వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ: ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరం

ఆ ఊళ్లో ఇప్పటి వరకు నాలుగు ఆలయాలు, మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసి పోయాయి. ఈ మధ్య విడుదలైన 'ఉప్పెన' సినిమాలో సముద్రపు ఒడ్డున ఓ గుడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడా గుడి కూడా లేదు

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో సముద్రం ఒడ్డున నివసిస్తున్న వారిని ప్రాణభయం నిత్యం వెంటాడుతోంది

అందమైన జాంధానీ చీరలకు, చేనేత వృత్తి నైపుణ్యానికి నిలయంగా ఉండే ఊరు ఉప్పాడ. కానీ సముద్రపు అలల తాకిడితో ఈ గ్రామం అల్లాడిపోతోంది. గడిచిన రెండు దశాబ్దాల్లోనే వందల ఇళ్లు సముద్రగర్భంలో కలిసిపోయాయి.

సముద్రం చొచ్చుకు వస్తున్న కొద్దీ తాము వెనక్కి జరగడమే తప్ప మరో దారి లేకపోవడంతో మత్స్యకారులంతా ఆందోళనలో ఉన్నారు. దశాబ్ధిన్నర కిందట, కోత నివారణ కోసం నిర్మించిన జియో ట్యూబ్ కూడా ధ్వంసం కావడంతో ముప్పు మరింత పెరిగిందనే అభిప్రాయం బాధితుల నుంచి వస్తోంది.

ప్రభుత్వం మాత్రం ఈ ప్రమాదం నివారించేందుకు మార్గాన్వేషణలో ఉన్నట్టు చెబుతోంది.

ఉప్పాడ ప్రాంతంలో అలలు తీరాన్ని దెబ్బతీయకుండా జియో ట్యూబ్ అనే రక్షణ ఏర్పాటు చేశారు.

40హెక్టార్లు సముద్రంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉప్పాడ గ్రామం ఉంటుంది. మత్స్యకార, చేనేత వృత్తిదారులు అత్యధికంగా జీవిస్తున్నారు. బంగాళాఖాతం తీర ప్రాంత గ్రామమైన ఉప్పాడ ఓ మేజర్ పంచాయితీ.

2011 జనాభా లెక్కల ప్రకారమే 12వేల మంది ఇక్కడ నివశిస్తున్నారు. 3,190 ఇళ్లుండేవి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికే 40 హెక్టార్లకు పైగా భూమి సముద్రంలో కలిసి పోయిందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

నిత్యం తీరంలో నివశించే వారికి సముద్రపు అలల తీవ్రత పెద్ద సమస్యగా మారుతోంది. రానురాను సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండడంతో ఇప్పటికే వందల ఇళ్లు కూలిపోయాయి.

సముద్రపు కోతకు గురై 20 ఏళ్ల కిందట రామాలయం కూలిపోగా, మళ్లీ కొంత దూరంలో నిర్మించారు. ఇప్పుడు అది కూడా కూలిపోయింది.

ముందుకు వస్తున్న సముద్రపు అలల కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు కోల్పోయిన వారు అవస్థలు పడుతున్నారు.

ఉప్పాడలో సముద్రానికి దగ్గరలో ఉన్న ఇళ్లు అలల తాకిడికి కూలిపోతున్నాయి.

'ఎప్పుడు కూలిపోతుందో తెలియదు..’

పెద్ద పెద్ద కెరటాలు వచ్చి ఇంటిని తాకుతుండడం, పెద్ద పెద్ద శబ్దాలు రావడం అక్కడున్న వారికి నిత్యానుభవంగా మారింది. అవి ఎప్పుడు తమ ఇంటిని కూలగొడతాయోనని స్థానికులు భయపడుతుంటారు.

''అమావాస్య, పౌర్ణమి సమయాల్లో అలలు వచ్చి గోడను కొడుతుంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. కానీ ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లాలంటే రూ.3,4 వేలు అద్దె కట్టాలి. అంతశక్తి లేక ఈ ఇంట్లోనే ఉంటున్నాం'' అని అక్కడ నివసిస్తున్న మైలపు ఆదెమ్మ బీబీసీతో అన్నారు.

దాదాపు పదేళ్ల నుంచి ఇలాంటి సమస్య ఎదురవుతుండగా, నాలుగైదేళ్లుగా బాగా పెరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

''కెరటాలు ఇంట్లోకి కూడా వస్తే ఖాళీ చేసి బడిలోకి వెళ్లిపోతాం. మళ్లీ తెల్లారిన తర్వాత వచ్చి అన్నీ శుభ్రం చేసుకుంటాం. సముద్రానికి, మా ఇంటికి మధ్య నాలుగు ఇళ్లుండేవి. అవన్నీ కూలిపోయి ఇప్పుడు మా ఇంటి దాక వచ్చేసింది'' అన్నారు ఆదెమ్మ.

ఆదెమ్మ భర్త వెంకట రమణ రోజూ సముద్రంలో వేటకి వెళతారు. వేట బాగా పడితే రోజుకి వెయ్యి రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. రోజుకి వంద, లేదా అసలు సంపాదన లేక ఖాళీగా వెనక్కి వచ్చే రోజులు కూడా ఉంటాయని ఆమె చెబుతున్నారు.

భర్త వేటకు వెళ్లినప్పుడు ఆదెమ్మ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎప్పుడయినా పెద్ద కెరటాలు వచ్చిన సమయంలో సామాన్లు జాగ్రత్త పరుచుకోవడం, ఒడ్డుకి చేర్చుకోవడం పెద్ద పనిగా మారిపోయిందని ఆమె తెలిపారు.

ఇప్పుడు జగనన్న కాలనీల్లో సమీప గ్రామం సుబ్బంపేటలో తమకు స్థలం ఇచ్చారని, కానీ సముద్రానికి దూరంగా వెళితే వేటకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని తాము అక్కడికి వెళ్లలేదని చెప్పారామె.

కేవలం ఆదెమ్మ మాత్రమే కాకుండా ఉప్పాడలో సముద్రాన్ని ఆనుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిలో అందరికీ ఇది నిత్యకృత్యం. వాస్తవానికి 20 ఏళ్ల క్రితం సముద్రానికి వంద మీటర్ల దూరంలో ఇళ్లు కట్టుకున్న వారికి కూడా ఇప్పుడు తమ ఇళ్లు నిలబడతాయనే ధీమా లేదు. ఇప్పటికే కొన్ని సముద్రం పాలయ్యాయి కూడా.

ఉప్పాడ తీరంలో నివసించే వారు నిత్యం అలలకు భయపడుతూ జీవిస్తున్నారు.

'ఇల్లు, గుడి, బడి దేనికీ రక్షణ లేదు'

''మేం చిన్నప్పుడు చదువుకున్న బడి ఇప్పుడు లేదు. సముద్రంలో కలిసిపోయింది. మార్కెట్ కూడా ఉండేది. ఇప్పుడున్న ఒడ్డుకి మైలు దూరంలో ఉండేవి. అంతా గంగలో కలిసిపోయింది. ఇల్లు పోయిన వాళ్లంతా మెరకలో ఇల్లు కట్టుకుంటున్నారు. లేని వాళ్లు అలా ఒడ్డునే సరిపెట్టుకుంటున్నారు'' అన్నారు ఉప్పాడకు చెందిన మత్స్యకారుడు మైలపల్లి సత్తిరాజు

''తుపాన్లు, అల్పపీడనాలు వచ్చినప్పుడు అలలు చాలా ఎత్తున వచ్చేస్తాయి. వాటి తాకిడికి తట్టుకుని ఉండడం చిన్న విషయం కాదు'' అన్నారాయన.

