ఓ వైపు యుద్ధం.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఓవైపు ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కుంటుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు కొరత రాకుండా పలు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చమురు శుద్ధి సంస్థలపై ప్రభుత్వం నిత్యావసర సరకుల చట్టం- 1955 ను ప్రయోగించింది. అలాగే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుండి 25 రోజులకు పెంచింది. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ విక్రయాను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ.8.80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు.
'జల్ జీవన్ మిషన్ 2.0'ను 2028 డిసెంబర్ వరకు పొడిగించారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 8.7 లక్షల కోట్లను కేటాయించింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 81 శాతం గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు అందాయి. రెండో దశలో భాగంగా మిగిలిన ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం.. అలాగే మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారించనున్నారు.
అలాగే తమిళనాడులోని మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మీనాక్షి అమ్మన్ ఆలయం, రామేశ్వరం పుణ్యక్షేత్రాలకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని కేంద్రం భావించింది. దాంతోపాటు రైల్వేలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

రూ. 4,474 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక మధ్యప్రదేశ్ లో కొత్తగా 4 లేన్ కారిడార్ నిర్మాణానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవే కాకుండా ఎన్నికల నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పీఎం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications