వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Uma Telugu Traveller: యూట్యూబ్ ఆదాయంతో ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఆంధ్రప్రదేశ్ యువకుడు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని చుట్టేయాలని కోరిక. అన్ని దేశాల్లో అడుగుపెట్టాలని ఆశ. కానీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. సాధారణ కూలీగా పనిచేసి, ఆ తర్వాత చెన్నైలో సెక్యూరిటీ గార్డుగా పని చేసినా ప్రపంచయాత్ర ఆలోచన మాత్రం మానలేదు ఈ ఆంధ్రప్రదేశ్‌ యువకుడు.

చివరకు పశ్చిమ ఆఫ్రికాలోని 'మాలీ’లో ఉపాధి కోసం వెళ్లిన సమయంలో వచ్చిన ఆలోచన ఆయన జీవితాన్ని మార్చేసింది. 'ఉమా తెలుగు ట్రావెలర్’ అంటూ కరోనా లాక్ డౌన్ సమయంలో మొదలైన ప్రస్థానం ప్రపంచయాత్ర కల నెరవేరేందుకు తోడ్పడుతోంది. ఇప్పటికే 22 దేశాల్లో తిరగడానికి మార్గం చూపింది.

తొమ్మిదో తరగతిలో చదువు ఆపేసిన ఉమా ప్రసాద్ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎలా చేరువయ్యాడన్నది ఆసక్తికర అంశం.

ర్థిక సమస్యల నుంచి..

సోషల్ మీడియా చాలామందిని రాత్రికి రాత్రి స్టార్స్ చేసినట్టే ఉమా కూడా యూట్యూబ్ వల్ల లక్షల మందికి చేరువయ్యారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించి రెండేళ్లు నిండకుండానే 7 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్స్‌ని సంపాదించారు.

అయితే ఉమా ఇప్పుడు తెలుగు ట్రావెలర్స్ లో చాలామందికి స్ఫూర్తిదాయకంగా కనిపిస్తున్నప్పటికీ, ఆయన జీవితం మాత్రం చాలా సామాన్యంగా మొదలైంది. సాదాసీదా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉమాప్రసాద్ ఆ తర్వాత కుటుంబ సమస్యలతో చాలా కష్టాలు పడ్డారు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు అనేక పనులు చేశారు.

కృష్ణా జిల్లా మొవ్వ మండలానికి చెందిన ఉమ కుటుంబం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని జంపని గ్రామంలో స్థిరపడింది. ఆ సమయంలో కుటుంబపరంగా ఆర్థిక కష్టాలు కారణంగా చదువు మానేయాల్సి వచ్చింది.

తొమ్మిదో తరగతి చదివి మానేసిన తర్వాత గ్రామంలోనే కొంతకాలం వ్యవసాయ కూలీ పనులకు వెళ్లారు. కానీ ఆ పనులకు తన శరీరం సహకరించకపోవడం వల్ల ఎక్కువ కాలం కొనసాగలేకపోయానని ఉమ బీబీసీకి తెలిపారు.

"కూలీ పనులు చేయడం నా వయసుకి కష్టమైంది. కొన్నాళ్లు ఓ షాపులో పనిచేశాను. విశాఖ వెళ్లాను. అక్కడి నుంచి చెన్నై వెళ్లి సెక్యూరిటీ గార్డుగా పనిచేశాను. నాలుగేళ్లు అక్కడే ఉన్నాను. కొంత డబ్బులు సంపాదించుకుని ప్రపంచమంతా తిరగాలన్నది నా లక్ష్యం. సెక్యూరిటీగా పనిచేస్తున్నప్పటికీ నిత్యం ఇదే ఆలోచనతో ఉండేవాడిని. ఈలోగా ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి పరీక్షలు రాసే అవకాశం రావడంతో వాటిని పూర్తి చేశాను. పదో తరగతి మాత్రమే చదివినప్పటికీ ఎక్కడా అది సమస్య అనిపించలేదు" అంటున్నారాయన.

తల్లి ప్రోత్సాహమే.

ఉమాప్రసాద్ తల్లి మల్లేశ్వరి తన కుమారుడికి వస్తున్న ఆదరణ చూసి సంతోషిస్తున్నారు. అయితే ఆమె ప్రోత్సాహమే తనను ట్రావెలర్ గా మార్చేసిందన్నది ఉమ మాట. చిన్నతనంలో ఊళ్లు తిప్పుతూ, కొన్ని అడ్వెంచర్ చానళ్లు చూపించడం వల్ల తనకు ఇలా తిరగడంపై ఆసక్తి ఏర్పడిందని చెబుతున్నారు.

"చిన్నప్పటి నుంచి ఆ ఊరు, ఈ ఊరు అంటూ తిప్పేవారు. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్ళేవారు. ఇంట్లో ఉంటే ప్రపంచంలో వింతలు, విశేషాల గురించి టీవీ చానళ్ళు చూపించేవారు. దాంతో వాటిని చూడాలనే ఆశ పుట్టింది. మొదట ఇండియా నుంచి నేపాల్ వెళ్లి అక్కడి నుంచి ఆస్ట్రేలియా వరకూ వెళ్లి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కానీ అది ముందుకు సాగలేదు. అయినా ఆ యాత్ర నాకు స్ఫూర్తి నింపింది. నేపాల్‌లో నేర్చుకున్న పాఠాలతో ఇప్పుడు వివిధ దేశాల యాత్రలకు అవకాశం వచ్చింది" అని ఉమాప్రసాద్ బీబీసీతో అన్నారు.

ఉమా ప్రసాద్ తల్లి మల్లేశ్వరి

తొలి యాత్రలో వెనక్కే..

