వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి మిత్ర కష్టాలు: వారసుల కోసం సీనియర్ల పోరు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి మిత్రుల నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో సీనియర్లు తమ వారసుల కోసం పట్టు పడుతున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో/న్యూఢిల్లీ: ఆరునూరైనా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలన్నలక్ష్యంతో ఉన్న బిజెపికి మిత్రపక్షాల నుంచి తలనొప్పులు ఎదురవుతున్నాయి. బిజెపి ప్రత్యర్థిగా అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ని ఎదుర్కొనేందుకు ముందుకు సాగుతున్న కమలనాథులకు మిత్రులతోపాటు పార్టీలోని సీనియర్లు తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.

మరోవైపు అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు కోసం అఖిలేశ్ చకచకా పావులు కదుపుతున్న నేపథ్యంలో బిజెపి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో జాబితా ప్రకటించకుండా వెనుకకు తగ్గింది. సహజ సిద్ధంగా అగ్రవర్ణాల మద్దతు కలిగి ఉన్న బిజెపి.. యాదవేతర ఓబీసీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న పార్టీ నేతల నుంచి అసమ్మతి వ్యక్తమవుతున్నది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని మిత్ర పక్షాలు సైతం ఆశగా ఎదురుచూస్తున్నాయి. అప్నాదళ్ నేత, కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ సారథ్యంలోని యూపీలోని భాగస్వామ్య పక్షాల్లో ఒక్కటి. ఆ పార్టీ నేతలతో పలు దఫాలు సీట్ల సర్దుబాటుపై పలు దఫాలు బిజెపి ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జి ఒపి మాథూర్ చర్చించినా ఫలితం కానరాలేదు.

UP elections: BJP allies demand more seats, party searching for winning formula

యాదవేతర ఓబీసీలను అక్కున చర్చుకునే యత్నం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో ఓబీసీ సామాజిక వర్గాలైన కుర్మీలు, రాజ్ భర్‌ల్లో పునాది కలిగి ఉన్నాయి. అందకు అనుగుణంగా కుర్మీలు, కుశ్వాహ సామాజిక వర్గాలకు చేరదీసేందుకు బిజెపి అగ్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నది. కుర్మీ సామాజిక వర్గానికి చెందిన అప్పాదళ్ పార్టీ నాయకురాలు అనుప్రియా పటేల్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించింది బిజెపి, కుశ్వాహ సామాజిక వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్యను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బరిలోకి దించింది. వీరిద్దరితోపాటు కేంద్రమంత్రి ఉమా భారతి తదితరుల సారథ్యంలో రెండు నియోజకవర్గాలకొకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 200 ఓబీసీ సదస్సులు నిర్వహించింది.

మిత్రపక్షాల కట్టడికి వ్యూహం

పార్టీ పరంగా ఈస్ట్రన్ రీజియన్‌లో బలహీనంగా ఉన్న కమలనాథులు తమ మిత్రపక్ష పార్టీల దన్నుతో ఓబీసీలను కలుపుకుని వెళ్లి బలోపేతం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ప్రాంతం సమాజ్ వాదీ పార్టీకి పెట్టని కోట. 'మిత్ర పక్షాలకు మేం 20 - 25 సీట్లు ఇవ్వడానికి సిద్ధం. కానీ వారి డిమాండ్ మా అంచనాలకు అందనంత ఎక్కువగా ఉంది' అని చర్చల్లో పాల్గొన్న బిజెపి నేత ఒకరు చెప్పారు.

మీర్జాపూర్ నుంచి లోక్ సభా స్థానానికి ప్రతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి అనుప్రియా పాటిల్ ప్రారంభంలో అప్నాదళ్‌లోని తన గ్రూపుకు 50 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసినా తర్వాత వెనుకకు తగ్గి 30 స్థానాలకు పరిమితం అయ్యారు. పార్టీలో మరో గ్రూపునకు నాయకురాలైన ఆమె తల్లి క్రిష్ణా పటేల్ కూడా యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.

అమిత్ షా, రాంగోపాల్ యాదవ్ లతో రాజ్ భర్ చర్చలు

రాజ్ భర్ కూడా తన పార్టీకి కనీసం 25 సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన ఈ సంగతి తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన రాంగోపాల్ యాదవ్‌తో రాజ్ భర్ భేటీ కావడంతో కమలనాథుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. సీట్లు, ఆయా స్థానాల కేటాయింపు, ఇతర సమస్యలపై రాజ్ భర్‌తో బిజెపి యూపీ ఇన్ చార్జి ఓం మాథూర్ రహస్యంగా సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. రాజ్‌భర్‌కు సుమారు 20 స్థానాల లోపు మాత్రమే ఇవ్వగలమని బిజెపి తేల్చి చెప్పింది. కానీ ఈ ప్రతిపాదనకు ఆయన తిరస్కరించినట్లు తెలుస్తున్నది.

బీహార్‌లో మాదిరిగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్ష పార్టీలకు పరిమితులు విధించాలని బిజెపి తలపోస్తున్నది. అందులో భాగంగా గణనీయ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న భాగస్వామ్య పక్షాల కట్టడికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. బీహార్‌లో 243 స్థానాలకు 157 స్థానాల్లో బిజెపి, 86 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేసిన సంగతి తెలిసిందే. అయితే బీహార్ లో మాదిరిగా మూల్యం చెల్లించుకునేందుకు బిజెపి సిద్ధంగా లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు స్పష్టంచేశారు.