60 ఏళ్ల వయసున్న సత్తిరాజు తన చిన్ననాడు చూసిన ఊరికి, ఇప్పుడున్న గ్రామానికి పొంతన లేదని చెబుతున్నారు.

జియో ట్యూబ్ రక్షణ ఏర్పాటు కూడా అలల తీవ్రతకు ధ్వంసం అవుతోంది.

'ఉప్పెన' సినిమాలో కనిపించే గుడి కూలిపోయింది..

''మా ఊరిలో ఉప్పెన సినిమా షూటింగ్ జరిగింది. సినిమా క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు గుడి దగ్గర కూర్చుంటారు. ఆ సీన్ షూటింగ్ తీసిన గుడి ఇప్పుడు సముద్రం కోతకు గురయ్యింది. ఆనవాళ్లు మాత్రం ఉన్నాయి. చాలాకాలంగా ఈ సముద్రం వేగంగా ముందుకొచ్చేస్తోంది. మధ్యలో కొన్నాళ్లు జియో ట్యూబ్ వల్ల సముద్రం కోత తగ్గింది. ఇప్పుడా ట్యూబ్ దెబ్బతిన్న తర్వాత ఉప్పాడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది'' అన్నారు ఉప్పాడకు చెందిన పి.వెంకట రమణ.

వెంకట రమణకి తల్లిదండ్రులు కట్టి ఇచ్చిన ఇల్లు కూడా కెరటాల తాకిడితో కూలిపోయింది. అవకాశం ఉన్న వాళ్లంతా దూరంగా కొత్తగా ఇళ్లు కట్టుకుంటుంటే, ఆర్థిక పరిస్థితి బాగలేని వారంతా సముద్రం ఒడ్డునే చిన్నచిన్న ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని వెంకట రమణ వివరించారు.

ఉప్పాడలో సముద్రం ఏటేటా ముందుకు వస్తున్నట్లు నిపుణులు , అధికారులు గుర్తించారు.

జియో ట్యూబ్ ఏమయ్యిందీ..

కాకినాడ పోర్ట్ నుంచి సుమారు 12 కి.మీ. దూరంలో ఉన్న ఉప్పాడ మధ్య తీరం చాలాకాలంగా కోతకు గురవుతోంది. దాని కారణంగా బీచ్ రోడ్డు కూడా అనేకమార్లు దెబ్బతింది. పదే పదే రోడ్లు నిర్మించాల్సి వస్తోంది.

సముద్రతీరాన్ని కోత నుంచి కాపాడేందుకంటూ జియో ట్యూబ్ పేరుతో ఏర్పాట్లు చేశారు. భారీ బండరాళ్లను సముద్రపు ఒడ్డున వేసి కెరటాల తాకిడి తీరాన్ని తాకకుండా అడ్డుకట్టగా మార్చారు. ఉప్పాడ గ్రామాన్ని ఆనుకుని రాళ్లను పెద్ద వలల్లో వేసి అవి అలల తీవ్రతను నివారించేలా ఏర్పాట్లు చేశారు.

నేటికీ బీచ్ రోడ్డులో వేసిన పెద్ద రాళ్లే కోత వేగవంతం కాకుండా నివారించేందుకు దోహదపడుతున్నాయి. కానీ ఉప్పాడ గ్రామాన్ని ఆనుకుని వేసిన ట్యూబ్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం ఆనవాళ్లు కూడా మిగలలేదు.

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నీటి పారుదల శాఖ నిధులతో ఉప్పాడ గ్రామంలో తీవ్రతను అడ్డుకునేందుకు జియో ట్యూబ్ ఏర్పాటు చేయడం విశేషం. అప్పట్లో రూ. 12.6 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేశారు. వాటి ఫలితంగా కొంతకాలం పాటు సముద్రపు కోత నివారణ జరిగింది. తాత్కాలికంగా ఫలితాన్నిచ్చిన ట్యూబ్ దెబ్బతినడానికి అనేక కారణాలున్నాయని అధికారులు అంటున్నారు.

కానీ ప్రస్తుతం మాత్రం ఆ జియో ట్యూబ్ కూడా లేకపోవడంతో ఉప్పాడ గ్రామం మనుగడకే ముప్పుగా మారుతోంది.

ఉప్పెన సినిమాలో కనిపించిన ఆలయం ఇప్పుడు ఇలా అయ్యింది.

ఉప్పాడ తో పాటుగా అనేక గ్రామాలకు ముప్పు..

బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని ఉన్న ఉప్పాడ తో పాటుగా సమీపంలోని కోనపాపపేట, సుబ్బంపేట తో పాటుగా విశాఖ జిల్లాలో ఉన్న పూడిమడక కూడా కోత కారణంగా నష్టపోతోంది. మత్స్యకారుల ఇళ్లు సముద్రం పాలవుతున్నాయి. విలువైన భూమి సముద్ర గర్భంలో కలిసి పోతోంది.

ఒక్క ఉప్పాడ కొత్తపల్లి మండలంలోనే గత కొంతకాలంగా 900 ఎకరాల భూమి సముద్రం పాలయ్యిందని కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఏజీ చిన్ని కృష్ణ బీబీసీకి తెలిపారు.

''దీనికి శాశ్వత పరిష్కారం అవసరమే. ప్రస్తుతానికి ఏటా సమస్య వస్తున్న సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. అన్ని విధాలా ఆదుకుంటున్నాం. ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇటీవల జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇళ్ళు కూడా నిర్మించుకుంటారు. కానీ సముద్రం కోత కారణంగా అనేక ఇళ్లు సముద్రంలో కలిసిపోతున్న తరుణంలో గతంలో జియో ట్యూబ్ కొంత ఫలితాన్నిచ్చింది. శాస్త్రీయమైన పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. శాశ్వత ఏర్పాట్ల ద్వారా ప్రజలను, కోతకు గురవుతున్న గ్రామాలను కాపాడతాం'' అని బీబీసీతో అన్నారు.

ఉప్పాడ తీరంలో మత్స్యకారులు

'ముంబై తరహాలో తీర పరిరక్షణ జరగాలి..’

ఉప్పాడ మంచి పంటలు పండించే ప్రాంతం. జనసమ్మర్థం కూడా ఎక్కువే. ఈ కోత కారణంగా సమీప ప్రాంతాల్లో మంచినీరు ఉప్పునీరుగా మారుతోంది. కోనసీమలోని అనేక మండలాల్లో ఇప్పటికే ఇది స్పష్టంగా కనిపిస్తోందని పర్యావరణ నిపుణులు అంటున్నారు.

''8 మండలాల్లో వ్యవసాయానికి బోర్లు వేయకూడదని అధికారికంగా నిషేధించారు. ఉప్పాడ తీరంలో కోతను అరికట్టే ప్రయత్నం జరగాలి. లేదంటే భవిష్యత్తులో కాకినాడ సహా వివిధ తీర ప్రాంతాలకు ముప్పు ఉందనే అంచనాలు, శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు అలసత్వం వీడాలి'' అని పర్యావరణవేత్త పతంజలి శాస్త్రి అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే ఉప్పాడ సహా సమీప ప్రాంతాల్లో తీర ప్రాంతం కుంగిపోతూ సముద్రపు నీరు వచ్చి చేరుతోందని జియాలజిస్ట్ కృష్ణారావు సహా అనేకమంది నివేదికలు స్పష్టం చేస్తున్నట్టు పతంజలి శాస్త్రి వెల్లడించారు. కాలుష్య నివారణ చేయడం, కోత తీవ్రతను అడ్డుకునే ఏర్పాట్లు ముంబై తరహాలో చేయడం ప్రయోజనకరమని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uppada in East Godavari district: Will this village sink in the sea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X