పదేళ్ల జైలు, రూ. 10 కోట్ల జరిమానా: ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విద్యా రంగ పరీక్షల పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను వేగవంతం చేసింది. ఈ సున్నిత సమస్యను పరిష్కరించేందుకు రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపేలా కఠినమైన చట్టాలను తీసుకువస్తూనే, మరోవైపు వీధుల్లో ఆందోళనలు చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతినిధులతో నేరుగా చర్చల ప్రక్రియను ప్రారంభించింది.
ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు సవరణలకు కీలక ఆమోదం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్ లో వరుస సమావేశాలు జరిగాయి. భద్రతా వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అనంతరం కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024ను మరింత కఠినతరం చేసే ప్రతిపాదనలపై నిశితంగా చర్చించింది. అనంతరం దీన్ని యధాతథంగా ఆమోదించింది కేంద్ర కేబినెట్. ఈ చట్టంలో అనేక సవరణలు చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలలో ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. దీనికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు చేపట్టింది కూడా.
ప్రతిపాదిత నూతన నిబంధనలు, సవరణల ప్రకారం.. పేపర్ లీకేజీలకు పాల్పడే నేరగాళ్లపై తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. ఈ కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి పూర్తి చట్టపరమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు.. మూడు నెలల పరిమిత వ్యవధిలోనే దర్యాప్తు పూర్తి చేసి త్వరితగతిన తీర్పులను వెలువరించేలా ప్రత్యేక అధికారాలను కల్పిస్తారు.
ఇటువంటి తీవ్రమైన అక్రమాలకు పాల్పడే నిందితులకు గరిష్ఠంగా పదేళ్ల కఠిన జైలు శిక్ష పడుతంది. దీంతో పాటు 10 కోట్ల రూపాయల వరకు భారీ జరిమానా విధించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటన్నింటినీ కూడా కేంద్ర కేబినెట్ యధాతథంగా ఆమోదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవంక.. నిరసనలు చేస్తోన్న విద్యార్థులతో ప్రభుత్వం చర్చల ద్వారా సామరస్య మార్గాలను వెదుకుతోంది. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా దీనికి వేదికైంది. కేంద్ర మంత్రుల కార్యాలయాల్లో భేటీలకు నిరాకరించిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, తటస్థ వేదికపైనే చర్చ జరగాలని పట్టుబట్టారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షల నిర్వహణ లోపాలపై స్పష్టమైన జవాబుదారీతనం ఉండాలని, విద్యార్థులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవాలనేది వారి ప్రధాన డిమాండ్.














Click it and Unblock the Notifications