చిన్నారులు కాదు, చిచ్చర పిడుగులు..! హక్కుల కోసం రోడ్డెక్కిన బడి పిల్లలు
దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ తీరుపై ఇటీవలే యూత్ పెద్ద ఎత్తున గళమెత్తిన సంగతి తెలిసిందే. ఆ సెగ తగ్గకముందే, ఇప్పుడు ఇంకా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న జెన్ ఆల్ఫా రంగంలోకి దిగింది. తమ బడిలో కనీస వసతులు కల్పించాలంటూ ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాల పిల్లలు చేసిన నిరసన ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిచ్చరపిడుగుల పట్టుదల ముందు అధికారులు దిగిరాక తప్పలేదు.
మౌలిక వసతుల కోసం సమరభేరి
ఫతేపూర్ జిల్లా కిషన్‌పూర్ పరిధిలోని సర్వోదయ ఇంటర్ కాలేజ్ ప్రాంగణంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బడిలో కనీసం తాగేందుకు మంచినీళ్లు, వెలుతురు, నిలకడైన విద్యుత్ సరఫరా, తరగతి గదుల్లో గాలి ఆడటానికి ఫ్యాన్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి వేడుకున్నా పాఠశాల యజమాన్యం పట్టించుకోకపోవడంతో, చిన్న పిల్లలంతా ఒక్కటై బడి ముందే ధర్నాకు దిగారు.

అంబేడ్కర్ చేతబట్టి హోరెత్తించిన నినాదాలు
చేతుల్లో ప్లకార్డులు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటాలను పట్టుకుని వందలాది మంది పాఠశాల పిల్లలు పాఠశాల గేటు ముందు ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ చిన్నారులు చేసిన నినాదాలు ఆ ప్రాంతమంతా హోరెత్తాయి. తమకు చదువుకోవడానికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిందేనని, అంతవరకు కదిలేది లేదని తెగేసి చెప్పారు. చిన్న పిల్లలు అంతటి సమష్టి క్రమశిక్షణతో పోరాడటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.
దిగివచ్చిన అధికారులు.. లిఖితపూర్వక హామీ
పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. చిన్నారుల పట్టుదల, వారి సమస్యల్లోని న్యాయాన్ని గ్రహించిన పరిపాలనా యంత్రాంగం వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థులు కోరిన విధంగా తాగునీరు, విద్యుత్, మెరుగైన మౌలిక వసతులను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు చిన్నారులకు లిఖితపూర్వకంగా హామీ పత్రం అందజేశారు. అధికారుల హామీతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించి తిరిగి తరగతులకు వెళ్లారు.












Click it and Unblock the Notifications