వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్ సంక్షోభం: అమెరికా, రష్యా గొడవ పడితే, మధ్యలో ఇండియా ఇరుకున పడుతోందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రష్యా, యుక్రెయిన్ సంక్షోభం ప్రభావం భారత్ పై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది

గత శుక్రవారం దిల్లీలోని మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జర్మనీ నేవీ చీఫ్ అక్కడ ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఆయన తన స్వదేశానికి వెళ్లిన తరువాత రాజీనామాకు దారి తీసింది.

రష్యాను మనం కీలకమైన దేశంగా భావించాలని, చైనాను అడ్డుకోవడానికి ఇటు ఇండియాకు, అటు జర్మనీకీ రష్యా ఎంతో అవసరమని జర్మన్ నేవీ చీఫ్ అచెన్ సోన్బర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలనుబట్టి యుక్రెయిన్‌ సంక్షోభానికి, భారత్‌, రష్యాల సంబంధాలకు మధ్య ఉన్న లింక్‌ను అర్థం చేసుకోవచ్చు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ క్షణంలోనైనా యుక్రెయిన్‌‌పై దాడికి ఆదేశించవచ్చని చెబుతున్నారు. అమెరికా, యూకే, ఈయూ దేశాల నుంచి ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తున్నా, పుతిన్ వాటిని పట్టించుకోవడం లేదు.

ఒకవేళ పుతిన్ దాడికి ఆదేశిస్తే అది కేవలం యూరప్‌నే కాకుండా భారత్‌ను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఒకపక్క తమ దౌత్యవేత్తలు యుక్రెయిన్ నుంచి తిరిగి రావాలని అమెరికా కోరింది. పుతిన్ ఒకవేళ యుక్రెయిన్‌పై దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బ్రిటన్ అంటోంది. ఈయూ దేశాలు కూడా అలాంటి హెచ్చరికలు చేస్తున్నాయి.

ఇవన్నీ ఒకపక్క జరుగుతుండగానే, చైనాను అదుపులో ఉంచడానికి పశ్చిమ దేశాలకు రష్యా చాలా అవసరమని జర్మన్ నేవీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఇది చాలా కీలకమైంది.

యుక్రెయిన్‌ పై దాడి జరిగితే, రష్యాను ఏకాకిని చేయడానికి పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తాయని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే మాట చెప్పారు.

ఈ పరిస్థితుల్లో చైనా, రష్యా చేయికలిపితే ఏమవుతుంది ? చైనాకు, పాశ్చాత్య దేశాలతో ముఖ్యంగా అమెరికాతో వైరం కొనసాగుతోంది. దీంతో రష్యా పై పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి చైనా రష్యాకు మద్దతివ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యుక్రెయిన్ విషయంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చైనా చెబుతున్నప్పటికీ, అవసరమైన పక్షంలో పొరుగున ఉన్న రష్యాకు ఆ దేశం మద్ధతివ్వగలదని కూడా నిపుణులు భావిస్తున్నారు.

యుక్రెయిన్‌‌కు నాటో సభ్యత్వాన్ని ఇవ్వరాదన్న రష్యా వాదనను చైనా సమర్థిస్తోంది.

పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తే, ఆ ప్రభావం మిగతా ప్రపంచంపై తగ్గించడం చైనాకు మాత్రమే సాధ్యమని... అలాంటి పరిస్థితిలో, చైనా-రష్యా మరింత దగ్గరవుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది భారత్‌-రష్యా సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఇండియా ఆందోళన

స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI-సిప్రి) రిపోర్టు ప్రకారం, భారతదేశానికి 60 శాతం సైనిక సామగ్రి రష్యా నుంచి వస్తుంది. ఇది కీలకమైన అంశం.

యుక్రెయిన్ విషయానికొస్తే, తూర్పు లద్ధాఖ్‌లో భారత్-చైనా సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో రష్యాకు కోపం తెప్పించే ఛాన్స్‌ను భారతదేశం ఇవ్వకపోవచ్చు.

ఇటు, యూరప్, అమెరికాలు కూడా భారతదేశానికి ముఖ్యమైన భాగస్వాములే. ఇండియా-చైనా సరిహద్దుల పర్యవేక్షణలో భారత సైన్యం అమెరికా పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ సహాయం తీసుకుంటోంది.

