కేంద్రమంత్రి, ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత: ప్రధాని సహా నేతల దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఆయన మృతిని ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. మిస్ యూ పాప్పా అంటూ ట్వీట్ చేశారు.

దేశంలోనే ప్రముఖ దళిత నేత
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న పాశ్వాన్ ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయనకు గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది. అనారోగ్యం నుంచి కోలుకునేలోపే హఠాత్తుగా మరణించారు. దేశంలోని ప్రముఖ దళిత నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రాంవిలాస్ పాశ్వాన్.. ఐదు దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. పాశ్వాన్ మృతి పట్ల ప్రముఖులు సంతాపాలు వ్యక్తం చేశారు.

అణగారిన వర్గాల గొంతుక
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయిందని, పార్లమెంటులో అత్యంత చురుకైన, ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన ఒకరని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గుర్తుచేశారు. అణగారిన వర్గాలకు గొంతుకలా పనిచేసిన పాశ్వాన్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నట్లు రాష్టపతి ప్రకటన చేశారు.

మంచి స్నేహితుణ్ని కోల్పోయా
‘‘రామ్‌విలాస్ పాశ్వాన్ ఇక లేరన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. పాశ్వాన్ మృతితో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయా. ఆయన పేదల కోసం అహర్నిశలు శ్రమించారు. తను లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన మరణం వ్యక్తిగతంగానూ నాకు లోటుగా భావిస్తున్నాను. అనునిత్యం పేదల కోసమే ఆలోచించే వ్యక్తి పాశ్వాన్'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

బీహారీలు అందరూ బాధలో ఉన్నారు..
రామ్ విలాస్ పాశ్వాన్ అకాలమరణం బాధాకరమని, పేదలు, అణగారిన వర్గాలు ఒక బలమైన గొంతుకను కోల్పోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆర్జేడీ నేత రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. పాశ్వాన్ మరణంతో బీహార్ పెద్ద దిక్కును కోల్పోయినట్లయిందని, బీహారీలు అందరూ ప్రస్తుతం బాధలో మునిగిపోయారని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానం పాశ్వాన్ తోనే మొదలైందని, కీలకమైన సమయంలో చిరాగ్ పాశ్వాన్ ఒంటరి కావడం బాధగా ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.

2000సంవత్సరంలో ఎల్జేపీ స్థాపన..
పాశ్వాన్ ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగున్నారు. మొత్తం ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1946 జూలై 5న బిహార్‌లో జన్మించిన పాశ్వాన్.. 2000లో లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
Union Minister and LJP leader Ram Vilas Paswan passes away, tweets his son Chirag Paswan. pic.twitter.com/YQi5oNHz8Q
— ANI (@ANI) October 8, 2020