ఫిరాయింపుదారులు, బయటి వ్యక్తులపై అసమ్మతి దెబ్బ

ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి టిక్కెట్లు కేటాయించడంపై బిజెపి నాయకత్వం తీరుపట్ల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల పార్టీ నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. తొలి జాబితాలో పలువురు బయటి వ్యక్తులు, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారికి మాత్రమే చోటు దక్కడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తుతున్నది. సుమారు 24 స్థానాలకు పైగా తొలి జాబితాలో చోటు దక్కించుకోవడం వారి ఆగ్రహ జ్వాలకు కారణంగా కనిపిస్తున్నది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నివాసం వద్ద టిక్కెట్ లభించని నేతల మద్దతు దారులు నిరసన తెలిపారు.

గవర్నర్ మనుమడు.. కేంద్రమంత్రి కొడుకుకు సీటుపై శ్రేణుల మంటలు

ఇక ఎతా ఎంపి రాజ్ బీర్ సింగ్ కు చోటు కల్పించడంతో ఆగ్రహించిన పార్టీ మద్దతుదారులు ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధంచేశారు. రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ కొడుకు రాజ్ భీర్ కొడుకు కావడం గమనార్హం. ఇదే పరిస్థితి బరేలీలో కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్ మద్దతుదారులపై ఆయన వ్యతిరేకులు నిప్పులు కక్కుతున్నారు. నవాబ్ జంగ్ స్థానాన్ని బిఎస్పీ మాజీ నేత కేసర్ సింగ్ కు ఇస్తే పార్టీకి రాజీనామాచేస్తామని కొందరు ఆఫీస్ బేరర్లు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తున్నది.

ఉత్తరాఖండ్‌లో ఎమ్మెల్యేలకే మొండిచేయి

ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 64 స్థానాలకు 15 మంది అభ్యర్థులు కొత్త వారే కావడం గమనార్హం. పార్టీలోని సీనియర్లు, వారి బంధువులు నిరాశకు గురయ్యారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ల కేటాయింపు పట్ల పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రత్యేకించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విజయ్ బార్థ్ వాల్, సిట్టింగ్ ఎమ్మెల్యే టీఎస్ రావత్‌లకూ బిజెపి నాయకత్వం మొండిచేయి చూపడంతో వారి మద్దతుదారులు రగిలిపోతున్నారు. బార్థ్ వాల్ కు యాంకేశ్వర్ స్థానం నుంచి టిక్కెట్ నిరాకరిస్తూ మాజీ సిఎం బిసి ఖండూరి కూతురు రితూ ఖండూరి భూషణ్‌కు, టిఎస్ రావత్‌కు బదులు ప్రస్తుత సిఎం హరీశ్ రావత్ కు వ్యతిరేకంగా తొలుత తిరుగుబాటుచేసిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్పాల్ మహారాజ్‌కు బిజెపి నాయకత్వం టిక్కెట్లు కేటాయించింది.

పంజాబ్ బిజెపి అధ్యక్షుడు సంప్లా రాజీనామా?

ఇక పంజాబ్ రాష్ట్రంలో సీట్ల కేటాయింపు పట్ల ఆ రాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షుడు విజయ్ సంప్లా తీవ్ర దిగ్ర్భాంతికి గురైనట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం తీరుపై నిరసన తెలియజేస్తే పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చినా సంప్లా తోసిపుచ్చారు. టిక్కెట్లు లభించని వారంతా పార్టీ అభ్యర్థులపై స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ బిజెపి నాయకత్వం తమ పార్టీలో అసమ్మతిని తక్కువచేసి చూపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్లే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది సిద్ధమవుతున్నారని బిజెపి ఆఫీస్ బేరర్ ఒకరు చెప్పారు. ఒకసారి తాము అధికారంలోకి వస్తే ఈ అసమ్మతి అంతా తగ్గిపోతుందని, అందరూ సర్దుకుంటారని ఆయన అన్నారు.

ఫక్కడ్ బాబా అవిశ్రాంత పోరు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టువదలని విక్రమార్కుడు ఉన్నారు. ఇప్పటివరకు ఎనిమిది సార్లు లోక్ సభకు, ఏడుసార్లు అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలయ్యారాయన. ఆయన పేరు ఫక్కడ్ బాబా. మథుర నుంచి 16వ సారి పోటీచేశారు. ఈ మేరకు కలెక్టరేట్ లోని మథుర అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. జగన్నాథ్ పూరి శంకరాచార్య వారసుడైన ఫక్కడ్ బాబా తన గురువు మార్గదర్శకాల మేరకే తాను పోటీచేస్తున్నానని తెలిపారు. కాన్పూర్ జిల్లా బిథూర్ వాసి అయిన ఫక్కడ్ బాబా తన గురువు ఆశీస్సుల ప్రకారం 20వ సారి విజయం సాధిస్తానన్నారు. తొలుత 1977లో పోటీ చేశారు. 1991లో ప్రస్తుత ఎంపి సాక్షి మహారాజ్ పై మెరుగైన ఓట్లు పొందానన్నారు. గోవధపై పూర్తి నిషేధం అమలు చేసే వరకూ పోటీచేస్తానన్నాడు. తాను గెలుపొందితే విద్యావిధానం ప్రవేటీకరించకుండా కాపాడుతానని పేర్కొన్నారు.

English summary
The BJP’s second list of candidates for Uttar Pradesh assembly election is stuck following a tug of war between allies, turncoats throwing tantrums and a lack of consensus on seats sought by veterans for their children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X