అత్యాచారాలపై మరో ఎస్‌పి నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అత్యాచార ఘటనలపై కఠినంగా స్పందించాల్సిందిపోయి.. బాధ్యత రహితమైన వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారు సమాజ్‌వాది పార్టీ అగ్ర నాయకులు. కొన్నిసార్లు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ఉన్న సంబంధం బయటపడుతుందని, అదే అత్యాచారం అంటున్నారని వ్యాఖ్యానించారు మరో సమాజ్‌వాది సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్.
చాలా ప్రాంతాల్లో అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని, అయితే అక్కడ పరువు హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఎంతో విచారకర విషయం ఏమిటంటే వాటిని ఆపలేమని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు వేరే ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని, అయితే అక్కడ ఎక్కువ ప్రచారం జరగడం లేదని రాంగోపాల్ యాదవ్ అన్నారు.

ఇది ఇలా ఉండగా తమ ప్రభుత్వం మొద్దబారినది కాదని, అత్యాచార నిందితులపై చర్యలు తీసుకుంటామని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. ఎవరిపని వారు చేసుకుంటే మంచిదని అత్యాచార ఘటనలపై విమర్శించే వారిపై విరుచుకుపడ్డారు. ఇటీవల ఓ బహిరంగ సభలో అత్యాచార ఘటనలపై ఆయన మాట్లాడుతూ.. కుర్రాళ్లు తప్పులు చేస్తారని, అంత మాత్రాన వారికి ఉరి శిక్ష వేయాలా? అని ప్రశ్నించారు.
ములాయం సింగ్ కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మీడియా తమ రాష్ట్రంలో జరిగే అత్యాచార ఘటనలకే ఎక్కువ ప్రచారం కల్పిస్తోందని రుసరుసలాడారు. ఇలాంటి ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయని, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన అఖిలేష్, పూర్తిగా ఇలాంటి ఘటనలు జరగకుండా చేయడం సాధ్యం కాదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ ప్రాంతంలో ఇద్దరు దళిత బాలికలను గ్యాంగ్ రేప్ చేసి, ఓ చెట్టుకు ఉరివేసిన ఘటన జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications