Union Budget 2022: నిర్మలమ్మా ఏందీ రచ్చ..! బాబోయ్ 200 టీవీ ఛానెళ్లకు లక్ష రూపాయలా..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో ప్రధాన మంత్రి ఈ-విద్య పథకం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఈ -విద్య పథకం కోసం 200 టీవీ ఛానెళ్లను ఏర్పాటు చేస్తామంటూ నిర్మలమ్మ బడ్జెట్ 2022లో ప్రతిపాదించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. నిర్మలమ్మ ప్రకటన బాగానే ఉన్నా ఈ 200 టీవీ ఛానెళ్ల ఏర్పాటుకు కేటాయింపులు కేవలం లక్ష రూపాయలే చేయడం వీరిని ఆందోళనకు గురిచేస్తోంది.
నిర్మలమ్మ బడ్జెట్‌లో కొన్ని తప్పులు దొర్లినట్లు కనిపిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ప్రధానమంత్రి ఈ-విద్యా పథకం కింద 200 టీవీ ఛానెళ్లు ఏర్పాటు చేస్తామని చెబుతూ కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయింపులు చేయడం. ఈ గందరగోళంతో విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఎక్స్‌పెండిచర్ డిపార్ట్‌మెంట్ తలుపులు తట్టేందుకు సిద్ధమవుతోంది. అంకెల్లో తప్పులు దొర్లాయా అనేదానిపై క్లారిటీ తీసుకోనుంది. ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్స్ ప్రస్తుతం 12 ఉన్నాయి. వీటిని 200కు పెంచాలంటే అందుకు నిధులు బాగానే ఖర్చవుతాయి. కేవలం లక్ష రూపాయలు కేటాయింపులను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు త్వరలో ఆర్థికశాఖతో జరగనున్న సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి క్లారిటీ తీసుకోనున్నారు.

డిజిటల్/ఆన్‌లైన్/ఆన్ ఎయిర్ ద్వారా విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ప్రధానమంత్రి ఈ-విద్యా పథకంను తీసుకొస్తుంది. ఈ పథకంతో ఇటు టీచర్లు అటు విద్యార్థులకు విద్య డిజిటల్ రూపంలో అందుతుందని బడ్జెట్ డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. అయితే ఈ తప్పును సరిచేసుకుని నిధులు సరిగ్గా ఇవ్వాలంటే కేబినెట్ నోట్ మరో ప్రత్యామ్నాయ మార్గం అని మరో అధికారి తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఈ-విద్యా పథకంపై కీలక ప్రకటన చేశారు. కరోనా మహమ్మారితో విద్యార్థులు చాలా నష్టపోయారని తెలిపిన మంత్రి... విద్యను విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించేందుకు ఈ పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతీయ భాషల్లో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు సప్లిమెంటరీ విద్యను అందించేందుకు కేంద్రం ముందుకొస్తోందని చెప్పారు. ఈ ప్రకటనను చట్టసభల్లోని సభ్యులంతా ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications