
Video: చెత్తబండిలో ప్రధాని మోడీ, సీఎం యోగి ఫొటోలు: విధుల నుంచి కార్మికుడి తొలగింపు, నీళ్లతో కడిగికారులో
లక్నో: చెత్త బండిలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రపటాలను తీసుకెళ్లిన పారిశుద్ధ్య కార్మికుడు తన ఉద్యోగం కోల్పోయాడు. మథురలోని జనరల్ గంజ్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బాబీ అనే వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మోడీ, యోగి ఫొటోలను చెత్తబండిలో తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

చెత్తబండిలో మోడీ, యోగి ఫొటోలు
ఆ వీడియోలో.. పారిశుద్ధ్య కార్మికుడు బాబీ తీసుకెళ్తున్న చెత్త బండిలో మోడీ, యోగి ఫొటోలను ఉండటంతో కొందరు వాటి గురించి అతడ్ని అడిగారు. అయితే, రోడ్డుపక్కన పడివుండటంతో తాను ఆ ఫొటోలను తన చెత్తబండిలో తీసుకెళ్తున్నట్లు బాబీ తెలిపాడు.దీంతో ప్రధాని, సీఎం ఫొటోలను సదరు వ్యక్తులు తీసుకున్నారు. మరో ఫొటో కూడా చెత్త బండిలో లభించింది. కానీ, ఆ వీడియోలో స్పష్టంగా కనిపించలేదు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి.
అందుకే కార్మికుడ్ని తొలగించామంటూ అధికారులు
కాంట్రాక్ట్ కార్మికుడైన బాబీ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే తాము అతడ్ని విధుల నుంచి తొలగించినట్లు మథుర-బృందావన్ నగర్ నిగమ్ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సత్యేంద్ర కుమార్ తివారీ తెల్లడించారు.
తన తప్పేం లేదంటూ పారిశుద్ధ్య కార్మికుడి ఆవేదన
అయితే, తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని పారిశుద్ధ్య కార్మికుడు బాబీ చెబుతున్నాడు. తాను చెత్త సేకరించే పని చేస్తున్నానని, అందుకే రోడ్డు పక్కన ఉన్న ఆ ఫొటోలను కూడా చెత్తబండిలో వేసుకుని తీసుకెళ్తున్నానని చెప్పాడు. తనను విధుల నుంచి తొలగించే ముందు అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకుంటే బాగుండేదని బాబీ తెలిపాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
మోడీ, యోగి ఫొటోలను కడిగి తీసుకెళ్లిన మరో వ్యక్తి
ఇంకొక వీడియోలో రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఆ ఫొటోలను తీసుకున్నాడు. అంతేగాక, ఆ ఫొటోలను నీటితో కడిగాడు. ఆ తర్వాత తన కారులో పెట్టుకుని తీసుకెళ్లాడు.