సైనికులకు అవసరమైన శీతాకాలపు దుస్తులను అమెరికా, యూరప్‌ ల నుంచి భారత్ కొనుగోలు చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇండియా అటు రష్యాను గానీ, ఇటు పశ్చిమ దేశాలను గానీ వదులుకోలేదు. భారతదేశానికి ఇది యుక్రెయిన్-రష్యా సంక్షోభం తక్కువేమీ కాదు.

యుక్రెయిన్ సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని, ఇండియాకు సైనిక సరఫరాలను నిలిపేవేయాలని చైనా రష్యాపై ఒత్తిడి తెస్తే ఏం జరుగుతుంది?

"రష్యా యుక్రెయిన్‌పై దాడి చేస్తుందని నేను అనుకోను" అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఏషియా స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ రాజన్ కుమార్ చెప్పారు.

పుతిన్‌కి దాడి చేయడం అంత సులభం కాదంటారు రాజన్. ''రష్యా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఐరోపాకు గ్యాస్ సరఫరాపై ఆధారపడి ఉంది. దాడులు చేస్తే చైనాతో రష్యాకు సాన్నిహిత్యం పెరిగి భారత్‌కు మేలు జరగదు. రష్యా సైనిక సరఫరాలను ఆపకపోయినా, ఇండో-పసిఫిక్‌లో అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రభావితం అవుతుంది'' అన్నారు రాజన్.

పుతిన్, మోదీ, షి జిన్‌పింగ్

"పుతిన్ 2014లో క్రిమియాను రష్యాలో విలీనం చేసినప్పుడు, భారతదేశ స్పందన ఆసక్తికరంగా ఉంది. రెండు దేశాలను నొప్పించకుండా ఉండాలనేది భారత వైఖరి.

అందుకే విలీనం అనే మాటను భారత్ ఉపయోగించలేదు. ఈసారి కూడా రెండు దేశాల మధ్య ఇరుక్కోరాదని భారత్ భావిస్తోంది.

''కొన్నిసార్లు మనం కోరుకోక పోయినా సమస్యల్లో ఇరుక్కుంటాం. 1962లో క్యూబా క్షిపణి సంక్షోభం, భారత్‌పై చైనా దాడి రెండూ ఒకేసారి జరిగాయి. సోవియట్ యూనియన్‌కు చైనా మద్దతు అవసరం. అటువంటి పరిస్థితిలో, కష్టాలలో ఉన్న ఇండియాకు రష్యా మద్దతు ఇవ్వలేదు'' అని రాజన్ విశ్లేషించారు.

రష్యాకు మరోసారి చైనా అవసరం వస్తుందని, అలాంటి పరిస్థితుల్లో రష్యా తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో సంబంధాలను పట్టించుకోకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

''భారత్‌కు ఇది కష్టకాలం. రష్యా, చైనాలను ఏకకాలంలో మేనేజ్ చేయడం అమెరికాకు ఎంత కష్టమో అమెరికా, రష్యాల రెండింటినీ ఏకకాలంలో మేనేజ్ చేయడం ఇండియాకు కూడా కష్టమే'' అంటున్నారు రాజన్.

''పుతిన్‌తో సత్సంబంధాలు ఉండాలని యూరప్ కోరుకుంటోంది. కానీ, యూరప్‌లో రష్యాకు ఏదో ఒక భయం ఉండేలా చూడాలని అమెరికా కోరుకుంటోంది. అందుకే నాటో పాత్ర కీలకంగా మారింది'' అని రాజన్ వెల్లడించారు.

మన్మోహన్ సింగ్, వ్లాదిమిర్ పుతిన్

రష్యా వైపు భారత్ మొగ్గు

గల్ఫ్ యుద్ధం తరువాత, అమెరికా సైనిక జోక్యం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. వీటిలో 1990లలో బోస్నియా, కొసావో సంఘటనలు.. జోక్యాలు ఉన్నాయి. 1999లో సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌పై నాటో సేనలు బాంబు దాడి చేశాయి.

దీని ఆధారంగానే రష్యా ఇప్పుడు... నాటో కూటమి కేవలం ఆ గ్రూపు సభ్యుల భద్రత కోసమే కాకుండా దురాక్రమణ చర్యలకూ దిగుతోందని వాదిస్తోంది. బెల్‌గ్రేడ్‌ పై నాటో బాంబు దాడి చేసినప్పుడు, చైనా రాయబార కార్యాలయం కూడా ప్రభావితమైంది. దీనిని చైనా మరచిపోలేదు.

