అంపైర్ నో బాల్ అన్నందుకు చెల్లెలిపై క్రికెటర్ ప్రతీకారం
అలీగర్: అంపైర్ నో బాల్ అన్నందుకు అతని సోదరి పైన కక్ష తీర్చుకున్న షాకింగ్ సంఘటన అలీగర్‌లో చోటు చేసుకుంది. అలీగఢ్‌కు ఇరవై కిలోమీటర్ల దూరంలో జరారా అనే చిన్న పట్టణం ఉంది. స్థానికులంతా కలిసి జరారా ప్రీమియర్ లీగ్ (జేపీఎల్)ను ఏర్పాటు చేశారు.
ఈ నెల 14 నుంచి 30 వరకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. గెలిచిన జట్టుకు రూ.5,100 బహుమతి ప్రకటించారు. ఈ నెల 28న జరారా, బరికి జట్ల మధ్య జరిగిన పోరు మాత్రం విషాదానికి దారి తీసింది. అంపైర్ రాజ్ కుమార్ జీవితంలో పెను విషాదానికి కారణమైంది.
అంపైర్ రాజ్ కుమార్ ఓ బాల్‌ను నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో క్రికెటర్ సందీప్ పాల్ కోపంతో రెచ్చిపోయాడు. అంపైర్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. నో బాల్ కాదని చెప్పమన్నాడు. కానీ రాజ్ కుమార్ వినలేదు. దీంతో సందీప్ హెచ్చరిస్తూ నీ కుటుంబంలో ఒకరి అంతు చూస్తానని చెప్పాడు.

ఈ నెల 29న అంపైర్ రాజ్ కుమార్ చెల్లి పూజ (15), మరో ముగ్గురు స్నేహితురాళ్ళు పొలానికి వెళ్తూండగా క్రికెటర్ సందీప్ కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. వాటిని తాగిన పూజ మృతి చెందింది. మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సందీప్‌ను పూజకు, ఆమె స్నేహితురాళ్ళకు బాగా తెలుసు. అందుకే నమ్మకంగా కూల్ డ్రింక్స్ తాగారు. జేపీఎల్ ఖెయిర్ క్రికెట్ కమిటీ అధ్యక్షుడు బాబీ ఖాన్ మాట్లాడుతూ.. గ్రామ పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ, వారందర్నీ ఒప్పించి ఈ టోర్నమెంటును నిర్వహించామని, చివరకు ఇలా జరిగిందన్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications