విపక్షాల కూటమి పేరు INDIA ? ఆ పేరుకు అర్ధం ఇదే...
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు బెంగళూరులో సమావేశమైన 26 విపక్ష పార్టీలు.. వరుసగా రెండోరోజు సుదీర్ఘంగా చర్చిస్తున్నాయి. ఈ చర్చల్లో పలు కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే విపక్ష కూటమికి కొత్త పేరు పెట్టుకోవాలని నిర్ణయించిన విపక్షాలు ఆ మేరకు దానిపై కీలక చర్చలు జరుపుతున్నాయి. ఇందులో ఓ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
విపక్ష కూటమికి INDIA అనే పేరును ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలు దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో ఇంగ్లీష్ అక్షరాల్లో INDIA అంటే ఇండియన్ నేషనల్ డెమోక్రాటిక్ ఇంక్ల్యూజివ్ అలయన్స్ గా నిర్ణయించారు. అంటే భారత జాతీయ ప్రజాస్వామ్య సమీకృత కూటమి అనే అర్ధం వచ్చేలా ఈ పేరు నిర్ణయించారు. ఈ పేరును సాయంత్రం సమావేశం చివర్లో ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ NDA) ఉంది. అలాగే గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పనిచేసిన కూటమికి యూపీఏ( యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లేదా ఐక్య ప్రగతిశీల కూటమి) అనే పేరు ఉండేది. ఇప్పుడు విపక్షం కూడా ఎన్డీయే పేరులోని జాతీయ, ప్రజాస్వామ్య పదాల్ని తీసుకుని తమ కొత్త కూటమి పేరు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మాజీ యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీని ఫ్రంట్ అధ్యక్షురాలిగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కన్వీనర్‌గా నియమించనున్నారు. సోనియా గాంధీ 2004 నుండి 2014 వరకు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అలాగే ఈ ఫ్రంట్ కు అదనంగా రెండు సబ్‌కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఒకటి ఉమ్మడి కనీస కార్యక్రమం, కమ్యూనికేషన్ పాయింట్‌లను ఖరారు చేయడానికి అలాగే మరొకటి ఉమ్మడి ప్రతిపక్ష కార్యక్రమాలు, ర్యాలీలు , సమావేశాలను ప్లాన్ చేయడానికి ఉంటుంది.












Click it and Unblock the Notifications