డిసెంబర్ 16, 17న బ్యాంకుల సమ్మెబాట.. రైతుల ఉద్యమమే స్పూర్తి.. కేంద్రం తీరుపై యూనియన్ల గరం గరం
ప్రభుత్వ రంగంలోని రెండు ప్రధాన బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ బ్యాంకుల ఉద్యోగులు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. డిసెంబర్ 16, 17 తేదిల్లో బ్యాంకుల సమ్మెకు యూనైటెడ్ ఫోరం ఆప్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు ఇచ్చింది.. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేకపోతే నిరవధిక సమ్మెకు వెనుకాడమని హెచ్చరించింది.

రైతుల ఉద్యమమే మాకు స్పూర్తి..
కేంద్రం తక్షణమే బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే .. రైతుల ఉద్యమ స్పూర్తితో తమ సమ్మెను ఉధృతం చేస్తామని బ్యాంకుల యూనియన్స్ హెచ్చరిస్తున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి పోరాటానికి దిగుతామని స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకులను కాపాడుకునేందుకు రాజకీయ పోరాటానికైనా తామంతా సిద్ధమని పేర్కొంటున్నాయి. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మోసం చేసిన వారిని ఎందుకు జైల్లో పెట్టట్లేదని యూనియన్ నాయకులు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులను దొంగల చేతిలో పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణతో ఆర్థిక వ్యవస్థలో ప్రధాన రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు- 2021కు కేంద్రం కసరత్తు..
బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు -2021ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2021న బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం ఆ దిశగా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ సమ్మె చేపట్టనున్నట్లు యూనైటెడ్ ఫోరం ఆప్ బ్యాంక్ యూనియన్స్ పేర్కొంది.

ఎస్‌బీఐ అలర్ట్..
డిసెంబర్ 16, 17 తేదిల్లో బ్యాంకుల సమ్మెతో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్ అయింది. ఈ సమ్మెకు తమ ఉద్యోగులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ రెండు రోజులు కస్టమర్లు వీలైనంత మేరకు డిజిటల్ ట్రాన్‌జాక్షన్స్ ను వినియోగించుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. బ్యాంకులు యథావిదిగా పనిచేస్తాయి కానీ కస్టమర్లకు అందించే సేవలపై సమ్మె ప్రభావం పడే అవకాశం ఉందని ఎస్‌బీఐ పేర్కొంది.












Click it and Unblock the Notifications