అక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యవసరం: మేనిఫెస్టోకు సర్వం సిద్ధం
లక్నో: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎల్లుండి తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఉత్తర ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది.
Recommended Video
ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోకూడదని భావిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో మెజారిటీ తగ్గితే.. దాని ప్రభావం 2024 నాటి లోక్‌సభ ఎన్నికలపై పడుతుందనే ఆందోళన బీజేపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 80 లోక్‌సభ స్థానాలను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్‌పై రాజకీయంగా పట్టు కోల్పోతే- 2024 నాటి ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం ఖాయమనే భావన నెలకొంది.
ఇవ్వాళ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. లక్నోలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లోక కల్యాణ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

నిజానికి- మేనిఫెస్టోను ఆదివారమే విడుదల చేయడానికి బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ.. సాధ్యం కాలేదు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ కన్నుమూయడంతో.. ఆమెకు నివాళిగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. ఇవ్వాళ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. జాతీయవాదం, ఉత్తర ప్రదేశ్ సమగ్రాభివృద్ధి, సుపరిపాలన, అయోధ్య, వారణాశి, మథురను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 408 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి 312 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అదే గెలుపును పునరావృతం చేయాలనే సంకల్పంతో ఉన్నారు కమలనాథులు. దీనికి అనుగుణంగానే ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు చెబుతున్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications