యుపి ఎన్నికలు: ఆ నలుగురికీ అగ్నిపరీక్ష
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల భవిష్యత్ ను నిర్దేశించనున్నాయి.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల భవిష్యత్ ను నిర్దేశించనున్నాయి. ప్రత్యేకించి యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, బిఎస్ పి అధినేత మాయావతి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకగాంధీ భవితవ్యం, రాజకీయాల్లో వారి పాత్ర తేలనున్నాయి.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు సరైన వారసుడిగా స్థిరపడిపోవడంతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీల తరఫున ప్రధాని అభ్యర్థిగా అఖిలేశ్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ముందుకు తీసుకొస్తుంది.
మూడవ ఫ్రంట్‌కు ప్రధాని అభ్యర్థిగా బీహార్ సిఎం నితీశ్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లతో అఖిలేశ్ తలపడాల్సి ఉంటుంది. లోక్‌సభలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గల సింహ భాగం వల్ల అఖిలేశ్ ప్రధాన అభ్యర్థిగా ముందుకు వచ్చే అవకాశముంది. ఇక సభలో సరైన సంఖ్యా బలం సాధించలేకపోతే బిజెపియే సమాజ్ వాదీ పార్టీ ప్రధాన పోటీదారుగా నిలుస్తుంది.

ఎస్పీ గెలిస్తే అఖిలేష్...
ఇక వరుసగా రెండోసారి, ఆయన సొంత శక్తి సామర్థ్యాలతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ విజయం సాధిస్తే.. దేశ అధ్యక్షుడి ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారనున్నారు. ఆయన సాధించిన ప్రగతి విజయాలపైనా చర్చ జరుగనున్నది. ఇటీవలి కాలంలో యూపీ అసెంబ్లీ చరిత్రలో ఈ ఎన్నికలు రికార్డు కానున్నాయి. అంతేకాదు. ఎస్పీ ప్రతినిధిగా విస్త్రుతస్థాయిలో రాష్ట్ర ప్రజల మద్దతు పొందేందుకు, రాష్ట్ర ప్రగతి సాధనకు ఆయన ప్రణాళిక అమలు కోసం స్వేచ్ఛ కలిగి ఉంటారు. ఇక రాష్ట్రంలో యాదవ్, ముస్లింల మధ్య విస్త్రుతస్థాయి ఓటరు పునాది ఏర్పడుతుంది. అయినప్పటికీ సమాజ్ వాదీ పార్టీలో ఆధిపత్యం కోసం అఖిలేశ్ పోరాడాల్సి ఉంటుంది.

మాయావతిని ముస్లింలు నమ్ముతారా..
ఇక బిఎస్‌పి అధినేత మాయావతి ప్రధాన శక్తిగా అవతరిస్తారా? లేదా? అన్నది ఫలితాలు వెలువడితే గానీ తేలదు. జాతవ్ ల ఓట్లతోపాటు ముస్లింల ఓట్లన్నీ పూర్తిగా పొందగలిగితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆమె తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. కానీ ముస్లిం ఓట్లలో చీలికను నివారించేందుకు సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో మాయావతికి ముస్లింల ఓట్లు పడటం అంత తేలికేం కాదు. జాతవేతర దళితులను తమ వైపునకు తిప్పుకునేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలతో బిఎస్ పికి కొంత నష్టం వాటిల్లే అవకాశముంది.

ఎస్పీతో పొత్తు కాంగ్రెసుకే...
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా కొద్దోగొప్పో లబ్ధి చేకూరే అవకాశమూ లేకపోలేదు. జాతవ్‌లు మాయావతి పక్షాన నిలిచినా.. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది. ఇప్పటివరకు రాయబరేలీలో తల్లి సోనియా, అమేథిలో సోదరుడు రాహుల్ గాంధీ విజయాలకు ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన ప్రియాంకగాందీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకించి పార్టీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు అనుగుణంగా ఆమె పనిచేస్తే పార్టీ విజయావకాశాలు మెరుగవ్వడంతోపాటు 2019 లోక్ సభ ఎన్నికల నాటికి పార్టీలో కీలకమైన పోస్టుకు ఎన్నికయ్యే చాన్స్ ఉంది. తద్వారా రాహుల్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తే ఆమె ప్రచార బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

అమిత్ షాక్ ప్రధాని అండదండలు...
2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే పునరావ్రుతం అవుతాయని ప్రకటిస్తున్న బిజెపికి ఈ అసెంబ్లీ ఎన్నికలు మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశాలే కనిపించడం లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో 80 స్థానాలకు 71 స్థానాలు గెలుచుకున్న కమలం పార్టీ పట్ల ఈ ఎన్నికల్లో ప్రజల్లో అసంత్రుప్తి వ్యక్తమవుతున్నది. అయితే పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షాకు ప్రధాని నరేంద్రమోడీ దీవెనలు, ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అమిత్ షా నాయకత్వ ప్రతిభను కొందరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకులు ప్రశ్నిస్తున్నారు అది వేరే సంగతి. ఎన్నికల ఫలితాల ఆధారంగా బిజెపిలో పార్టీ అధ్యక్షుల మార్పిడి సంప్రదాయం లేదు.

పంజాబ్‌పై కేడ్రీవాల్ ఆశలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటకు వస్తే పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) భారీగానే ఆశలు పెట్టుకున్నది. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్ఫలితాలే సాధిస్తామని ఆశిస్తోంది. ఆశలు, ఆకాంక్షల మేరకు ఆప్ ఏ మాత్రం మెరుగైన విజయాలు సాధించినా.. అరవింద్ కేజ్రీవాల్ ఒక రాష్ట్ర సీఎంగా కంటే అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధిస్తే ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి, ప్రత్యేకించి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రోత్సాహం లభిస్తుంది.












Click it and Unblock the Notifications