ఉమా ప్రసాద్ మొదటి యాత్ర అనుకున్నట్టుగా సాగలేదు. తెనాలి నుంచి నేపాల్ వరకూ కేవలం తను సంపాదించిన డబ్బులతో ఈ యాత్ర ప్రారంభించారు. నిజానికి తనకు వచ్చిన నెల ఆదాయంలో కొంత భాగం ఇంటి అవసరాలకు పోగా మిగలిన లక్షన్నర రూపాయలు దాచుకుని ఈ యాత్రకు బయలుదేరినట్టు ఉమా తెలిపారు.

''దారిలో వాహనదారులను లిఫ్ట్‌ అడుగుతూ వెళ్లిపోవడమే నా లక్ష్యం. టికెట్లు తీసుకుని, అన్నీ చేయడం కుదరదు కాబట్టి లిఫ్ట్ అడుగుతూ వెళ్లిపోవాలనే లక్ష్యంతో మొదలయ్యాను. నేపాల్ వెళ్లిన తర్వాత జర్మనీకి చెందిన ఇద్దరు ట్రావెలర్లు పరిచయమయ్యారు. భార్యాభర్తలయిన వారి సలహా నా లక్ష్యాన్ని మలుపు తిప్పింది. లక్ష రూపాయలతో ప్రపంచ యాత్ర లక్ష్యం సరికాదని వారు నాకు హితబోధ చేశారు. మరింత డబ్బులు సంపాదించి, అప్పుడు యాత్రకు సిద్ధమైతే మంచిదంటూ వారు చేసిన సూచన నాకు చాలా ఉపయోగపడింది. వారి గైడెన్స్ తోనే వెనక్కి వచ్చి ఏదో పని చేయడానికి మాలీ వెళ్లేందుకు సిద్ధమయ్యాను" అని ఉమాప్రసాద్‌ వివరించారు.

లాక్ డౌన్ లో చానెల్ ప్రారంభం

బంధువుల ద్వారా మాలీలోని ఓ కంపెనీలో పనికోసం వెళ్లిన తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 మార్చి నెలలో అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందని ఉమ తెలిపారు. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోని తనకు ఇండియా వెళ్లి యూట్యూబ్ చానల్ పెట్టాలని ఆలోచన వచ్చిందన్నారు.

మిత్రుడి సలహాతో అక్కడే లాక్ డౌన్‌లో ఆ దేశానికి సంబంధించిన వీడియోలు చేసేందుకు సిద్ధపడితే యూట్యూబ్‌లో మంచి రెస్సాన్స్ వచ్చిందని, ఇది తన కల నిజం చేసుకునేందుకు ఉపయోగపడిందని వివరించారు.

''2020 మే నెలలో మొదటి వీడియో ఆప్ లోడ్ చేశా. కానీ కొన్ని వీడియోల తర్వాత సడెన్‌గా అక్కడి లోకల్ స్ట్రీట్ ఫుడ్ వీడియో బాగా వైరల్ అయ్యింది. వ్యూస్, సబ్ స్క్రైబర్స్ పెరిగారు. కేవలం ఒక్క మొబైల్ , సెల్ఫీ స్టిక్ కొని ఆ వీడియోలు చేశాను. వాటినే జనం మెచ్చుకోవడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. నా లక్ష్యం నెరవేరుతుందనే ఆనందం కలిగించింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఇండియా వచ్చాను. కొంత గ్యాప్ తీసుకుని, ఈలోగా యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ కావడంతో ఆదాయం వచ్చింది. అక్కడి నుంచి ఆఫ్రికా, ఆ తర్వాత వరుసగా పది దేశాలు తిరిగాను. లోకల్ తెలుగు కుటుంబాలు సహకరించాయి. స్థానికులు తోడ్పాటునిచ్చారు. వీడియాలకు బాగా వ్యూస్ వచ్చాయి" అన్నారు ఉమాప్రసాద్‌.

ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పర్యటించారు. యూరప్ దేశాలలో కూడా కొన్ని యాత్రలు చేశారు. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు. ఆసియా దేశాలను చుట్టివచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు. వీలయినంత త్వరలో తన లక్ష్యం ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి రావడం, ఆయా దేశాల విశేషాలను తెలుగు ప్రేక్షకులకు అందించడమేనని ఉమ చెబుతున్నారు.

'ఉమ తెలుగు ట్రావెలర్’ పేరుతో ఆయన చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందించడం, ప్రోత్సహించడం వల్లనే ఇదంతా సాధ్యమవుతుందని ఆయన తల్లి మల్లేశ్వరి అంటున్నారు. తమ బిడ్డను ఆదరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

'స్థానికులతో స్నేహంగా ఉండాలి..'

తెలుగులో ప్రస్తుతం యూట్యూబర్లు, ట్రావెలర్లు పెరుగుతున్నారు. చాలామంది ఔత్సాహికులు వీడియోలు చేసేందుకు పోటీ పడుతున్నారు.. అందులో కొందరే ఆదరణ పొందుతున్నారు. అయితే వివిధ దేశాల్లో యాత్ర చేయాలనుకునే ముందు అన్ని రకాలుగానూ సన్నద్ధం కావాలని ఉమ సూచిస్తున్నారు.

''ఎక్కడికెళ్లినా నేను ఆ దేశ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తాను. వారితో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తాను. అది ఎక్కువగా ఉపయోగపడుతుంది" అన్నారాయన.

కొంతమంది ఎన్నారైలు సహకరిస్తున్నారని ఉమ తెలిపారు. కొత్తగా యాత్రలు ప్రారంభించే యూట్యూబర్లు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వారితో స్నేహంగా ఉండటం వల్ల మరింత ప్రయోజనం పొందవచ్చని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uma Telugu Traveler: AP youngster traveling around the world with YouTube income
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X