9/11 ఉగ్రవాద దాడుల తర్వాత, ఆర్టికల్ 5ని ఉపయోగించి నాటో అఫ్గానిస్తాన్‌‌పై దాడి చేసింది. కానీ, అమెరికా గత సంవత్సరం అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లింది. దాని మద్దతు ఉన్న అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా దేశం నుండి పారిపోయారు.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వైదొలిగిన, అమెరికా కాలుపెట్టిన దేశాలన్నీ బలహీనపడుతున్నాయనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు పుతిన్ ఇప్పటికే కజకిస్తాన్‌లో సైనిక జోక్యాన్ని విజయవంతంగా కొనసాగించారు. అందుకే, యుక్రెయిన్ విషయంలో భయాలు తీవ్రమవుతున్నాయి.

నవంబర్ 2020లో, క్రిమియాలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి ఉక్రెయిన్ ఐక్యరాజ్యసమితిలో ఒక తీర్మానాన్ని తీసుకువచ్చింది. భారతదేశం ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది . ఈ ప్రతిపాదనకు అమెరికా మద్దతుగా నిలిచింది.

అంటే, ఇక్కడ కూడా అమెరికాకన్నా రష్యాకే భారత్ మొగ్గు చూపింది.

2014 మార్చిలో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న శివశంకర్ మీనన్, "క్రిమియాలో రష్యాకు పూర్తిగా చట్టబద్ధమైన హక్కు ఉంది" అని వ్యాఖ్యానించారు. అంటే, అప్పట్లో భారత ప్రభుత్వం రష్యాలో క్రిమియా విలీనానికి మద్ధతిచ్చింది.

కానీ, అమెరికా సహా యూరప్ దేశాలు ఇప్పటికీ దీనిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నాయి.

''క్రిమియా విలీనం విషయంలో మా చర్యకు మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చైనాకు, అలాగే ఎంతో సంయమనంగా, నిష్పాక్షికంగా వ్యవహరించిన భారత్‌ను మేం అభినందిస్తున్నాం'' అని పుతిన్ అప్పట్లో వ్యాఖ్యానించారు.

పుతిన్, బైడెన్

భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య సైనిక ఘర్షణలు తలెత్తితే పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తాయి. అప్పుడు రష్యా యూరప్‌కు గ్యాస్ సరఫరాను తగ్గించగలదు. ఇది చమురు ధరలపై ప్రభావం చూపుతుంది.

యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతం రష్యా-యుక్రెయిన్ వివాదంలో అత్యంత కీలకమైంది. ఇది అతిపెద్ద గ్యాస్ రిజర్వ్. తాజాగా చైనాకు చమురు, గ్యాస్ అమ్మకం గురించి రష్యా ప్రకటనలు చేస్తోంది.

దీనివల్ల ప్రపంచ ఇంధన మార్కెట్ ప్రభావితం అవుతుంది. చమురు ధర పెరగవచ్చు. అది భారతదేశంపై కూడా ప్రభావం చూపుతుంది.

ఫిబ్రవరి 4 నుండి బీజింగ్‌‌లో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభ వేడుకలకు హాజరవుతున్నారు. ఈ పర్యటన సందర్భంగా పుతిన్-షీ జిన్‌పింగ్‌‌ల మధ్య భేటీ కూడా జరగనుంది.

డిసెంబర్‌లో, పుతిన్-షి జిన్‌పింగ్‌లు ఫోన్లో మాట్లాడుకున్నారు. యుక్రెయిన్ నాటోలో చేరకూడదన్న పుతిన్ వాదనకు చైనా అధ్యక్షుడు మద్ధతు పలికారు.

ప్రస్తుతం పాకిస్తాన్ కూడా రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ముగిసినప్పటి నుంచి పాకిస్తాన్ రష్యాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

యుక్రెయిన్ సంక్షోభం కారణంగా భారత్‌, రష్యాల మధ్య సంబంధాలు దెబ్బతింటే, వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది.

ఇటీవల, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు ఫోన్ చేసి పాకిస్తాన్ పర్యటనకు ఆహ్వానించారు. ఒకవేళ పుతిన్‌ పాకిస్తాన్ వెళితే అది ఆయన తొలి పర్యటన అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ukraine crisis: Will India suffer between Russia -US fight
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X