉద్ధవ్ థాక్రే షాకింగ్ రియాక్షన్..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంపై శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఉద్ధవ్ థాక్రే స్పందించారు. మహా రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే సునామీ సృష్టించిందని అంగీకరిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమిపైనా, మహారాష్ట్ర ప్రజలపైనా ఉద్ధవ్ థాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో మహా వికాస్ అఘాడీ ఘోర పరాజయంపై ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి భారీ విజయంపై స్పందిస్తూ సునామీ లాంటి విజయం సాధించడానికి అసలు వారేం చేశారంటూ ఉద్ధవ్ థాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్ధవ్..ఇంతటి విజయం వెనుక ఉన్న మర్మాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ఫలితాలను కెరటం అనే దాని కంటే సునామీ అనాలంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. కానీ ఈ స్ధాయి విజయం కోసం వారు ఏమి చేశారో తనకు అర్థం కాలేదన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయే కూటమికి ఉద్ధవ్ థాక్రే అభినందనలు తెలిపారు. అయితే మహాయుతి విజయంలో కీలకంగా మారిన లడ్కీ బహిన్ యోజన పథకం సక్రమంగా అమలు చేస్తారని, మరో ఎన్నికల గిమ్మిక్కు చేయరని ఆశిస్తున్నట్లు ఉద్ధవ్ తెలిపారు. రైతుల అప్పులు తీరుస్తారని, వారు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో తనను కుటుంబ పెద్దగా భావించి అండగా నిలిచిన మహారాష్ట్ర.. ఇప్పుడిలా ప్రవర్తిస్తుందంటే తాను నమ్మలేకపోతున్నట్లు ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications